Kodali Nani: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులను జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొడాలి నానిపై జరుగుతున్న విజిలెన్స్ విచారణ నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని టీడీపీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. కొడాలి నాని అనారోగ్యాన్ని సాకుగా చూపించి అమెరికా వెళ్లేందుకు యత్నిస్తున్నారని, అందుకే ఆయన పాస్‌పోర్టును సీజ్ చేయాలని కోరారు.
ఇలాంటి పరిస్థితుల్లో కొడాలి నాని తప్పుడు చిరునామాను ఉపయోగించి పాస్‌పోర్టు తీసుకొని విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు సీఐడీ అదనపు డీజీకి లేఖ రాసినట్టు సమాచారం. ఈ అంశాన్ని సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నట్టు, అందువల్లే లుకౌట్ నోటీసుల జారీకి సన్నాహాలు చేసినట్టు తెలుస్తోంది.
మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) అక్రమాలపై విజిలెన్స్ శాఖ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో, ఆయన కదలికలపై నిఘా పెట్టాలని టీడీపీ నేత కనపర్తి శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ అమెరికా వెళ్లేందుకు నాని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయన పాస్‌పోర్టును సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ఈ ఫిర్యాదును పరిశీలించినట్టు తెలుస్తోంది. 2019లో పాస్‌పోర్టు కోసం నాని దరఖాస్తు చేసినా, అప్పటికే కేసులు ఉండటంతో దాన్ని తిరస్కరించినట్లు సమాచారం. తీరా, గత ప్రభుత్వ హయాంలో పాస్‌పోర్టు మంజూరై ఉండొచ్చేమోనని పోలీసులు రికార్డులు పరిశీలించగా, ఆయనకు ఇప్పటికీ పాస్‌పోర్టు లేదు అని తెలిసినట్టు సమాచారం. అయితే, హైదరాబాద్ చిరునామా ఉపయోగించి నకిలీ పాస్‌పోర్టు పొందిన అనుమానం ఉందని పేర్కొంటున్నారు. ఈ విషయమై రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయానికి వివరాల కోసం లేఖ పంపినట్టు తెలిసింది.
ఇక, కొడాలి నానిపై వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఎన్నికల నియమావళి ఉల్లంఘన, విశాఖపట్నంలో నమోదైన కేసులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ పొందినట్లు సమాచారం. తాజాగా గుడివాడ మండలం మల్లాయిపాలెం జగనన్న కాలనీలో “మెరక పేరుతో కోట్లాది రూపాయల దోపిడీ” కేసులోనూ నానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే, కొడాలి నాని అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్య పరీక్షల్లో గుండెకు సంబంధించి సమస్యలు ఉన్నట్లు తేలడంతో, మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో ముంబైకి తరలించారు. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా చికిత్స నిర్వహించి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. కొంతకాలం ఆసుపత్రిలో ఉండి కోలుకున్న తర్వాత నాని తిరిగి హైదరాబాద్ వచ్చారు. ప్రస్తుతం, విదేశాల్లో మెరుగైన వైద్యం కోసం నాని వెళ్లే అవకాశముందని అనుమానించి, ముందస్తు జాగ్రత్తగా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.