Chandrababu Naidu : చంద్ర‌బాబు చాణ‌క్యానికి ఛాలెంజ్

తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్ర‌బాబుకు మునుపెన్న‌డూలేని స‌వాల్ ఉక్కిరిబిక్కిరి చేస్తోందని తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 12:29 PM IST

తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్ర‌బాబుకు మునుపెన్న‌డూలేని స‌వాల్ ఉక్కిరిబిక్కిరి చేస్తోందని తెలుస్తోంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలా? పార్టీ ప్ర‌యోజ‌నమా? అధికారమా? అనేది తేల్చుకోవాల్సిన త‌రుణం కనిపిస్తోంద‌ట‌. ఆ మూడు కోణాల నుంచి ఆయ‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లను గ‌మ‌నించాల్సి ఉంటుందని పార్టీ అంత‌ర్గ‌త వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా పార్టీ నిర్ణ‌యాలు ఉంటాయ‌ని ఇటీవ‌ల ఆయ‌న పొత్తుల గురించి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అంటే, ఢిల్లీ పీఠం కూడా ఆయ‌న‌కు అనుకూలంగా ఉండాలి. అదే స‌మ‌యంలో ఆయ‌న రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. ఆ రెండు జ‌రిగితేనే, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలను కాపాడ‌డం సాధ్యం అవుతోంది. అందుకే, టీడీపీ క్ర‌మేణా బీజేపీ వైపు జ‌రుగుతోంద‌ని టాక్‌.

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే మ‌ళ్లీ బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని మెజార్టీ స‌ర్వే సంస్థ‌లు చెప్పే మాట‌. అందుకే, బీజేపీతో క‌లిసి వెళ్లాల‌ని టీడీపీలోని ఒక గ్రూప్ భావిస్తోంది. అంతేకాదు, ఎన్నిక‌ల ముందే ఎన్డీయేలో భాగ‌స్వామికావాలని ఆ టీమ్ చంద్ర‌బాబు మీద ఒత్తిడి తీసుకొస్తోంద‌ట‌. అదే జ‌రిగితే, టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశాలు మెండు. అప్పుడు క‌నీసం 10 నుంచి 15 స్థానాల వ‌ర‌కు జన‌సేన, 3 నుంచి 5 స్థానాల వ‌ర‌కు బీజేపీ గెలుచుకునే ఛాన్స్ ఉంద‌ని స‌ర్వేల సారాంశం. అదే జ‌రిగితే, ఎన్నికల త‌రువాత సీఎంగా చంద్ర‌బాబు ప‌ద‌విని అధిరోహించిన‌ప్ప‌టికీ ఏక్ నాథ్ షిండే లాండోడిని బీజేపీ త‌యారు చేస్తుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌. అందుకే , రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు ముడిపెట్టి పార్టీ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుకోలేమ‌ని ఆ పార్టీలోని కొంద‌రు అభిప్రాయంగా ఉంది.

పార్టీ ప్ర‌యోజ‌నాల కాపాడుకోవాలంటే ఒంటిరి పోరుకు టీడీపీ సిద్ధం కావ‌డం ఒక్క‌టే ఆప్ష‌న్‌. ఒక వేళ అధికారం కోసం జ‌న‌సేన‌, టీడీపీ పొత్తుతో వెళితే, అప్పుడు 10 నుంచి 15 స్థానాల వ‌ర‌కు జ‌న‌సేన గెలుచుకుంటుంద‌ని తాజా స‌ర్వేలు చెబుతున్నాయి. అదే జ‌రిగితే, రాజ్యాధికారం కోసం చూస్తోన్న జ‌న‌సేన ఏ రోజైనా టీడీపీ ప్ర‌భుత్వాన్ని అధికారంలో నుంచి దింపే అవ‌కాశం లేక‌పోలేదు. బ‌య‌ట నుంచైనా జ‌న‌సేన ద్వారా బీజేపీ గేమ్ ఆడిస్తుంద‌ని దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో జ‌రిగిన ప‌రిణామాల ఆధారంగా అర్థం అవుతోంది. ఎటుచూసిన‌ప్ప‌టికీ జ‌న‌సేన‌, బీజేపీతో పొత్తు ఆరోగ్య‌క‌రంగా ఉండ‌ద‌ని టీడీపీలోని ఒక గ్రూప్ బ‌లంగా విశ్వసిస్తోంది. ఒంటరిగా వెళితే, చంద్ర‌బాబు చ‌రిష్మాను చూసి ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకు అంతా టీడీపీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. అదే జ‌రిగితే, క‌నీసం 100 ప్లస్ గెలుచుకుని ప్ర‌భుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకోవ‌చ్చు. అప్పుడు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రంలోని ఏ ప్ర‌భుత్వంపైనైనా నేరుగా ఫైట్ చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంది.

ఒక వేళ అధికారం కోల్పోయిన‌ప్ప‌టికీ బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా టీడీపీ ఉంటుంది. క‌నీసం 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేల‌ను ఒంట‌రిగా వెళ్లైనా గెలుచుకునే అవ‌కాశం ఆ పార్టీకి ఉంది. అప్పుడు కూడా ప్ర‌తిప‌క్షంలో ఉంటూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఫైట్ చేయడానికి అవ‌కాశం ఉంటుంది. అలా కాకుండా జ‌న‌సేన‌, బీజేపీతో పొత్తుతో కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ గాలిలో దీపంలా ప్ర‌భుత్వం తీరు ఉంటుంద‌ని భ‌విష్య‌త్ ను ఊహిస్తోన్న టీడీపీలోని ఒక గ్రూప్ బ‌లంగా విశ్వ‌సిస్తోంది.

పొత్తులేకుండా ఒంటిరిగా లేదా బీజేపీతో క‌లిసి వెళ్లిన‌ప్ప‌టికీ జ‌న‌సేన‌కు 1 నుంచి 3 వ‌ర‌కు ఎమ్మెల్యేల‌ను గెలుచుకుంటుంది. అదే జరిగితే, ఆ పార్టీ మ‌నుగ‌డ క‌ష్టం అవుతోంది. అప్పుడు భ‌విష్య‌త్ లో టీడీపీ ఓటు బ్యాంకును న‌ష్ట‌ప‌రిచే మ‌రో పార్టీ ఉండ‌దు. ఆ కోణం నుంచి ఆలోచించిన‌ప్ప‌టికీ భ‌విష్య‌త్ లో టీడీపీకి లాభ‌మే. అందుకే, పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం మాత్ర‌మే అయితే ఒంట‌రి పోరుకు టీడీపీ దిగాల్సి ఉంటుంది. అధికారం కోస‌మైతే జ‌న‌సేన‌తోనూ పార్టీ ప్ర‌యోజ‌నాల‌ను కాద‌నుకుంటే జ‌న‌సేన‌తో టీడీపీ క‌లిసి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ముందున్న ఈ మూడు ఆప్ష‌న్ల‌లో ఏది ఎంచుకుంటారో చూడాలి.