Site icon HashtagU Telugu

Bheemla Nayak : టీడీపీలో `బీమ్లానాయ‌క్‌` హిట్‌

Babu Lokesh Bheemla

Babu Lokesh Bheemla

కాలానికి అనుగుణంగా రాజ‌కీయ లీడ‌ర్లు వాళ్ల భావాల‌ను మార్చుకుంటున్నారు. సిద్ధాంతాల‌ను, స‌మీక‌ర‌ణాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సానుకూల‌త‌ దిశ‌గా అన్వ‌యించుకోవ‌డం చూస్తున్నాం. జ‌న‌సేనాని ప‌వ‌న్ విష‌యంలో టీడీపీ పూర్తిగా మ‌న‌సు మార్చుకుంది. 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితంలోకి జొర‌బ‌డింది. సిద్దాంతాలంటూ లేని పార్టీగా జ‌న‌సేన‌పైన చంద్ర‌బాబు, లోకేష్ నిప్పులు చెరిగారు. ఒక జీరోగా ప‌వ‌న్ ను ఆనాడు వ‌ర్ణించారు. ప్ర‌జారాజ్యం మాదిరిగా జ‌నసేన విలీనం అవుతుంద‌ని విమ‌ర్శించారు. అమ్ముడు పోయే పార్టీగా టీడీపీ లీడ‌ర్లు ఆనాడు చంద్ర‌మోహ‌న్ రెడ్డితో పాటు జూపూడి ప్ర‌భాక‌ర్ లాంటి ఎస్సీ లీడ‌ర్‌తో దుమ్మెత్తిపోశారు. ఆయ‌న న‌టించిన సినిమాల మీద కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా టీడీపీ క్యాడ‌ర్ డ్యామేజ్ చేసింది. 2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ వ‌ల్ల అధికారం రాలేద‌ని బ‌ల్ల‌గుద్ది లెక్క‌లు చెప్పారు. సీన్‌ క‌ట్ చేస్తే…2022 నాటికి ప‌వ‌న్ కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ జై కొడుతున్నారు. బీమ్లా నాయ‌క్ సినిమాను ప్ర‌మోట్ చేస్తున్నారు. అద్భుతంగా ఆ సినిమా రెస్సాన్స్ ఉంద‌ని లోకేష్ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. సీఎం జ‌గ‌న్ బీమ్లా నాయ‌క్ ను టార్గెట్ చేశాడ‌ని బాబు వ‌రుస ట్వీట్లు చేసి ప‌వ‌న్ ప‌క్షాన నిలిచాడు.

సినిమా టిక్కెట ధ‌ర‌ల నియంత్ర‌ణ‌, ఆన్ లైన్ విధానంపై టీడీపీ ఆచితూచి వ్య‌వ‌హ‌రించింది. సినిమా వాళ్ల‌కు ఎందుకు మ‌ద్ధ‌తు ఇవ్వాల‌నే ధోర‌ణితో మొన్న‌టి వ‌ర‌కు ఉంది. స‌రైన గుణ‌పాఠం సినిమా వాళ్ల‌కు జ‌గ‌న్ చెప్పాడ‌ని పరోక్షంగా టీడీపీ సంబ‌ర ప‌డిన సందర్భాలు లేక‌పోలేదు. సినిమా న‌టుల‌కు తొలి నుంచి టీడీపీ ప్రాధాన్యం ఇచ్చే అల‌వాటు ఉంది. వాళ్ల‌ను ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి తీసుకురావ‌డం ఆన‌వాయితీగా మారింది. కానీ, ఆ పార్టీకి సినిమాలోని ప‌లువురు పెద్ద‌లు అండ‌గా నిల‌వ‌లేద‌ని టీడీపీ భావిస్తోంది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాజెక్టును పూర్తిగా కుప్ప‌కూల్చిన‌ప్ప‌టికీ సినీ హీరోలు మ‌ద్ధ‌తు ప‌ల‌క‌లేదు. పైగా మూడు రాజ‌ధానుల‌కు మెగాస్టార్ చిరంజీవి మ‌ద్ధ‌తు ప‌లికాడు. ఆ కోణం నుంచి ఆలోచించిన టీడీపీ సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల నియంత్ర‌ణ‌, ఆన్ లైన్ విధానంపై మధ్యేమార్గంగా వ్య‌వ‌హ‌రించింది. సినిమా వాళ్ల‌కు అండ‌గా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించ‌లేదు. కానీ, బీమ్లా నాయ‌క్ విష‌యంలో మాత్రం చురుగ్గా స్పందిస్తోంది. ఉద్దేశ పూర్వ‌కంగా ప‌వ‌న్ సినిమాను జ‌గ‌న్ స‌ర్కార్ టార్గెట్ చేస్తోంద‌ని బాబు, లోకేష్ ట్వీట్లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇప్పుడున్న నిబంధ‌న‌లు హీరో బాల క్రిష్ణ న‌టించిన అఖండ స‌మయంలోనూ ఉన్నాయి. ఆ నిబంధ‌న‌లను పాటిస్తూ అఖండ విజ‌య‌వంతంగా ఆడింది. ఆ రోజున చంద్ర‌బాబు, లోకేష్ ఎవ‌రూ ఆ సినిమాకు మ‌ద్ధ‌తుగా ట్వీట్లు చేయ‌లేదు. అఖండ సినిమాకు ఎలాంటి బెనిఫిట్ షోలు ఇవ్వ‌లేదు. టిక్కెట్ల ధ‌ర‌ల నియంత్ర‌ణ ఉంది. పైగా థియేట‌ర్ల‌ను వ‌రుస‌గా సీజ్ చేశారు. అయిన‌ప్ప‌టికీ టీడీపీ నుంచి ఇప్పుడు బీమ్లా నాయ‌క్ కు వ‌చ్చిన మ‌ద్ధ‌తు ఆనాడు క‌నిపించ‌లేదు. వ‌రుస‌గా మూడు ట్వీట్ల‌ను చంద్ర‌బాబు బీమ్లా నాయ‌క్ సినిమాకు అండ‌గా చేశాడు. ఆయన చేసిన మూడు ట్వీట్ల‌ను ప‌రిశీలిస్తే..ప‌వ‌న్ మీద బాబుకు ఉన్న ప్రేమ‌ను తెలియ‌చేస్తోంది.`ఆంధ్ర ప్రదేశ్ సిఎం మాత్రం భీమ్లా నాయక్ పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది…నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను` అంటూ తొలి ట్వీట్ చేశాడు. ఇక రెండో ట్వీట్ లో `రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సిఎం @ysjagan వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది` అంటూ జ‌గ‌న్ ను ఉగ్ర‌వాదితో పోల్చాడు. ఇక మూడో ట్వీట్ లో `వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీ సిమెంట్ రేటు పై లేని నియంత్రణ #BheemlaNayak సినిమా పై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్…తన మూర్ఖపు వైఖరి వీడాలి` అంటూ ప‌వ‌న్ సినిమాను ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లాడు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ కూడా ప‌వ‌న్ సినిమాను ఆకాశానికి ఎత్తేశాడు. ఆ మేర‌కు ఆయ‌న చేసిన ట్వీట్ లో “#భీంలానాయక్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. చూడాలని ఎదురు చూస్తున్నాను.
@వైఎస్ జగన్ఒక పరిశ్రమ తర్వాత మరో పరిశ్రమను ముగించడం ద్వారా APని భిక్షాటన చేసే గిన్నెగా మార్చాలనుకుంటున్నారు, సినీ పరిశ్రమ కూడా దీనికి మినహాయింపు కాదు. #భీంలానాయక్ అన్ని కుట్రలను అధిగమించి విజయం సాధించాలని కోరుకుంటున్నాను“ అంటూ ప‌వ‌న్ సినిమాకు లోకేష్ హిట్ టాక్ తీసుకొచ్చాడు. ఇక టీడీపీ పొలిట్ బ్యూరో మెంట‌ర్ చంద్ర‌మోహ‌న్ రెడ్డి కూడా బీమ్లా నాయ‌క్ మీద స్పందింస్తూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో `బీమ్లా నాయక్ కి షోలు ఎట్లా కట్ చేయాలి, పవన్ కల్యాణ్ హీరో కాబట్టి ఆ సినిమా రిలీజై నష్టాలు వచ్చేంతవరకు సినిమా టికెట్ల ధరల పెంపు లబ్ది కలుగచేయకూడదని భావిస్తున్నట్టున్నారు. అసలు మీరేం చేయగలరు? పవన్ కల్యాణ్ ను హీరో కాకుండా హీరోయిన్ ని చేయగలరా? పవన్ కల్యాణ్ ఎవర్ గ్రీన్ హీరో. ఆయననేం చేయలేరు.“ అంటూ ప‌వ‌న్ ను ఎవ‌ర్ గ్రీన్ గా భావిస్తూ చంద్ర‌మోహ‌న్ రెడ్డి ప్రేమ‌ను చాటుకున్నాడు. ప‌లువురు టీడీపీ లీడ‌ర్లు బీమ్లా నాయ‌క్ సినిమా హిట్ కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. జ‌గ‌న్ ను టార్గెట్ చేస్తూ ప‌వ‌న్ కు అండగా నిలుస్తున్నారు. ఇటీవ‌ల జ‌న‌సేన‌, టీడీపీ క్విడ్ ప్రో కో సిద్ధాంతాన్ని న‌మ్ముకున్నాయి. ఆ మ‌ధ్య టీడీపీ కార్యాల‌యాల‌పై వైసీపీ బీపీ బ్యాచ్ దాడి చేసింది. ఆ సంద‌ర్భంగా ప‌వ‌న్ అండ‌గా నిలుస్తూ టీడీపీకి మ‌ద్థ‌తుగా ట్వీట్లు చేశాడు. ఇప్పుడు బీమ్లా నాయ‌క్ సినిమాకు టీడీపీ సంపూర్ణ మ‌ద్ధ‌తు ఇస్తూ ట్వీట్లు చేస్తోంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే, రాబోవు ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, టీడీపీ ఒక‌ట‌వుతాయ‌ని స్ప‌ష్టం అవుతోంది. ఆ మేర‌కు సిద్ధాంతాల‌ను, భావాల‌ను మార్చుకుని ఆ రెండు పార్టీలు ఇటీవ‌ల ఒకే స్వ‌రాన్ని వినిపిస్తున్నాయి. సో…రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌ని ఆ రెండు పార్టీల వాల‌కం చూస్తే అర్థం అవుతోంది.