YSRCP MP : నాకు నేనే పోటీ.. నాకు లేరవ్వరూ పోటీ..!

కంత్రి సినిమాలో నాకు నేనే పోటీ.. నాకు లేరవ్వరూ పోటీ అన్నట్లు....

  • Written By:
  • Publish Date - September 6, 2022 / 03:00 PM IST

కంత్రి సినిమాలో నాకు నేనే పోటీ.. నాకు లేరవ్వరూ పోటీ అన్నట్లు.. రాజమండ్రి ఎంపీ భరత్ బల్లలు గుద్ది మరీ చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి మరోసారి నేనే అదృష్టాన్ని పరీక్షించుకుంటానని మీడియా ముఖంగా చెప్పేశారు. గత కొంతకాలంగా ఎంపీ భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడంట కదా..? ఎంపీ భరత్ పార్టీ మారుతున్నారంట కదా..? ఎంపీ భరత్‌కు జక్కంపూడికి మధ్య విభేదాల వల్ల అక్కడి నుంచి పోటీ చేస్తారంట కదా..? అనే పుకార్లకు, షికార్లకు మార్గాని భరత్‌ రామ్ చెక్ పెట్టేశారు. రాజమండ్రి పార్లమెంటు స్థానానికి నేనే కింగ్ నంటూ ప్రకటించేసుకున్నారు. తాను ఏ అసెంబ్లీ స్థానానికి వెళ్లడం లేదంటూ కుండబద్దలు కొట్టేశారు.

మార్గాని భరత్ తొలుత సినీ హీరోగా ప్రస్తానం మొదలు పెట్టారు. తండ్రి వ్యాపారాలను చూసుకుంటూ అలా ముందుకు వెళ్తున్న సమయంలో.. ఆకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీలో చేరారు. అసలే యువరక్తం టీడీపీ కార్యక్రమాలను ఎంతో ఘనంగా చేస్తున్నాడని గుర్తించిన చంద్రబాబు తెలుగు యువతకు సంబంధించిన కీలక బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామల వల్ల 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ రాజమండ్రి పార్లమెంటు నుంచి పోటీ చేయాలని చెప్పడంతో.. మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ కొడలు మాగంటి రూపపై పోటీలో నిలబడ్డారు. 1,21,634 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత సామాజిక సమీకరణాల్లో భాగంగా ఢిల్లీ వేదికగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ ఛీఫ్‌గా నియమితులయ్యాడు.

భరత్ అనే నేను సినిమాలో మాదిరిగా తాను కూడా రాజకీయాలు చేయాలని ఎంపీ భరత్ ప్రయత్నించారు. ఆ సినిమాలో భరత్‌కు ఎదురైనా కష్టాలు..ఇక్కడ భరత్‌కు కూడా ఎదురయ్యాయి. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో విభేదాలు, అలాగే సోషల్ మీడియాలో రీల్స్ కు సంబంధించి కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రీల్స్ ఎంపీ అంటూ చురకలు అంటించారు. తాజాగా ఎంపీ, ఎమ్మెల్యే వివాదంపై ఇద్దరు నేతలు మీడియా వేదికగా విమర్శలు చేసుకున్నారు. అధిష్టానం ఇద్దరికి వార్నింగ్ ఇవ్వడంతో కెమెరా ముందుకు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్న.. తెరవెనుక మాత్రం బద్ద శత్రువుల్లాగే ఉన్నారు.

గత కొంతకాలంగా ఎంపీ భరత్ రాజమండ్రి అర్భన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో నిలబడతారని పుకార్లు వినపడ్డాయి. అలాగే పార్టీ మారతారంటూ సోషల్ మీడియాలో కోడై కూసింది. కానీ ఈ యువ ఎంపీ మాత్రం అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చిందో..? లేకపోతే ఏమైందో ఏమోగానీ తాను రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తాను అని క్లారిటీగా చెప్పేశారు. వైసీపీ అభ్యర్థిని నేనేనని వెల్లడించారు. దీంతో ఇన్నాళ్లూ జరిగిన పుకార్లకు, షికార్లకు చెక్ పడినట్లైంది. ఇక టీడీపీ తరపున అభ్యర్థిని ప్రకటించడమే ఆలస్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.