Balakrishna : నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు. బాలయ్య పద్మభూషణ్ సాధించిన మొదటిసారి నిమ్మకూరు రావడంతో గ్రామస్థులు ఆయనకి ఘనస్వాగతం పలికారు. బాలకృష్ణ తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడారు. ‘పద్మభూషణ్ అవార్డు వచ్చిన అనంతరం మా బంధువులతో ఆనందం పంచుకునేందుకు మా ఊరు వచ్చాను. కేవలం తెలుగు వారే కాదు యావత్ దేశం ఎన్టీఆర్ సేవలను గుర్తించుకుంటుంది. ఆయన చేపట్టిన పథకాలు, తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ప్రపంచంలోనే ఎవరూ తీసుకుని ఉండరు.
Read Also: AP Budget 2025 -26 : 3 లక్షల కోట్లతో పద్దు..?
త్వరలోనే కేంద్రం ఆయనకు భారతరత్న ఇస్తుందని ఆశిస్తున్నాం.’ అని బాలయ్య పేర్కొన్నారు. ఇటీవలే కేంద్రం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని అన్నారు. ‘నాకు పద్మభూషణ్ అవార్డు కంటే నాన్నకు భారతరత్న అవార్డు రావాలనేదే కోట్లాదిమంది తెలుగు ప్రజల ఆకాంక్ష.’ అని పేర్కొన్నారు. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవ చేస్తున్నామని అన్నారు. అమరావతిలో కూడా ఆసుపత్రిని నిర్మించేందుకు దాతలు సహకారం ఇచ్చారని, వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలే పేర్లు మార్చి తీసుకొస్తున్నారని బాలకృష్ణ అన్నారు.
కాగా, బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్’ మూవీ ఈ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఆయన తర్వాత సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ‘అఖండ పార్ట్ 1’కి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతుండగా.. ఈ విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కానుంది.