Rahul Gandhi : ఏపీ, తెలంగాణా పొలిటికల్ జోడో

భారత్ జోడో యాత్ర మీదా తెలంగాణా కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుంది. తొలిరోజు యాత్ర కు వచ్చిన స్పందన చూసిన తరువాత తెలంగాణా కాంగ్రెస్ కు ఉత్తేజం కనిపిస్తుంది .

  • Written By:
  • Updated On - October 25, 2022 / 12:38 PM IST

భారత్ జోడో యాత్ర మీదా తెలంగాణా కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుంది. తొలిరోజు యాత్ర కు వచ్చిన స్పందన చూసిన తరువాత తెలంగాణా కాంగ్రెస్ కు ఉత్తేజం కనిపిస్తుంది. ఇతర పార్టీలకు వెళ్లాలని భావించిన కొందరు లీడర్లు కూడా యాత్ర చూసిన తరువాత పునరాలోచనలో పడ్డారని తెలిసింది. కోవర్టులు, అసంతృప్తి వాదులు కూడా ఆచితూచి అడుగు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతుందన్న సంకేతం ఇవ్వడానికి యాత్ర ఉపయోగ పడుతుందని అంచనా. ఒక వేళ యాత్ర తరువాత కూడా పార్టీ తీరు మారకపోతే తెలంగాణ, ఏపీలో కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పొత్తు దిశగా వెళ్లనుందని వినికిడి. జాతీయ రాజకీయాల సమీకరణల ను తీసుకుంటే ఆ రెండు పార్టీలు వివిధ రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయడానికి ప్రశాంత్ కిశోర్ లైన్ క్లియర్ చేస్తున్నాడని ప్రచారం ఉంది. కనీసం ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీ ఆర్ ఎస్, ఏం ఐ ఏం కలసి కూటమిగా వెళతాయని తెలుస్తుంది. మహారాష్ట్ర, బీహార్, ఏపీ, తెలంగాణా, కర్ణాటక కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లోని ఈ కూటమి కలుస్తుందని ఢిల్లీ వర్గాల్లోని టాక్. అయితే ఇదంతా తెలంగాణా లో యాత్ర విజయాన్ని బట్టి ఉంటుందని పలు వర్గాల్లోని చర్చ.

అక్టోబరు 27న నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి భారత్ జోడో యాత్రను పునఃప్రారంభిస్తారు. తెలంగాణ రైతులు, మహిళలు, యువతను ఆకట్టుకునేలా ఆయన యాత్ర ప్రధానంగా టార్గెట్ చేయనుంది. ఆ మేరకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణాలో ఎంట్రీ ఇచ్చిన తొలిరోజే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై నుంచి గుడేబల్లూర్‌లో ప్రజలను ఉద్దేశించి క్లుప్తంగా ప్రసంగించారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువతకు సంబంధించిన అన్ని బాధలను తాను వింటానని చెప్పారు. ఈ యాత్ర కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉందని ఉద్ఘాటిస్తూనే, ఇది ద్వేషానికి వ్యతిరేకంగా, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టింది.

‘జాతి ఐక్యత కోసం చేస్తున్న భారత్ జోడో యాత్రను ఎవరూ ఆపలేరు. దీన్ని దెబ్బతీయాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రయత్నిస్తున్నాయని’ అన్నారు. ఢిల్లీకి విమానంలో వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత కృష్ణా నదిని దాటుతున్న యాత్ర వైమానిక దృశ్యాన్ని చూపించే వీడియోను ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది. “ప్రేమ నది భారతదేశం గుండా ప్రవహిస్తోంది, పురోగతి, శ్రేయస్సు కోసం ఆశను పునరుజ్జీవింపజేస్తుంది అంటూ కొటేషన్ ఇచ్చారు. మొత్తం మీద తెలంగాణా భారత్ జోడో యాత్ర తెలుగు రాష్ట్రాల రాజకీయ సమీకరణాలను మార్చనుంది . రాహుల్ గాంధీ అక్టోబర్ 27న నారాయణపేట జిల్లా మక్తల్ గ్రామం నుంచి యాత్రను పునఃప్రారంభించనున్నారు. దానికి ఎలాంటి స్పందన రానుందో చూద్దాం.