కదిరి జనసేన పార్టీ నేత భైరవ ప్రసాద్‌పై కేసు నమోదైంది. తన భర్త కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, అతనికి ఉన్న అలవాట్ల గురించి ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురై తనపై దాడి చేశాడని భైరవ ప్రసాద్ భార్య శశికళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తలతో పాటు శరీరంలోని పలుచోట్ల ఐరన్ రాడ్‌తో కొట్టి గాయపరిచాడని ఆమె ఆరోపించారు. అడ్డుకునేందుకు వచ్చిన తన కూతురు సాయి వర్షిణిపై కూడా దాడి చేసి గాయపరిచినట్లు ఫిర్యాదులో తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీసులు ప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జనసేన పార్టీ ముఖ్య నేతపై కేసు నమోదైంది. భార్య, కూతురు ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. శ్రీ సత్య సాయి కదిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్, లాయర్ భైరవ ప్రసాద్ కుటుంబం కదిరి టౌన్‌లోని ఎన్జీవో కాలనీలో నివాసం ఉంటోంది. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. భైరవ ప్రసాద్ భార్య శశికళ, కూతురు సాయి వర్షిణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు.
భైరవ ప్రసాద్ భార్య, తన భర్త కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆయనకు ఉన్న కొన్ని అలవాట్ల గురించి అడిగినందుకు ఇనుప రాడ్‌తో తనపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై దాడి జరుగుతున్న సమయంలో అడ్డుకున్నందుకు తన కుమార్తె సాయి వర్షిణిపై ప్రసాద్ దాడి చేసినట్లు చెప్పారు. తల్లీకూతుళ్లు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రసాద్ దాడిలో శశికళ తలకు బలమైన గాయమైంది. భార్య ఫిర్యాదుతో ప్రసాద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ప్రసాద్ భార్య శశికళ, కుమార్తె సాయి వర్షిణి నుంచి వాంగ్మూలం నమోదు చేయనున్నారు. అలాగే కేసు నమోదు కావడంతో పోలీసులు భైరవ ప్రసాద్‌ను పిలిచి విచారణ చేస్తారా.. అదుపులోకి తీసుకుంటారా అన్నది చూడాలి. ప్రసాద్ స్వతహాగా లాయర్ కూడా కావడంతో కోర్టుకు వెళ్లి బెయిల్ ప్రయత్నాలు ఏవైనా చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
భైరవ ప్రసాద్ ఇటీవల శ్రీసత్యసాయి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి లోకేష్‌ను కూడా కలిశారు. సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేశారు. అయితే ఇంతలో భార్య, కుమార్తెపై దాడి చేశారని ఆరోపణలు రావడం కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికార కూటమిలో ఉన్న నేతపై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. భార్య ఆరోపణలపై భైరవ ప్రసాద్ ఎలాంటి వివరణ ఇస్తారనేది కీలకంగా మారింది.
