YS Jagan : క‌లెక్ట‌ర్లు, ఎమ్మెల్యేలు, పోలీసుల‌కు ర్యాంకులు

క‌లెక్ట‌ర్లు, ఎమ్మెల్యేలు, పోలీసుల‌కు ర్యాంకులు ఇవ్వ‌డానికి కొన్ని కొల‌మానాల‌ను ఏపీ సీఎం జ‌గ‌న్ నిర్థారించారు. ఏడు ర‌కాల కొల‌మానాల ప్ర‌కారం ర్యాంకులు ఇస్తామ‌ని స్పంద‌న కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా నిర్వ‌హించిన వీడియో కాన్షరెన్స్ ద్వారా క‌లెక్ట‌ర్ల‌కు వివ‌రించారు

  • Written By:
  • Publish Date - April 27, 2022 / 04:19 PM IST

క‌లెక్ట‌ర్లు, ఎమ్మెల్యేలు, పోలీసుల‌కు ర్యాంకులు ఇవ్వ‌డానికి కొన్ని కొల‌మానాల‌ను ఏపీ సీఎం జ‌గ‌న్ నిర్థారించారు. ఏడు ర‌కాల కొల‌మానాల ప్ర‌కారం ర్యాంకులు ఇస్తామ‌ని స్పంద‌న కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా నిర్వ‌హించిన వీడియో కాన్షరెన్స్ ద్వారా క‌లెక్ట‌ర్ల‌కు వివ‌రించారు. అంతేకాదు, పోలీసుల ప‌నితీరును ఏసీబీ, ఎస్‌ఈబీ, దిశ, సామాజిక మాధ్యమాల వేధింపుల నివారణ త‌దితర కొల‌మానాలను నిర్థారించారు. గృహనిర్మాణం, నాడు-నేడు, స్పందన ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, ఎస్‌డిజి లక్ష్యాలు, ఎన్‌ఆర్‌ఇజిఎస్, సమగ్ర భూ సర్వే, గ్రామ/వార్డు సచివాలయాల పనితీరు వంటి ఏడు అంశాల‌ను తీసుకుని జిల్లా కలెక్టర్ల పనితీరును అంచనా వేయనున్నట్లు జ‌గ‌న్ వెల్ల‌డించారు.

ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌ను క‌లెక్ట‌ర్ల‌కు జ‌గ‌న్ వివ‌రించారు. నాడు-నేడు కార్యక్రమం అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు గా ఫోక‌స్ చేశారు. విద్యాసంస్థల పునరుద్ధరణకు సుమారు రూ.16,000 కోట్లు, ప్రభుత్వ ఆసుపత్రుల పునరుద్ధరణకు మరో రూ.16,000 కోట్లు వినియోగిస్తున్నట్లు వెల్ల‌డించారు. మే 2వ తేదీ నుంచి ఆయా పాఠశాలల్లో ఎమ్మెల్యేలు పర్యటిస్తారని క‌లెక్ట‌ర్ల‌కు తెలిపారు. పునరుద్ధరించిన పాఠశాలల నిర్వహణపై ఉద్ఘాటించారు. ప్రతి వారం స్పందన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు.

‘ఆప్షన్ 3’ కింద ఇళ్ల నిర్మాణాలు ఏప్రిల్ 28 నుంచి ప్రారంభమవుతాయని జ‌గ‌న్ తెలిపారు. పీఎంఏవై, వైఎస్‌ఆర్‌- ప‌థ‌కం కింద.1.79 లక్షల గ్రామీణ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించడమే కాకుండా అదే రోజు 1.23 లక్షల ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. మొత్తంగా 21.24 లక్షల ఇళ్లు టార్గెట్ గా ముందుకెళుతున్నామ‌ని చురుకైన పాత్ర పోషించిన ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అవార్డులు అందజేస్తామన్నారు. గృహనిర్మాణ కార్యక్రమాన్ని సమీక్షించిన సీఎం తొలి దశలో 15.6 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయని, కేసుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని, పరిష్కరించకుంటే ప్రత్యామ్నాయ స్థలాలను చూసుకోవాలని కోరారు.
నిడా కింద రూ.2,500 కోట్లతో రోడ్ల నిర్వహణ పనులు, రూ.1,158 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల విస్తరణ పనులు ప్రభుత్వం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రోడ్ల నిర్వహణకు ఇంత పెద్దమొత్తంలో నిధులు వెచ్చించి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ వాటి చిత్రాలను తీయాలని, ఆ మేర‌కు ప్రజలకు తెలియజేయాలన్నారు.

స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం 26 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ప్రజల ఫిర్యాదులతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. సానుభూతి, మానవత్వంతో ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. సుపరిపాలన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి 26 జిల్లాలను ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. సూక్ష్మస్థాయి లక్ష్యాలను ఉంచుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో 60 శాతానికిపైగా పనులు పూర్తి చేయడంతోపాటు ప్రతి జిల్లాలో రోజుకు లక్ష పనిదినాలు, నెలలో 25 లక్షల పనిదినాలు కల్పించాలని టార్గెట్ పెట్టారు.