Site icon HashtagU Telugu

Tragedy : గ్రానైట్ రాళ్లు విరిగిపడి, ఆరుగురు మృతి.. మరికొందరికి గాయాలు..

Tragedy

Tragedy

Tragedy : బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని సత్య కృష్ణ గ్రానైట్ క్వారీలో జరిగిన ఘోర ప్రమాదం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది. శనివారం ఉదయం పనిలో నిమగ్నమైన కార్మికులపై భారీ గ్రానైట్ అంచు ఒక్కసారిగా విరిగి పడటంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతులందరూ ఒడిశాకు చెందిన వలస కూలీలుగా గుర్తించబడ్డారు.

సాక్షుల వివరాల ప్రకారం, క్వారీలో అప్పటికి 15 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. సాధారణంగా లాగే రాళ్లను చెక్కుతుండగా, ఎటువంటి హెచ్చరిక లేకుండా భారీ గ్రానైట్ అంచు ఒక్కసారిగా కూలిపోయింది. బండరాళ్లు ఒక్కసారిగా కూలిపోవడంతో కార్మికులు తప్పించుకునే సమయం దొరకలేదు. కొంతమంది మట్టి, రాళ్ల కింద చిక్కుకుపోగా, ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని హుటాహుటిన నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.

MS Dhoni: సీఎస్కే జ‌ట్టులో కొన్ని లోపాలు ఉన్నాయి.. ఎంఎస్ ధోనీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్రాథమిక దర్యాప్తులో క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం, రాళ్ల స్థితి పరిశీలించకపోవడం వంటి అంశాలు ఈ ప్రమాదానికి దారితీశాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు బృందం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతోంది. కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఘటనపై అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించిన సీఎం, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్న ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. “రోజువారీ కూలీలు మృతి చెందడం బాధాకరం. గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని తెలిపారు.

ప్రతి సంవత్సరం ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వలస కార్మికుల ప్రాణాలను రిస్క్‌లో పెట్టి లాభాలు మాత్రమే దండుకుంటున్నారని వారు మండిపడుతున్నారు.

Illegal Mining Mafia : రాజానగరంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా