CBN Tour : చంద్రబాబు పొన్నూరు, బాప‌ట్ల‌ స‌భ‌ల‌కు జ‌న‌సందోహం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు(CBN) విలువ ఏపీ ప్ర‌జ‌లు(Public) తెలుసుకుంటున్నారు.

  • Written By:
  • Updated On - December 9, 2022 / 05:41 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు విలువ ఏపీ ప్ర‌జ‌లు తెలుసుకుంటున్నారు. రెండోసారి (2019) సీఎం కాక‌పోవ‌డంతో రాష్ట్రానికి జ‌రిగిన న‌ష్టాన్ని గ్ర‌హించిన‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే, ఎక్క‌డికి వెళ్లిన‌ప్ప‌టికీ తండోప‌తండాలుగా జ‌నం ఎగ‌బ‌డి వ‌స్తున్నారు. మూడు రోజుల పాటు `ఇదేం ఖ‌ర్మ ..మ‌న రాష్ట్రానికి` అనే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోన్న ఆయ‌న‌కు  పొన్నూరు, బాప‌ట్ల  ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. వ‌ర్షాల కార‌ణంగా రెండు రోజులకు కార్య‌క్ర‌మాన్ని కుదించుకున్న ఆయ‌న  చీరాల‌ బ‌హిరంగ స‌భల‌ను వాయిదా వేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఈనెల 8, 9,10 తేదీల్లో ఆయ‌న పొన్నూరు, చీరాల‌, బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించే షెడ్యూల్ ఫిక్స్ అయిన విష‌యం విదిత‌మే. ఆ క్ర‌మంలో తొలి రోజు పొన్నూరు వెళ్లిన ఆయ‌న‌కు జ‌నం నుంచి వ‌చ్చిన స్పంద‌న క‌నీవినీ ఎరుగ‌ని విధంగా ఉంది. స‌హ‌జంగా పొన్నూరు టీడీపీకి కంచుకోట‌. 2019లో దాన్ని బ‌ద్ద‌లుకొట్టిన వైసీపీ మీద అక్క‌డి టీడీపీ క్యాడ‌ర్ క‌సిగా ఉన్నారు. పైగా ధూళ్లిపాళ్ల న‌రేంద్ర నాయ‌క‌త్వం పొన్నూరులో చంద్ర‌బాబు రోడ్ షో సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఆ రోడ్ షో క‌ర్నూలు, ఏలూరు, గోదావ‌రి జిల్లాల‌ను మించిన విధంగా ఉంది. వ్యవ‌సాయాధారిత జిల్లాగా ఉన్న  గుంటూరు రైతుల‌తో చంద్ర‌బాబు ముఖాముఖి నిర్వ‌హించారు. అక్క‌డి ముస్లిం పెద్ద‌ల‌తో ఆయ‌న ఆత్మీయ స‌మ్మేళ‌నం పెట్టారు. వ‌ర్షాల కార‌ణంగా  చీరాల్లో నిర్వ‌హించాల్సిన రోడ్ షోను వ‌ర్షాల కార‌ణంగా చంద్ర‌బాబు ర‌ద్దు చేసుకున్నారు.

ముస్లింల‌కు తెలుగుదేశం పార్టీ చేసిన స‌హాయ, స‌హ‌కారాల గురించి చంద్ర‌బాబు వివ‌రించారు. `2014 తరువాత దుకాన్ మకాన్, దుల్హన్ పథకం తీసుకువచ్చాం. వాటన్నింటిని ఈ సీఎం వచ్చిన తరువాత రద్దు చేశాడు. టీడీపీ వచ్చిన తరువాత మళ్లీ దుల్హన్ పథకం తీసుకువస్తా. జగన్ రెడ్డిలా మోసం చెయ్యను. దుల్హన్ పథకం కింద లక్ష చెల్లిస్తా. రంజాన్ తోఫాకు డబ్బులు లేవు. దుకాన్ మకాన్ కు డబ్బులు లేవు. విదేశీ విద్యకు డబ్బులు లేవు. కానీ సాక్షికి మాత్రం ప్రకటనలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి.` అంటూ ముస్లిం ఆత్మీయ స‌మ్మేళ‌నంలో చంద్ర‌బాబు మండిప‌డ్డారు. ముస్లింల రిజర్వేషన్లు కాపాడే బాధ్యత తీసుకుంటాన‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. సుప్రీం కోర్టులో దీని కోసం మీ తరఫున పోరాడుతాను” అంటూ చంద్రబాబు వివరించారు. మసీదులకు పట్టాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్న చోట సమస్యను పరిష్కరిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చంద్రన్న బీమా పథకాన్ని తిరిగి అమలు పరచాలని ముస్లింలు కోరగా, అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తాం అని వెల్లడించారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా గురువారం, శుక్ర‌వారాల్లో పెదకాకాని, నారాకోడూరు, పొన్నూరులో పర్యటన జ‌రిగింది. నారాకోడూరులో రైతులతో సమావేశం అయ్యారు. రాత్రి పొన్నూరులో బస చేసి శుక్రవారం ముస్లింలతో సమావేశం అయ్యారు. అనంతరం బాపట్ల జిల్లాలో చుండూరుపల్లి, అప్పికట్ల గ్రామాల్లో ప్రజలతో ముఖాముఖి, బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాల ఎస్‌సి విద్యార్థులు, మహిళలతో విడివిడిగా భేటీ  అయ్యారు. పొన్నూరు, కేంద్రంగా జ‌యహో బీసీ స్లోగ‌న్ వినిపించారు. మొత్తం మీద చంద్ర‌బాబు రెండో రోజుల పొన్నూరులో జ‌రిగిన `ఇదేం ఖ‌ర్మ‌..మ‌న రాష్ట్రానికి` అపూర్వ ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో టీడీపీ శ్రేణుల్లో నూత‌నోత్సాహం తొణికిస‌లాడుతోంది.