Pawan Kalyan: జ‌న‌సేనాని `ఛాలెంజ్` కు మాజీ మంత్రి సై

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ అలియాస్ వాసు జ‌న‌సేనాని ప‌వ‌న్ కు ఇస్తోన్న గౌర‌వం ఇటీవ‌ల బాగా ప్రాచుర్యం పొందింది. తాజాగా ప‌వ‌న్ విసిరిన స‌వాల్ కు అనుగుణంగా కాట‌న్ దుస్తుల్లో బాలినేని ద‌ర్శ‌నం ఇస్తూ ఆ మేర‌కు ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

  • Written By:
  • Updated On - August 8, 2022 / 02:20 PM IST

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ అలియాస్ వాసు జ‌న‌సేనాని ప‌వ‌న్ కు ఇస్తోన్న గౌర‌వం ఇటీవ‌ల బాగా ప్రాచుర్యం పొందింది. తాజాగా ప‌వ‌న్ విసిరిన స‌వాల్ కు అనుగుణంగా కాట‌న్ దుస్తుల్లో బాలినేని ద‌ర్శ‌నం ఇస్తూ ఆ మేర‌కు ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇటీవ‌ల వీర‌మ‌హిళ‌ను మాజీ మంత్రి వాసు అనుచ‌రుడు ఫోన్లో అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం విదిత‌మే. రెండు రోజుల పాటు రాజ‌కీయ రాద్దాంతం ఆ ఫోన్ కాల్ పై జ‌రిగింది. వీర‌మ‌హిళ రాయ‌పాటి అరుణ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఆక‌తాయిల‌కు బాలినేని మ‌ద్ధ‌తు ఇస్తూ, పోలీసుల‌కు ఆదేశాలు ఇచ్చాడ‌ని ఆమె ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఆ క్ర‌మంలో జ‌న‌సేన‌, వైసీపీకి ఒంగోలు కేంద్రంగా జ‌రిగిన రాద్దాంతానికి ఫుల్ స్టాప్ పెట్టేలా బాలినేని స్పందించారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ ప‌రోక్ష వార్నింగ్ కు తలొగ్గిన ఆయ‌న వీర‌మ‌హిళ‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌డం విదిత‌మే.

తాజాగా ఆగ‌స్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ విసిరిన చేనేత ఛాలెంజ్ ను జ‌నసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వీక‌రించారు. అంతేకాదు, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, బీజేపీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ లను నామినేట్ చేశారు. ఆ నేపథ్యంలో, పవన్ ఛాలెంజ్ పట్ల బాలినేని వాసు వెంటనే స్పందించారు. చేనేత దుస్తులను ధరించిన ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు. పవన్ కల్యాణ్ విసిరిన చేనేత ఛాలెంజ్ ను స్వీకరించానని వెల్లడించారు.

 

 

వైఎస్సార్ ప్రభుత్వంలో చేనేత మంత్రిగా చిత్తశుద్ధితో పనిచేశానని ట్వీట్ లో పొందుప‌రిచారు. అప్ప‌ట్లో వైఎస్సార్ రూ.300 కోట్ల మేర చేనేతలకు రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. ప్ర‌స్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వంలోనూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం నేతన్న నేస్తం తదితర పథకాలు అమలు చేస్తున్నామని బాలినేని వివ‌రించారు. చేనేతల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం నిజాయతీతో పనిచేస్తున్నామని ప‌వ‌న్ విసిరిన ఛాలెంజ్ ను పార్టీ ప్ర‌చారం కోసం వ్యూహాత్మ‌కంగా వాడుకున్నారు. అందరూ చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు.

మాజీ మంత్రి వాసు ట్వీట్ పై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. “గౌరవనీయ బాలినేని వాసు గారూ… నాడు చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం మీరు చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు అభినందనలకు నోచుకున్నాయి. ఇప్పుడు మీరు నా చాలెంజ్ ను స్వీకరించి చేనేత కార్మికుల పట్ల మరోసారి మీ అంకితభావాన్ని ప్రదర్శించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సర్” అంటూ పవన్ ట్వీట్ చేశారు.

అటు మాజీ మంత్రి వాసు ఇటు ప‌వ‌న్ ట్వీట్‌, రీ ట్వీట్ల‌ను గ‌మ‌నిస్తే, వాళ్లిద్ద‌రి మ‌ధ్యా ఇటీవ‌ల పెరిగిన రాజ‌కీయ బాండింగ్ ను తెలియ‌చేస్తోంది. దానికి కార‌ణాలు లేక‌పోలేదు. ఫ‌క్తు రాజ‌కీయ‌వేత్త‌గా ఉన్న వాసు ఏ నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ సానుకూల రాజ‌కీయాన్ని క్రియేట్ చేసుకోవాల‌ని అనుకుంటారు. ఇటీవ‌ల ఆయ‌న మీద ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా అస‌హ‌నం వ్య‌క్తం అవుతోంది. ఆయ‌న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వెళ్లిన‌ప్పుడు ప్ర‌జ‌లు కొన్ని చోట్ల నిల‌దీశారు. ఆ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను బూతులు తిట్టారు. దీంతో ఒక్క‌సారి ఆయ‌న మీద నెగిటివ్ ప్ర‌చారం మొద‌లైయింది. దానికితోడుగా రాయ‌పాటి అరుణ కు వైసీపీ కార్య‌క‌ర్త అనుచిత వ్యాఖ్య‌ల‌తో కాల్ చేయ‌డం నెగిటివ్ ప్ర‌చారానికి దారితీసింది.

కాపు సామాజిక‌వ‌ర్గం దూరం అవుతుంద‌ని గ్ర‌హించిన వాసు వెంట‌నే ప‌వ‌న్ ఇచ్చిన ప‌రోక్ష వార్నింగ్ కు క్ష‌మాప‌ణ చెప్పార‌ని టీడీపీ వ‌ర్గీయుల భావ‌న‌. ఇప్పుడు ప‌వ‌న్ ఛాలెంజ్ ను స్వీక‌రిస్తూ ఇద్ద‌రి మ‌ధ్యా బాండింగ్ ఉంద‌ని నిరూపించే ప్ర‌య‌త్నం వెనుక ఒంగోలు కేంద్రంగా కాపు ఓటు బ్యాంకును ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ఆయ‌న వేసిన ఎత్తుగ‌డ‌గా ప్ర‌త్య‌ర్థులు అంచ‌నా వేస్తున్నారు. మొత్తం మీద జ‌న‌సేనకు స‌న్నిహితంగా ఇటీవ‌ల బాలినేని మెల‌గ‌డం ఒంగోలు రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.