వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల కోసం తగాదాలు పడుతున్న దృశ్యం బాధాకరమని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 40 సంవత్సరాల రాజకీయాల్లో ఎంతో హుందాగా వ్యవహరించారని, కానీ ఇప్పుడు షర్మిల మరియు జగన్ ఆయనను బజారుకు కీడుస్తున్నారని పేర్కొన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్, ఆయన సోదరి మరియు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలైన షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బాలినేని స్పందించారు. ‘ఆడబిడ్డ కన్నీరు ఆ ఇంటికి అరిష్టం’ అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు వైఎస్ విజయమ్మ ముందుకు రావాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోరారు. వేరే వాళ్లు దీనిలో జోక్యం చేసుకోవద్దని ఆయన సూచించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదని తెలిపారు. తాను ఏ పార్టీలో ఉన్నా, వైఎస్సార్ కుటుంబం బాగుండాలని కోరుకొంటానని చెప్పారు. కొంతమంది వైసీపీ నేతలు ప్రభుత్వం ఉన్నపుడు ఆస్తులు సంపాదించుకుని, ప్రభుత్వం మారాక పార్టీ మారానని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నా కుమారుడి సాక్షిగా చెబుతున్నాను. వైకాపాలో ఉన్న సమయంలోనే నా ఆస్తులు పోగొట్టుకున్నా, సంపాదించుకోలేదు. ఆ విషయం జగన్‌కు కూడా తెలుసు. ఎలా ఉన్నా, మనసులోనే ఉంచుకున్నాను. చాలా ఇబ్బందులు అనుభవించినప్పటికీ, ఆ విషయాన్ని బయటపెట్టలేదు. నా సంస్కారం వల్లనే దాని గురించి మాట్లాడలేదు. అప్పుల కోసం నా తండ్రి, కోడలి ఆస్తి అమ్మి తీర్చాను. ఇదంతా జగన్‌కు తెలుసు. ఎన్నికల ముందే నిన్ను పార్టీలోకి తీసుకుందాం అనుకున్నా, కానీ జగన్ బంధువు అని ఆగిపోయాను’ అని పవన్ చెప్పారు. ఆయన హుందాగా మాట్లాడారు. వైకాపాలో బాలినేని వంటి మంచి వ్యక్తులు ఉన్నారని అప్పట్లో చెప్పారు. జగన్ ఒంగోలు వచ్చి కూడా ఇళ్ల పట్టాల విషయంలో నా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. మంత్రి పదవి వదులుకుని జగన్ వెంట నడిచాను. ఆ పార్టీలో నాకు ఏమైందో ప్రజలకు తెలుసు’ అని బాలినేని వ్యాఖ్యానించారు.