Balakrishna: ఏపీ పాలిటిక్స్.. ర‌చ్చ‌లేపుతున్న‌ బాల‌కృష్ణ వ్యాఖ్య‌లు..!

  • Written By:
  • Updated On - February 4, 2022 / 04:12 PM IST

టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ఈరోజు హిందూపురంలో దాదాపు ఇర‌వై నిముషాల‌పాటు మౌన‌దీక్ష చేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని, లేకుంటే తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌తో పాటు హిందూపురంలో టీడీపీ పార్టీ కౌన్సిల‌ర్లు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని బాల‌కృష్ణ తెలిపారు.

జిల్లా కేంద్రానికి ఉండ‌వ‌ల్సిన అన్ని అర్హ‌త‌లతో పాటు, అన్ని వ‌స‌తులు హిందూపురానికి ఉన్నాయని, దీంతో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించి, స‌త్య‌సాయి జిల్లాగా పేరు పెట్టాల‌ని బాల‌కృష్ణ డిమాండ్ చేశారు. వైసీపీ స‌ర్కార్ అర్ధ‌రాత్రి జీవోలు ఇచ్చి, ప్ర‌జ‌ల‌ను విడ‌దీస్తున్నార‌ని, 31 మంది మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ల‌ను గెలిపించినా, ఈ ప్రాంతం వారికి అన్యాయం చేస్తున్నార‌ని బాల‌కృష్ణ అన్నారు.

వైసీపీ ప్ర‌భుత్వం కావాల‌నే హిందూపురాన్ని వేరు చేసి చూస్తుంద‌ని, జ‌గ‌న్ స‌ర్కార్ కార‌ణంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఇబ్బందు ప‌డుతున్నార‌ని, బాల‌కృష్ణ మండిప‌డ్డారు. క‌డ‌ప జిల్లాకు వైఎస్ఆర్ పేరు పెడితే, ఎలాంటి అభ్యంత‌రం తెల‌ప‌కుండా టీడీపీ ప్ర‌భుత్వం కొన‌సాగించింద‌ని, అయితే వైసీపీ మాత్రం అధికారంలోకి వ‌చ్చాక అన్న క్యాంటీన్ల‌ను ఎందుకు ఎత్తివేశారో చెప్పాల‌ని బాల‌య్య ప్ర‌శ్నించారు.

ఇక అధికార వైసీపీ నేతలకు రాష్ట్ర అభివృద్ధి తప్ప, అంతా కావాలని, జ‌గ‌న్ స‌ర్కార్ ఏపీకి ఒక పరిశ్రమను కూడా తేలేక‌పోయింద‌ని బాల‌కృష్ణ మండిప‌డ్డారు. ఇక‌పోతే బాలకృష్ణ వ్యాఖ్య‌ల పై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో కౌంట‌ర్లు ఇస్తున్నారు. డైలాగులు చెప్ప‌డానికే బాగుంటాయ‌ని, ప్ర‌భుత్వం పుట్టపర్తినే జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టిస్తే, బాలకృష్ణ నిజంగా రాజీనామా చేస్తారా, అస‌లు మీ బావ చంద్ర‌బాబు ఒప్పుకుంటారా, రాజీనామా చేసి మ‌ళ్ళీ ఎన్నిక‌ల‌కు వెళ్ళ‌డ‌మంటే, డైలాగులు చెప్పి చ‌ప్ప‌ట్లు కొట్టించుకున్నంత ఈజీ కాద‌ని వైసీపీ శ్రేణులు కౌంట‌ర్లు వేస్తున్నారు.