Bhuma Akhila Priya : భూమా అఖిలప్రియ‌ బెయిల్ మంజూరులో ట్విస్ట్.. అఖిలకు ఓకే.. కానీ..

టీడీపీ యువ నేత నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర న‌ద్యాల‌కు చేరుకున్న క్ర‌మంలో లోకేశ్ కు స్వాగ‌తం ప‌లికేందుకు వ‌చ్చిన అఖిల ప్రియ‌, ఏవీ సుబ్బారెడ్డి వ‌ర్గీయుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది.

  • Written By:
  • Publish Date - May 24, 2023 / 09:00 PM IST

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya)కు బెయిల్ మంజూరు అయింది. క‌ర్నూల్(Kurnool) కోర్టు ఆమెకు కండిషన్ పై బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు ప్రతి గురు, శుక్రవారాల్లో నంద్యాల(Nandyala) తాలూకా పిఎస్ లో సంతకం చేయాలని కోర్టు అఖిల ప్రియ‌ను ఆదేశించింది. ప్ర‌స్తుతం ఆమె క‌ర్నూల్ మ‌హిళా జైలులో రిమాండ్ ఉన్నారు. ఎనిమిది రోజులుగా అఖిల ప్రియ జైలులోనే ఉంటుంది. తాజాగా కోర్టు(Court) బెయిల్ మంజూరు చేయ‌డంతో కర్నూలు మహిళా జైలు నుండి ఆమె విడుద‌ల కానున్నారు. అయితే, బెయిల్ మంజూరు విష‌యంలో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేవ‌లం అఖిల ప్రియ‌కు మాత్ర‌మే కోర్టు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అఖిల ప్రియ‌తో పాటు ఈ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆమె భర్త భార్గవ రాముడు, మిగతా నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించింది.

టీడీపీ యువ నేత నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర న‌ద్యాల‌కు చేరుకున్న క్ర‌మంలో లోకేశ్ కు స్వాగ‌తం ప‌లికేందుకు వ‌చ్చిన అఖిల ప్రియ‌, ఏవీ సుబ్బారెడ్డి వ‌ర్గీయుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఈ ఘ‌ర్ష‌ణ క్ర‌మంలో అఖిల ప్రియ వ‌ర్గీయులు సుబ్బారెడ్డిపై దాడికి దిగారు. దీంతో సుబ్బారెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పాత గొడ‌వ‌ల‌న్నీ అందులో వివ‌రించి అఖిల‌ప్రియ భ‌ర్త కుట్ర చేశార‌ని పేర్కొన్నారు. దీంతో పోలీసులు హ‌త్యాయ‌త్నం కింద కేసు న‌మోదు చేశారు. మ‌రుస‌టిరోజు తెల్ల‌వారు జామున అఖిల ప్రియ‌తో పాటు ఆమె భ‌ర్త భార్గ‌వ రాముడు, ప‌లువురిని పోలీసులు అరెస్టు చేశారు. అదే రోజు రిమాండ్‌పై అఖిల ప్రియ‌ను క‌ర్నూల్ మ‌హిళా జైలుకు త‌ర‌లించారు. తాజాగా కోర్టు ఆమెకు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన వారికి బెయిల్ మంజూరు కాలేదు.

ఈ ఘ‌ట‌న అనంత‌రం నియోజ‌క వ‌ర్గానికి ఇన్‌చార్జ్ గా ఉన్న అఖిల‌ప్రియ జైల్లో ఉండ‌టంతో యాత్ర‌లో పాల్గొన‌లేక పోయారు. ఆమె త‌ర‌పున త‌మ్ముడు జ‌గ‌త్ విఖ్యాత్ రెడ్డి యాత్ర‌లో పాల్గొన్నారు. నంద్యాల ఘ‌ట‌న‌పై టీడీపీ అధిష్టానం త్రిస‌భ్య క‌మిటీ వేసింది. క‌మిటీ స‌భ్యులు ఘ‌ట‌న‌కు సంబంధించిన విష‌యాల‌పై నివేదిక‌ను అధిష్టానంకు అందించిన‌ట్లు తెలిసింది. అయితే, ఘ‌ట‌న స‌మ‌యంలో అఖిల ప్రియ‌, ఏవీ సుబ్బారెడ్డి ఇద్ద‌రూ ప‌రిధులు దాటార‌ని త్రిస‌భ్య క‌మిటీ నివేదిక ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

 

Also Read :  YCP Criminal status : YCP నేర‌ చిట్టా విప్పిన CBN! జ‌గ‌న్ జ‌మానాలో 70శాతం పెరిగిన‌ కోర్టు ఖ‌ర్చు!!