ఏపీ రాజ‌కీయ చిత్రాన్ని మ‌ర్చే బ‌ద్వేల్ ఉప‌పోరు

బ‌ద్వేలు ఉప పోరుకు దూరంగా ఉండాల‌ని తెలుగుదేశం పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. రాజ‌కీయ సంప్ర‌దాయాన్ని అనుస‌రించాల‌ని ఆ పార్టీ భావించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మర‌ణిస్తే, ఆ ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యులకు ఏక‌గ్రీవంగా ఇచ్చే సంప్ర‌దాయం కొంత కాలంగా కొన‌సాగుతోంది.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:20 PM IST

బ‌ద్వేలు ఉప పోరుకు దూరంగా ఉండాల‌ని తెలుగుదేశం పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. రాజ‌కీయ సంప్ర‌దాయాన్ని అనుస‌రించాల‌ని ఆ పార్టీ భావించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మర‌ణిస్తే, ఆ ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యులకు ఏక‌గ్రీవంగా ఇచ్చే సంప్ర‌దాయం కొంత కాలంగా కొన‌సాగుతోంది. దాన్ని ప్ర‌వేశ పెట్టిన పార్టీగా తెలుగుదేశంకు గుర్తింపు ఉంది. అందుకే ఇప్పుడు బ‌ద్వేలు ఉప పోరులో నామినేష‌న్ వేయ‌కుండా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఇటీవ‌ల మ‌ర‌ణించిన బ‌ద్వేలు ఎమ్మెల్యే వెంక‌ట‌సుబ్బ‌య్య స‌తీమ‌ణి అక్క‌డ నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతున్నారు. ఆ మేర‌కు వైసీపీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి మ‌ర‌ణించాడు. ఆ సంద‌ర్భంగా ఆ కుటుంబానికి చెందిన అఖిల‌ప్రియ‌కు పోటీ చేసే అవ‌కాశం టీడీపీ ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ అక్క‌డ నుంచి. అప్ప‌ట్లో వైసీపీ అభ్య‌ర్థిగా బ్ర‌హ్మానంద‌రెడ్డిని బ‌రిలో నిలిపింది. ఆ విష‌యం కూడా టీడీపీ పొలిట్ బ్యూరోలో చ‌ర్చ‌కు వ‌చ్చిందని తెలిసింది. ఆనాడు సంప్ర‌దాయాన్ని పాటించ‌కుండా వైసీపీ పోటీ చేసిన వైనాన్ని రివ్యూ చేసిన పొలిట్ బ్యూరో ప్ర‌స్తుతం బ‌ద్వేల్ అంశంపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డింది. చివ‌ర‌కు చంద్ర‌బాబు నిర్ణ‌యం మేర‌కు బ‌ద్వేలు ఉప పోటీ నుంచి త‌ప్పుకోవాల‌ని టీడీపీ తీర్మానం చేసింది. ఆ విష‌యాన్ని తెలియచేస్తూ ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెంనాయుడు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
కుటుంబం, వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేక ఎజెండాతో బీజేపీ ప‌నిచేస్తోంది. ఆ స్లోగ‌న్ ఓట్ల‌నుసంపాదించుకోవ‌డానికి బీజేపీకి 2014, 2019 ఎన్నిక‌ల్లో బాగా ప‌ని చేసింది. దేశ వ్యాప్తంగా ఇలాంటి ప్ర‌చారాన్ని బీజేపీ బ‌లంగా చేస్తోంది. గాంధీ కుటుంబం గురించి ప‌దేప‌దే చెబుతూ కాంగ్రెస్ పార్టీని ఇర‌కాటంలో ప‌డుతోంది. ఇదే పంథాను ఇప్పుడు ఏపీ బీజేపీ అనుస‌రించ‌నుంది. వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు భిన్నంగా బద్వేల్ ఉప పోరులో దిగాల‌ని బీజేపీ నిర్ణ‌యం తీసుకుంది. ఆ మేర‌కు అభ్య‌ర్థి కోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. అభ్య‌ర్థులుగా నిల‌ప‌‌డానికి న‌లుగురి పేర్ల‌ను ప‌రిశీలిస్తోంది. మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి అడ్డ‌గా బ‌ద్వేల్ ను ఆ పార్టీ భావిస్తోంది. ఆయ‌న అనుచ‌రుల‌ను అక్క‌డ నుంచి పోటీకి నిల‌పాల‌ని భావిస్తోంది. వైసీసీ, బీజేపీ మ‌ధ్య ముఖాముఖి పోటీ జ‌రిగే, ఎన్ని ఓట్లు వ‌స్తాయో అంచ‌నా వేయ‌డానికి ఈ ఎన్నిక‌ను మోడ‌ల్ గా క‌షాయ‌ద‌ళం భావిస్తోంది.
ఉప పోరుకు దూరంగా ఉన్న టీడీపీ, జ‌న‌సేన క్యాడ‌ర్ ఇప్పుడు ఎవ‌రికి మ‌ద్ధ‌తు ఇస్తారు అనేది పెద్ద ప్ర‌శ్న‌. ఇటీవ‌ల జ‌రిగిన జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌కు టీడీపీ దూరంగా ఉన్న సంద‌ర్భంలో జ‌న‌సేన వైపు మొగ్గు క‌నిపించింది. టీడీపీ సంప్ర‌దాయ ఓటు బ్యాంకు జ‌న‌సేన వైపు వెళ్లింద‌ని అంచ‌నా. అందుకే జ‌న‌సేన‌ చెప్పుకోద‌గ్గ ఫ‌లితాల‌ను సాధించ గ‌లిగింది. ఇప్పుడు ఆ రెండు పార్టీలు దూరంగా ఉన్న ఈ సంద‌ర్భంలో ఓటు బ్యాంకు బీజేపీకి మ‌ళ్లుతుందా? లేక వైసీపీకి వెళుతుందా? అనేది స‌మీప భ‌విష్య‌త్ లో తేల‌బోతుంది. దాని ఆధారంగా రాష్ట్రంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు చాలా వేగంగా మారే అవ‌కాశం లేక‌పోలేదు.