టీటీడీ జంబో బోర్డుపై కుత‌కుత‌.. వైకాపా ఎమ్మెల్యే తిరుగుబాటు

  • Written By:
  • Updated On - September 18, 2021 / 02:10 PM IST

మునుపెన్న‌డూ లేనివిధంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లికి జంబో టీంను ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మొత్తం 81 మందితో క‌మిటీని జ‌గ‌న్ స‌ర్కార్ ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రుల సిఫార‌స్సులు, మంత్రి ప‌ద‌వి ఆశించిన కొంద‌రికి, సామాజిక ఈక్వేష‌న్లు, వ్యాపార‌, వాణిజ్య వ‌ర్గాల‌ను సంతృప్తి ప‌రుస్తూ జంబో క‌మిటీని వేసింది. కానీ, సొంత పార్టీలోని వాళ్లే ఈ క‌మిటీలో ఉండ‌డానికి ఇష్ట‌ప‌డ‌డంలేదు. వాళ్ల‌లో ప్ర‌ధానంగా ఎమ్మెల్యే బాబూరావు ఒక‌రు. ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
రెగ్యులర్ సభ్యులుగా 25 మంది…ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మందికి బోర్డులో అవకాశం కల్పించారు. పార్టీ నుంచి మూడు ప్రాంతాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఎంపిక చేసారు. అందులో తొలి నుంచి జగన్ కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే బాబూరావు కు అవకాశం ల‌భించింది. ప్రకాశం జిల్లాకు చెందిన కనిగిరి ఎమ్మెల్యే మధుసూధన్ యాదవ్ , కర్నూలు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి కి ఖరారు చేసారు. అయితే,ఎమ్మెల్యే బాబూరావు ఆ పదవి తనకు వద్దంటూ తిరస్కరించి నట్లుగా చెబుతున్నారు. దీంతో..ఆయన స్థానంలో నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు అవకాశం ఇచ్చారు. గొల్ల బాబూరావు 2009లో కాంగ్రెస్ నుంచి పాయకరావు పేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత కాంగ్రెస్ ను వీడి..జగన్ కు మద్దతుగా నిలిచారు.
అనర్హత వేటు పడటంతో వైసీపీ లో చేరి 2012 ఉప ఎన్నికలోనూ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో బాబూరావు వైసీపీ నుంచి అమలాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసారు. కానీ, ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. తిరిగి 2019 ఎన్నికల్లో పాయకరావు పేట ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్ధి బంగారయ్య పైన గెలిచారు. ఆయన జగన్ అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ లో జిల్లా నుంచి తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ, విశాఖ జిల్లా నుంచి అవంతి శ్రీనివాస రావుకు ఛాన్స్ దక్కింది. ఆ తరువాత నియమించిన టీటీడీ బోర్డులో బాబూరావు పేరు వినిపించింది. ఏ కారణం చేతనోగానీ ఆయనకు బదులు ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజును ఎంపిక చేశారు. అప్పట్లో నిరాశ చెందిన ఆయనకు ఈ పర్యాయం అధిష్ఠానం అవకాశం కల్పించి టీటీడీ బోర్డుసభ్యుడిగా నియమించింది. ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించటం ద్వారా ఇక, కేబినెట్ లో ఛాన్స్ ఉండదనే సమాచారంతో… ఆయన టీటీడీ పదవి తిరస్కరించినట్లుగా తెలుస్తోంది.
బాబూరావును బ‌జ్జగించేందుకు విజ‌య‌సాయిరెడ్డి రంగంలోకి దిగారు. ఆయ‌న‌కు ఫోన్ చేయ‌గా, టీటీడీ పదవి అవసరంలేదటూ బాబూరావు స్పష్టంగా చెప్పటం తో పాటుగా ..ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. రానున్న కాలంలో కేబినెట్ లో చోటు చేసుకొనే మార్పుల ఆధారంగానే ముఖ్యమంత్రి జగన్ ముగ్గురు ఎమ్మెల్యేలకు టీటీడీ లో స్థానం కల్పించినట్లుగా అంచనా వేస్తున్నారు.
ఇక జ‌గ‌న్ ఏర్పాటు చేసిన 81 మంది స‌భ్యుల్లో ఎక్కువ మంది కేంద్ర మంత్రులు ప్ర‌తిపాదించ‌న వాళ్లు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం రాజ‌కీయ పున‌రావాస కేంద్రంగా మారింద‌ని హిందూ స‌మాజం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. దీని ప‌రిణామాలు భవిష్య‌త్ లో ఎలా ఉంటాయో చూడాలి.