Azadi Ka Amrit Mahotsav :ఆ`జాదు` ప్ర‌కంప‌న‌లు

ఏ చిన్న అంశం దొరికినా దాన్ని భూత‌ద్దంలో పెట్టి చూడ‌డం ఏపీ రాజ‌కీయాల్లో స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. ఇప్పుడు భీమ‌వ‌రం కేంద్రంగా జ‌ర‌గ‌నున్న `ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వం` ఏపీ రాజ‌కీయ పార్టీల‌ను ఆలోచింప చేస్తోంది.

  • Written By:
  • Updated On - July 1, 2022 / 02:08 PM IST

ఏ చిన్న అంశం దొరికినా దాన్ని భూత‌ద్దంలో పెట్టి చూడ‌డం ఏపీ రాజ‌కీయాల్లో స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. ఇప్పుడు భీమ‌వ‌రం కేంద్రంగా జ‌ర‌గ‌నున్న `ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వం` ఏపీ రాజ‌కీయ పార్టీల‌ను ఆలోచింప చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం పంపిన కేంద్ర ప్ర‌భుత్వం జ‌న‌సేనాని ప‌వ‌న్ కు ఇవ్వ‌లేదు. తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్ర‌బాబుకు ఆహ్వానం పంపిన‌ప్ప‌టికీ ఆయ‌న బదులుగా అచ్చెంనాయుడు హాజ‌ర‌వుతున్నార‌ని తెలుస్తోంది. ఇక ఏపీ సీఎం జ‌గ‌న్ ఎలాగూ అధికారిక హోదాలో హాజ‌ర‌వుతార‌ని తెలుస్తోంది. అదే స‌భ‌కు వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు హాజ‌రు కానున్నారు. ఆ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా మీడియా వెల్ల‌డించారు.

భార‌తదేశానికి స్వాతంత్ర్య వ‌చ్చిన 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఈ ఏడాది ఆగ‌స్ట్ 15వ తేదీ నుంచి 2023 ఆగ‌స్ట్ 15వ తేదీ వర‌కు ఈ ఉత్స‌వాల‌ను కేంద్రం నిర్వ‌హిస్తోంది. స‌మాజానికి స్పూర్తినిచ్చే మ‌హానుభావుల‌ను స్మ‌రించుకుంటూ ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆ క్ర‌మంలో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ భీమ‌వ‌రంలో జ‌ర‌గ‌నుంది. ఆ సంద్భంగా అక్క‌డ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ముఖ్య అతిథిగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ జూలై 4వ తేదీన హాజ‌రుకానున్నారు. ఆ ఉత్స‌వాల‌కు ప్ర‌ముఖుల‌ను, వివిధ పార్టీల‌కు చెందిన చీఫ్ ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఆహ్వానించింది. ఆ మేర‌కు ఆహ్వానాల‌ను పంప‌డంతో పాటు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఫోన్లు చేసి చెబుతున్నారు.

జ‌న‌సేనాని ప‌వ‌న్ కు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఆహ్వానం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వంగా బీజేపీ, జ‌న‌సేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఏపీ, తెలంగాణ రాజ‌కీయాల‌ను న‌డుపుతున్నాయి. కానీ, తెలంగాణ బీజేపీ ఎప్పుడో జ‌న‌సేన పార్టీని ప‌క్క‌న పెట్టేసింది. అందుకే, టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గుచూపుతోంది. హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా గులాబీ పార్టీకి జ‌న‌సేన మ‌ద్ధ‌తు ప‌లికింది. ఆనాటి నుంచి తెలంగాణ బీజేపీ దూరంగా పెట్టింది. ఇక ఏపీలో క‌లిసి వెళుతున్న‌ట్టు క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో ఎవ‌రిదోవ‌న వాళ్లు ప‌నిచేసుకుంటున్నారు. బ‌ద్వేలు, ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ పోటీ చేయ‌గా జ‌న‌సేన దూరంగా ఉంది. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నాన‌ని ప‌వ‌న్ చెబుతున్న‌ప్ప‌టికీ ఢిల్లీ నుంచి ఎలాంటి సంకేతం ఆయ‌న‌కు అంద‌లేదు. అందుకే, ఇటీవ‌ల టీడీపీతో పొత్తుకు సై అనే సంకేతాలు ఇచ్చారు.

తాజా ప‌రిణామాలను చూస్తుంటే, జ‌న‌సేన పార్టీని బీజేపీ పూర్తిగా దూరంగా పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. పైగా మెగాస్టార్ చిరంజీవి ద్వారా ఆప‌రేష‌న్ మొదలు పెట్టింద‌ని తెలుస్తోంది. ఇంత కాలం పాటు బ‌ద్ధ శ‌త్రువుగా చూసిన టీడీపీని కూడా ద‌గ్గ‌ర‌కు చేర్చుకుంటూ బీజేపీ ఆహ్వానం పంపింది. అంతేకాదు, చంద్ర‌బాబుకు ఫోన్ చేసి కిష‌న్ రెడ్డి మాట్లాడారు. రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజుకు కూడా ప్ర‌త్యేకంగా ఆహ్వానం పంపారు. స్థానిక ఎంపీ గా ఉన్న ఆయ‌న‌కు ప్రొటోకాల్ ప్ర‌కారం ఆహ్వానం ఉండ‌డం ష‌రామామూలే. కానీ, ఆయ‌న వ‌స్తే, ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ లో భీమ‌వ‌రం చేరుకోవ‌డానికి త్రిబుల్ ఆర్ సిద్ధం అయ్యారు. ఆ మేర‌కు ఆయ‌న టైంను కూడా తెలియ‌చేస్తూ మీడియా ముఖంగా వెల్ల‌డించారు. ఆ మీటింగ్ పూర్తికాగానే వెంట‌నే అదే హెలికాప్ట‌ర్లో తిరుగు ప్ర‌యాణం అయ్యేలా షెడ్యూల్ చేసుకున్నారు. ఇప్ప‌టికే ఏపీ సీఐడీ పోలీసులు ఆయ‌న‌కు జారీ చేసిన నోటీసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటి ఆధారంగా అరెస్ట్ చేస్తారా? అంటే చేయండ‌ని స‌వాల్ చేస్తున్నారు త్రిబుల్ ఆర్. మొత్తం మీద‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాల్గొనే `ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌` ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది.