Avinash case :తాడేప‌ల్లి కోట‌కు ఊర‌ట‌,ఈనెల 25 వ‌ర‌కు కూల్

మ‌రో వారం వ‌ర‌కు తాడేప‌ల్లి వ‌ర్గాల‌కు(Avinash case) ఊర‌ట క‌లిగింది. 25 తేదీ వ‌ర‌కు

  • Written By:
  • Updated On - April 18, 2023 / 05:46 PM IST

మ‌రో వారం వ‌ర‌కు తాడేప‌ల్లి వ‌ర్గాల‌కు(Avinash case) ఊర‌ట క‌లిగింది. ఈనెల 25 తేదీ వ‌ర‌కు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయ‌డానికి లేద‌ని తెలంగాణ హైకోర్టు(High court) చెప్పింది. అయితే, అప్ప‌టి వ‌ర‌కు సీబీఐ విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని అవినాష్ రెడ్డిని ఆదేశించింది. అవినాశ్ విచారణ సంద‌ర్భంగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టం చేసింది. ప్ర‌తి రోజూ ఈనెల 25వ తేదీ వ‌ర‌కు విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఆ రోజున బెయిల్ పిటిషన్ పైన తుది తీర్పు ఇస్తామని తెలియ‌చేసింది. తుది తీర్పు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

మ‌రో వారం వ‌ర‌కు తాడేప‌ల్లి వ‌ర్గాల‌కు ఊర‌ట(Avinash case) 

బెయిల్ పిటిష‌న్ మీద సుదీర్ఘ వాద‌న‌లు ఇరు ప‌క్షాల మ‌ధ్య జ‌రిగాయి. ఈ హత్యతో ఎలాంటి సంబంధం అవినాష్ రెడ్డికి(Avinash case) లేదని ఆయ‌న త‌ర‌పున‌ న్యాయ‌వాదులు వాదించారు. వివేకా హత్య కేసు రోజున మృతదేహం వద్దకు అవినాశ్ వెళ్లే వరకు చాలామంది ఉన్నారని చెప్పారు. సాక్ష్యాలు తారుమారు చేసే ఆలోచన లేదన్నారు. ఈ హత్యకు కుటుంబ తగాదాలు, వ్యాపార తగదాలు కావొచ్చునని, రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చునని వాదనలు వినిపించారు. ప్ర‌తిగా వివేకా హత్య వెనుక కుటుంబ, వ్యాపార తగాదాలు లేవని సీబీఐ త‌ర‌పున న్యాయ‌వాదులు కోర్టుకు విన్న‌వించారు. అవినాశ్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని, ఆయన సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నాలు చేశారని కోర్టుకు(High court) వివ‌రించారు. వైయస్ వివేకా కుమార్తె సునీత కూడా ఇంప్లీడ్ పిటిష‌న్ వేసిన దరిమిలా వాదనలు వినిపించారు.

వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను క‌స్ట‌డీకి

ఇదిలా ఉండగా చంచ‌ల్ గూడ జైలులో ఉన్న‌ వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని సీబీఐ నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టును కోరింది. వాళ్లిద్ద‌రినీ 6 రోజుల క‌స్ట‌డీకి ఇస్తూ కోర్టు అనుమ‌తి ఇచ్చింది. మ‌రింత స‌మాచారం రాబ‌ట్టేందుకు సీబీఐ ప్ర‌య‌త్నం చేయ‌నుంది. బ‌హుశా వాళ్లిద్ద‌రూ చెప్పే వివ‌రాల‌కు అనుగుణంగా ఈనెల 25వ తేదీ వ‌ర‌కు అవినాష్ రెడ్డిని(Avinash case) సీబీఐ విచారించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ఈ కేసు మీద ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన సీబీఐ కొన్ని వివ‌రాల‌ను కోర్టుకు తెలియ‌చేసింది. హ‌త్య‌కు నెల రోజుల ముందే కుట్ర జ‌రిగింద‌ని సీబీఐ భావిస్తోంది. అందుకోసం సుమారు రూ. 40 కోట్ల సుఫారీ కుదుర్చుకున్నార‌ని నిర్థారిస్తోంది. ఆ మొత్తంలో నాలుగు నుంచి ఐదు కోట్ల వ‌ర‌కు చేతులు మారాయ‌ని సీబీఐ చెబుతోంది.

అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌పై డీజీపీతో జ‌గ‌న్ 

కేసు ద‌ర్యాప్తు తుది ద‌శ‌కు వ‌చ్చిన క్ర‌మంలో స‌మాజంలో ప‌లుకుబ‌డి ఉన్న భాస్కర్ రెడ్డి ద‌ర్యాప్తు మీద ప్ర‌భావం చూప‌గ‌ల‌ర‌ని కోర్టుకు సీబీఐ చెప్పింది. విచార‌ణ సంద‌ర్భంగా సరైన సమాధానాలు భాస్క‌ర రెడ్డి ఇవ్వడంలేదని సీబీఐ అధికారులు వివరించారు. అందుకే అతడిని అరెస్ట్ చేశామని, కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు వివ‌రించారు. దీనికి స్పందించిన కోర్టు ఆరు రోజుల పాటు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి క‌స్ట‌డీకి ఇచ్చింది. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా వాళ్లిద్ద‌రూ ఉన్న విష‌యం విదిత‌మే.

Also Read : Jagan : తాడేప‌ల్లిలో పోస్టుమార్టం,ఏ క్ష‌ణ‌మైన ఢిల్లీకి జ‌గ‌న్?

అటు తెలంగాణ హైకోర్టు(High court) ఇటు నాంప‌ల్లి సీబీఐ కోర్టుల్లో జ‌రిగిన పరిణామాల‌ను ఎప్ప‌టికప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌మీక్షించారు. ఏపీ డీజీపీతో క‌లిసి ఆయ‌న ఈ కేసుల గురించి చ‌ర్చించార‌ని తెలిసింది. ఆదివారం నాడు వైఎస్ భాస్క‌ర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంద‌ర్భంగా పులివెందుల వ్యాప్తంగా బంద్, నిర‌స‌న‌లు జ‌రిగాయి. అందుకు ప్ర‌తిగా శాంతి ర్యాలీని తీయ‌డానికి వైసీపీ శ్రేణులు కొన్ని రంగంలోకి దిగాయి. ఒక వేళ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తే ప‌రిస్థితిని అదుపులో ఉంచ‌డానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌పై డీజీపీతో జ‌గ‌న్ స‌మీక్షించిన‌ట్టు తెలుస్తోంది. అయితే, ఈనెల 25వ తేదీ వ‌ర‌కు అవినాష్ రెడ్డి (avinash case )అరెస్ట్ వ‌ద్దంటూ కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు వెలువ‌రించ‌డంతో తాడేప‌ల్లి వ‌ర్గాలకు తాత్కాలిక ఉప‌శ‌మ‌నం క‌లిగింది.

Also Read : Viveka Murder Case: వివేకాను హత్య కేసులో ట్విస్ట్.. దస్తగిరి సంచలన నిజాలు!