CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu) అమరావతి ప్రాంత మహిళలపై జరిగిన అనుచిత, అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి యాజమాన్యంలోని ఓ ఛానెల్‌లో జర్నలిస్ట్ వి.వి. కృష్ణంరాజు చేసినవిగా ఆరోపణలు ఉన్నాయి. అమరావతిని “వేశ్యల రాజధాని”గా అభివర్ణించడం ద్వారా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం తన ప్రకటనలో తెలుగు సమాజంలో మహిళలకు ఇచ్చే గౌరవాన్ని, స్త్రీ శక్తిని ఆరాధించే సంప్రదాయాన్ని గుర్తు చేశారు. రాజకీయ కక్షలు, మీడియా విశ్లేషణల పేరుతో మహిళలపై దాడి చేయడం క్షమించరాని నేరమని, ఇటువంటి విష సంస్కృతిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇలాంటి విధ్వంసకర వైఖరికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పటికీ, ఈ వ్యాఖ్యలు ఆ వైఖరిలో మార్పు లేనట్లు చూపిస్తున్నాయని ఆయన విమర్శించారు.
Also Read: Virat- Rohit: విరాట్, రోహిత్‌లకు ఫేర్‌వెల్ మ్యాచ్‌ను ఏర్పాటు చేసిన ఆస్ట్రేలియా!
ఈ వ్యాఖ్యలకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి ఇంతవరకు ఖండించకపోవడం, మహిళలకు క్షమాపణ చెప్పకపోవడం విచారకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల గౌరవాన్ని కాపాడేందుకు, ఇలాంటి నీచమైన సంస్కృతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సిపి) ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ.. ఇవి తెలుగుదేశం పార్టీ చేపట్టిన “దురుద్దేశపూరిత” ప్రచారమని పేర్కొంది. వైఎస్ఆర్‌సిపి నాయకుడు పోతిన మహేష్ ఈ వ్యాఖ్యలు ఒక జర్నలిస్ట్ చేసినవని, పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. టీడీపీ సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్‌సిపి నాయకులను అపప్రదలో చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ సంఘటనకు సంబంధించి అమరావతి ప్రాంతంలో మహిళలు నిరసనలు చేపట్టారు. పెదకూరపాడులో మహిళా నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు.