Punganur : పుంగ‌నూరులో వైసీపీ `దెందులూరు` త‌ర‌హా బీభ‌త్సం

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అప్ర‌క‌టిత‌ ఎమ‌ర్జెన్సీ ఉంద‌న్న ఫీలింగ్ విప‌క్షాల్లో నెల‌కొంది.

  • Written By:
  • Publish Date - December 5, 2022 / 04:47 PM IST

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అప్ర‌క‌టిత‌ ఎమ‌ర్జెన్సీ ఉంద‌న్న ఫీలింగ్ విప‌క్షాల్లో నెల‌కొంది. నిత్యం భ‌యాందోళ‌న మ‌ధ్య జీవ‌నం సాగిస్తున్నారు. అధికార‌ప‌క్షంపై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తే వెంట‌నే పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. లేదంటే, వైసీపీ శ్రేణుల్లోని కొంద‌రు ప్ర‌త్య‌ర్థుల ఇళ్ల‌పై దాడులకు ( Attack On TDP Leaders) తెగ‌బడుతున్నారు. ఆ కోవ‌లోకి దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన దారుణం వ‌స్తుంది. అక్క‌డ మ‌ట్టి మాఫియా (Sand Mafia) గురించి ప్రశ్నించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ (Chintamaneni Prabhakar ) అనుచ‌రుడిపై వైసీపీ నేత‌లు దాడికి పాల్ప‌డ్డారు. ఆ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ చింత‌మ‌నేని ప్ర‌ధాన అనుచ‌రుడు శివ‌బాబు ప్రాణాపాయ స్థితిలో ఏలూరు ఆస్ప‌త్రికి వెళ్లారు. వైసీపీ శ్రేణులు శివాబాబు త‌ల‌పై కొట్ట‌డంతో బ‌ల‌మైన గాయం కాగా, ఆయ‌న‌తో పాటు 4గురు గాయ‌ప‌డ్డారు.

మ‌ట్టి అక్రమ త్రవ్వకాలపై ప్రశ్నించిన టీడీపీ నాయకులపై అర్ధరాత్రి ఇనుప రాడ్లతో దాడి చేసి హ‌త్య చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు. ఈ ఘ‌ట‌న ఆనియోజకవర్గంలోని కొప్పాక – చినబోయిన పల్లి సమీపంలో జ‌రిగింది. ఇదే త‌ర‌హాలో చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ పై (Ramachandra Yadav) దాడి జ‌రిగింది. ఆయ‌న నివాసంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసానికి పాల్ప‌డ్డారు.కేవ‌లం సదుంలో ఆయన రైతు భేరీ సదస్సు నిర్వహిస్తానని ప్రకటించిన కార‌ణంగా ఈ దాడి జ‌రిగింద‌ని జ‌న‌సేన చెబుతోంది.

ఈ దాడిని అడ్డుకునేందుకు పోలీసులు కనీస ప్రయత్నం చేయక‌పోవ‌డం టీడీపీ, జ‌న‌సేన (TDP and Janasena) శ్రేణుల్ని ఆందోళ‌న క‌లిగిస్తోంది. కాగా, ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. దాడి తాలూకు వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు. `ఇది నాటి రోజుల్లో బీహార్ కాదు… నేటి రోజుల్లో పుంగనూరు అంటూ వివరించారు. డీజీపీ గారూ…. నాలుగు జతల ఖాకీ దుస్తులు మీ స్థానిక అధికారులకు పంపించండి… లేకపోతే రాష్ట్రంలో మొత్తం పోలీసు శాఖను మూసేశారు అనుకుంటారు` అంటూ విమర్శించారు.

రామచంద్రయాదవ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పుంగనూరు అసెంబ్లీ నియోజవకర్గం నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో, దాడి ఘటన పట్ల జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. వెనుకబడిన వర్గానికి చెందిన రామచంద్రయాదవ్ ఇంటిపై జరిగిన బీభత్సకాండ వైసీపీ సర్కారు గుండాయిజానికి నిదర్శనం అని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో రైతుల సదస్సు నిర్వహించాలనుకోవడం రామచంద్రయాదవ్ చేసిన నేరమా? అని ప్రశ్నించారు.