Site icon HashtagU Telugu

By Election : ఆత్మకూరులో వైసీపీకి టెన్షన్…అన్నీ ఉన్నా…భయమెందుకో…!!!

YCP Special status

Jagan Ycp Flag

ఆత్మకూరు ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో కొత్త రాజకీయ చర్చకు తెర తీసింది. దీనికి అధికార వైసీపీ తెచ్చిపెట్టుకున్న తలనొప్పే కారణమని అధికార వర్గాలకు చెందిన నేతలే అంటున్నారు. దివంగత శాసన సభ్యుడు మేకపాటి గౌతం రెడ్డి ఆకస్మిక మృతితో ఈ నియోజక వర్గంలో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. నిజానికి ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు మేకపాటి గౌతం రెడ్డి పై ఉన్న గౌరవంతో ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్నాయి. దీంతో ఈ ఎన్నిక లేకుండానే యూనానిమస్ గా ఆయన సోదరుడు మేకపాటి విక్రం రెడ్డి ఎమ్మెల్యే అవుతాడని అంతా అంచనా వేశారు. కానీ బీజేపీ గతంలో బద్వేల్ ఉపఎన్నిక తరహాలోనే పోటీలోకి దిగింది. అయితే దీని వెనుక కారణం లేకపోలేదు. బీజేపీ జాతీయ స్థాయిలోనే దేశంలో ఏ ఎన్నిక జరిగినా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బీజేపీ తరపున భరత్ కుమార్ యాదవ్ బరిలోకి దిగాడు.

ఇదిలా ఉంటే నిజానికి ఈ ఎన్నికలో అధికార వైసీపీ గెలుపు లాంఛనమే, ఆత్మకూరు వైసీపీకి పెట్టని కోట, అంతేకాదు ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు కూడా పోటీలో లేవు. ఇక బీజేపీకి ఆ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో 2312 ఓట్లు మాత్రమే దక్కాయి. నోటా కన్నా 100 ఓట్లు ఎక్కువ సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఈ ఎన్నికల్లో అద్భుతాలు చేస్తుందని ఆశించడం కలే అవుతుంది.

అయినప్పటికీ, ఆత్మకూరు ఎన్నిక అధికార వైసీపీకి చిక్కులు ఎందుకు తెచ్చిపెడుతుందా అనే డౌట్ రావొచ్చు. దానికి కారణం ఆత్మకూరులో వైసీపీ పెట్టుకున్న టార్గెట్ లక్ష ఓట్ల మెజారిటీ, ఇదే వాళ్లను కలవరపెడుతోంది. ఎందుకంటే సాధారణంగా ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని సవాలు విసరవచ్చు. భారీ తనం అంటే ఏ సంఖ్య అయిన కావొచ్చు. కానీ వైసీపీ కచ్చితంగా లక్ష మెజారిటీ అని కుండ బద్దలు కొట్టింది ఇక్కడే లెక్కలు తేడా వస్తాయేమో అని కలవరం పట్టుకుంది.

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతం రెడ్డికి 92758 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి, బొల్లినేని కృష్ణయ్యకు 70482 ఓట్లు పోల్ అయ్యాయి. టీడీపీపై వైసీపీ 22276 ఓట్ల మెజారిటీతో గెలిచింది. అయితే ఈ సారి టీడీపీ బరిలో లేదు. దీంతో వైసీపీ నేతలు అత్యుత్సాహంతో లక్ష మెజారిటీ సాధిస్తాం అని ప్రకటన చేసేశారు. అయితే అంతర్లీనంగా వైసీపీ నేతల్లో లక్ష మెజారిటీ రాకపోతే ఎలా అనే ప్రశ్న వేధిస్తోంది.

దీనికి కారణాలు లేకపోలేదు. ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 2,08,990 ఓటర్లు ఉంటే గత ఎన్నికల్లో సుమారు 75 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీకి పడ్డ ఓట్లు 92758 అంటే లక్ష క్రాస్ చేయలేదు. అయితే గతంలో టీడీపీకి పడ్డ ఓట్లు, వైసీపీకి ట్రాన్స్ ఫర్ అవుతాయా అనేది సస్పెన్స్ గా మారింది. దీంతో పాటు సాధారణంగా ఈ తరహా ఉప ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు జనం అంత ఆసక్తి చూపరు. చాలా మంది ఓటింగుకు దూరంగా ఉన్నా ఆశ్చర్యపడనవసరం లేదు.

అందుకే టీడీపీ ఓట్లు సైతం వైసీపీకి పడితేనే లక్ష మెజారిటీ సాధ్యం అవుతుంది. అందుకే ఈ సారి టీడీపీ బరిలో లేనప్పటికీ, ఆ ఓట్లను తమకు పడేలా, వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏకంగా చంద్రబాబుకు అభినందనలు తెలపడం వెనుక, ఈ వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బీజేపీకి గెలుపుపై ఆశలు లేకపోయినప్పటికీ, టీడీపీ ఓట్లు తమకు ట్రాన్స్ ఫర్ అయితే, గౌరవప్రదంగా బయటపడతామనే ఆశతో ఉంది. మరి ఈ ఉప ఎన్నికకు ఏకంగా మంత్రులు, వివిధ ఎమ్మెల్యేలు జోరుగా ప్రచారం చేస్తుండటంతో వైసీపీలో రిజల్ట్ పై ఎక్కడో తేడా కొడుతుందనే సంకేతాల్లో రాజకీయ వర్గాలకు అందుతున్నాయి.

Exit mobile version