Atmakur Elections : ఆత్మ‌కూరులో మంత్రులు, ఎమ్మెల్యేల మోహ‌రింపు

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల కోసం గ్రామానికో ఎమ్మెల్యే మండలానికి ముగ్గురు మంత్రుల‌ను వైసీపీ మోహ‌రించింది.

  • Written By:
  • Publish Date - June 21, 2022 / 05:30 PM IST

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల కోసం గ్రామానికో ఎమ్మెల్యే మండలానికి ముగ్గురు మంత్రుల‌ను వైసీపీ మోహ‌రించింది. ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా మెజార్టీపై దృష్టి పెట్టింది. ఆన‌వాయితీ ప్ర‌కారం సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ర‌ణిస్తే పోటీలో ఉండ‌కుండా టీడీపీ త‌ప్పుకుంటుంది. ఆత్మ‌కూరులోనూ అదే ఆన‌వాయితీని కొన‌సాగించింది. కానీ, బీజేపీతో పాటు స్వ‌తంత్ర్య అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. దీంతో పోలింగ్ నిర్వ‌హించ‌డానికి అన్ని ఏర్పాట్ల‌ను అధికారులు చేశారు. ప్ర‌చారం మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌ల‌కు ముగిసింది.

ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌ జూన్ 23న నిర్వహించనున్నారు. మరోవైపు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి 1300 మంది సిబ్బందిని మోహరించారు. పోలింగ్ కేంద్రం వద్ద 1000 మంది పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఫిబ్రవరి 21న మృతి చెందడంతో ఆత్మకూర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి వైఎస్సార్సీపీ నుంచి బరిలోకి దిగగా మరో 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ లేకపోవడంతో వైసీపీ, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. జూన్ 23న పోలింగ్, జూన్ 26న కౌంటింగ్ నిర్వహించి జూన్ 28 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సోమవారం సాయంత్రం నోడల్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ చక్రధర్ బాబును కలిశారు. పోలింగ్ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. దివ్యాంగుల కోసం ర్యాంపులు, వీల్ చైర్లను ఏర్పాటు చేశామని, 279 పోలింగ్ కేంద్రాల్లో సాంకేతిక సమస్య తలెత్తితే సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కల్తీ ఓట్లు అరికట్టేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితాలను ప్రదర్శించాలని రిటర్నింగ్‌ అధికారిని ఆదేశించారు. 123 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు తెలిపారు.