Arthur Cotton : కాట‌న్ దొర అద్భుత ఇంజ‌నీరింగ్ `గోదావ‌రి`

Arthur Cotton : వైజాగ్ నించి హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైనెక్కుతాం. తుని దాటిన 4 గంటల జర్నీ తర్వాత రాజమండ్రి(Godavari) స్టేషనొస్తుంది.

  • Written By:
  • Publish Date - May 15, 2023 / 04:33 PM IST

Arthur Cotton : వైజాగ్ నించి హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైనెక్కుతాం. తుని దాటిన దగ్గర్నుంచి పచ్చకార్పెట్ కప్పినట్టున్న పొలాల మధ్యలోంచి అన్నవరం, పిఠాపురం, సామర్లకోట లాంటి స్టేషన్లు దాటుకుంటా 4 గంటల జర్నీ తర్వాత రాజమండ్రి(Godavari) స్టేషనొస్తుంది. అప్పుడు మొదలవ్వుద్ది అందరిలో ఒకలాంటి హడావిడి. అయిదు నిముషాలాగి తిరిగి ట్రైన్ స్టార్ట్అవ్వగానే. రిజర్వేషన్ దొరక్క గుమ్మం మెట్ల దగ్గర కూర్చునోళ్లు ఎందుకైనా మంచిదని లోపలికొచ్చేస్తారు. కుర్రోళ్లు చాటింగులాపేసి మెల్లగా గుమ్మం దగ్గర జేరతారు. పెద్దోళ్ళులాంటోళ్ళు వాళ్ళ వెనకాల నిలబడతారు. అప్పటిదాకా ఒక సౌండుతో ఊగుతూ వచ్చిన రైలు అప్పట్నుంచి మరో సౌండుతో దడదడలాడుతూ లోపల కూర్చునోళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ట్రైనంతా నిశ్శబ్దమైపోద్ది. అన్ని తలలు కిటికీలవైపు తిరుగుతాయి. సీట్లో కూర్చున్న లేడీస్ నిద్రపోతున్న పిల్లల్ని లేపి మరీ కిటికీలోంచి చూపిస్తారు.

పెర్ఫెక్ట్ ఇర్రిగేషన్ ప్లానింగుతో (Arthur Cotton)

అదే..”అదిగో చూడు.. గోదావరి.. గోదావరి(Godavari).. బ్రిడ్జదిగో.. ఎంత పెద్దదో చూడు.. ఇదిగో, విండోలోంచి డబ్బులెయ్యి..” అని కనుచూపు మేరంతా నిండుకుండలా ప్రవహిస్తున్న గోదావరి నదిని (Arthur Cotton)కంపార్ట్మెంట్ కిటికీలోంచే చూపిస్తూ తనివితీరా మురిసిపోతారు. ట్రైను బ్రిడ్జి మీద నడిచిన ఆ అయిదు నిముషాలు గుమ్మం దగ్గర నిల్చునోళ్లల్లో రకరకాల ఆలోచనలు. కోట్లాదిమంది కడుపు నింపుతున్న గోదావరి మాతని కళ్లారా ఆస్వాదించి, కడుపు నిండా గోదారి గాలి పీల్చి, వీలైనన్ని సెల్ఫీలు తీస్కుంటారు. ఆల్మోస్ట్ రాజమండ్రికి ట్రైన్లో వచ్చే అందరికీ ఎదురయ్యే అనుభవమే ఇది. ఫ్లయిట్లో వచ్చినా, ట్రైనెక్కి వచ్చినా, బస్సెక్కి వచ్చినా గోదావరినదిని, దాని చుట్టూ పులుముకున్న పచ్చదనాన్ని ఆస్వాదించకుండా ఉండలేం. ఆ పచ్చదనం చూసినోళ్లు “గోదారోళ్ళెంత అదృష్టవంతుల్రా” అని అనుకుంటారు. చరిత్ర తెల్సినోళ్లు మాత్రం మనసులో కాటన్ దొరకి దణ్ణమెట్టుకుంటారు. ఇవేమి తెలీని కుర్రోళ్ళు మాత్రం సెల్ఫీలు తీసుకుంటారు.

మనసులో కాటన్ దొరకి దణ్ణమెట్టుకుంటారు

అలాంటి అపురూపాన్ని అందంగా అందించిన మహానుభావుడి(Arthur Cotton) పుట్టినరోజు ఈరోజు. ఆయనే సర్ ఆర్ధర్ కాటన్. ఇప్పుడు ఆంధ్రుల ధాన్యాగారంగా పేరున్న గోదావరి జిల్లాల్లో ఒకప్పుడు కరువొస్తే ఆకలిచావులతోను, వర్షాలొస్తే పోటెత్తే వరదలతోనూ అపార ప్రాణనష్టం మిగులుస్తూ ఆఖరికి పసిపిల్లల్ని కూడా అమ్ముకునే స్థాయిలో కరువు తాండవించేదంట. ఎందుకంటే, ఎక్కడో నాసిక్లో పుట్టి అందర్నీ పలకరిస్తా, ఎవరెవరి భారాల్నో బాధ్యతగా మోసుకుంటా 1600 కిమీ పాటు ప్రవహించొచ్చిన గోదారమ్మ పాపికొండల మధ్యలో రెండు తాడి చెట్లంత లోతుండే ఉగ్రగోదావరిగా(Godavari) రూపాంతరం చెంది, అదే స్పీడ్తో అంతర్వేది దగ్గర ఆవేశంగా సముద్రంతో మమేకమయ్యేది తప్పించి ఏ రకంగానూ ఆ వృధాజలాలు ఉపయోగపడేవి కావంట.

అపురూపాన్ని అందంగా అందించిన మహానుభావుడి(Arthur Cotton)

అలాంటి ప్రాంతానికి, విధినిర్వహణలో భాగంగా ఇంగ్లాండునించి వచ్చి, నరమానవుడు నడవటానికి కూడా ఆలోచించలేని ఏరియాల్లో గుర్రమేసుకుని కలతిరుగుతా, ఆనకట్ట కట్టాల్సిన అవసరం గురించి రిపోర్ట్ తయారుచేసేయడమే కాకుండా ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఎన్నో అష్టకష్టాలు పడ్డాడంట ఆ పుణ్యాత్ముడు. “ఒక్కరోజు సముద్రంలో కలుస్తున్న గోదావరి ప్రవాహం, సంవత్సరమంతా మన లండన్లో ప్రవహిస్తున్న థేమ్స్ నదితో సమానం” అని అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంతో పోట్లాడి ఒప్పించిన మహాత్ముడు కాట‌న్ దొర‌.(Arthur Cotton)

ఎన్నోసార్లు ఎన్నో కమీషన్ల ముందు నించుని, పెర్ఫెక్ట్ ఇర్రిగేషన్ ప్లానింగుతో, సరిగ్గా నాలుగేళ్లలో, మూడున్నర కిలోమీటర్ల పొడవుతో, 175 గేట్లతో ధవళేశ్వరం బేరేజ్ అనే అన్నపూర్ణని ఆరోగ్యం పాడుజేసుకుని మరీ నిర్మించి “నా పేరు జెప్పుకోకుండానే కడుపు నింపుకుని పండగ జేసుకొండోరేయ్” అని అక్షయపాత్రలా దానమిచ్చేసేడు.. ఈ డీటెయిల్స్ అన్ని ధవళేశ్వరంలో ఉన్న కాటన్ మ్యూజియంకి వెళ్తే చూడొచ్చు. ఆరోజుల్లో ఆయన ప్లానింగు, వాడిన టెక్నాలజీ(Godavari) చూసి ఆశ్చర్యపోతాం.

గుర్రం మీద ఠీవిగా కూర్చున్న ఆయన నిండైన విగ్రహం

ఇదంతా జరిగి అక్షరాలా నూట అరవై అయిదు సంవత్సరాలు పైనే అవుతోంది. కానీ, ఇప్పటికీ మీరెవరైనా గోదారి(Godavari) సైడొస్తే ఈయన గురించి చెప్తూ “కాటన్ దొరగారు” అంటాం తప్పించి “కాటన్” అని ఏకవచనం కూడా వాడరు. బ్రాహ్మణులు రోజూ అర్ఘ్యం వదిలేటప్పుడే కాదు, గోదావరికి పుష్కరాలొచ్చినప్పుడు కొంతమందైతే కాటన్ దొరగారికి(Arthur Cotton) తర్పణాలు కూడా వొదుల్తారు. అదీ.. ఆయనగారంటే గోదారోళ్ల‌కు ఉన్న‌ అభిమానం. కాటన్ గార్ని తలచుకోగానే కళ్ళముందు మెదిలేది గుర్రం మీద ఠీవిగా కూర్చున్న ఆయన నిండైన విగ్రహం. ఆయన పేరుకు ముందు ఉండాల్సిన “అపరభగీరధుడు” అన్న బిరుదు.

Also Read : Godavari Water: ఏపీకి కేంద్రం మరో అన్యాయం! గోదావరి జలాలు ఇతర రాష్ట్రాలకు..!

పితృదేవతలకు సద్గతులు కల్పించడానికి గంగమ్మ తల్లిని భూమ్మీదకి రప్పించిన భగీరధుడుతో కాట‌న్ దొర‌ను పోల్చడం కంటే, తన జటాజూటాల్లో బంధించి పవిత్ర గంగాజలాలు ఎటు పడితే అటు ప్రవహించకుండా సరైన తీరులో కిందకి వొదిలిపెట్టి భూమాతకి, గంగామాతకి కూడా ఉపశమనం కలిగించిన పరమశివుడితో పోల్చడం కరెక్టని గోదారోళ్లు భావిస్తుంటారు.

అఖండ గోదావరి మాతకి ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టి గౌతమి, విశిష్ట అనే రెండు అందమైన కన్య గోదావరులుగా మార్చి తూర్పుగోదావరికొకటి, పశ్చిమగోదావరికోటి ఇచ్చి పెళ్లిళ్లు చేసి, పచ్చని భూములతో పాటు సిరిసంపదల పుట్టుకకు కారణమైనోడు దేవుడు కాక ఇంకేమవుతాడు? ఏదైనా పని పూర్తి చెయ్యడానికి “మీ బాధ్యతంటే మీ బాధ్యతని” దెబ్బలాడుకుంటున్న మనంఎన్నుకున్న ప్రభుత్వాలకంటే.. రెండొందల ఏళ్ళ ముందే మనతో ఏం సంబంధం లేకపోయినా వృధాగా పోతున్న గోదావరిని డెల్టాలుగా, తెలుగు రాష్ట్రాలకి ధాన్యాగారాలుగా మార్చి, ఎన్నో కడుపులు నిండటానికి కారణమైన దేవుడిని పరమశివుడితో పోల్చడంలో త‌ప్పేమీలేదేమో.!

Also Read : Godavari Kanuma:కాటంరాజే కనుమ దేవుడు!