CM YS Jagan: సీఎం జగన్ ఇంటి వద్ద గోశాల ఏర్పాటు..మొదలైన సంక్రాంతి సంబరాలు

తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేశారు. తెలుగుతనం ఉట్టిపడే రీతిలో ఈ గోశాలను సీఎం జగన్ ఏర్పాటు చేయించడం గొప్ప విషయం.

Published By: HashtagU Telugu Desk
Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan: తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేశారు. తెలుగుతనం ఉట్టిపడే రీతిలో ఈ గోశాలను సీఎం జగన్ ఏర్పాటు చేయించడం గొప్ప విషయం. గోవులు, గోపూజ అంటే ప్రత్యేంగా ఇష్టపడే జగన్, వైఎస్ భారతిలు రేపు గోశాలలో గోపూజను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గోశాలకు పలు రకాల గోవులను వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. గిరి, పుంగనూరు, కపిల, హర్యానా వంటి ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక గోవులను గోపూజకు తీసుకురావడం విశేషం.

గోశాలను నిర్మించడమే కాకుండా ఈ గోశాలలో నిత్యం పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లను కూడా చేస్తున్నట్లు వెల్లడించారు. గోవులకు సీఎం సతీమణి వైఎస్ భారతి ప్రత్యేక పేర్లను పెట్టారు. గోవులను ఆరోగ్యంగా చూసుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు.

ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఊపందుకున్నాయి. సీఎం జగన్ రేపు తన నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలను చేసుకోనున్నారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఇప్పటికే పల్లెవాతావరణం ఉట్టిపడటమే కాకుండా ముద్దబంతులు, చామంతులు, వివిధ రకాల అలంకరణలతో మొత్తం శోభాయమానంగా కళకళలాడుతోంది. సతీసమేతంగా సీఎం జగన్ గోపూజను నిర్వహించిన తర్వాత సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్నారు.

ఉదయం పది గంటలకు భోగి మంటలు, ముగ్గుల పోటీలు, హరిదాసు కీర్తలను, ఇలా పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ ఏర్పాట్లన్నింటినీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరుండి చేపడుతున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండగను వైభవంగా సీఎం దంపతులు చేసుకోనున్నారు. అయితే ఈ సారి ఎన్నికలు వస్తున్న తరుణంలో ఈ సంక్రాంతి పండగ ఇంకాస్త వేడుకగా సాగనుంది.

  Last Updated: 13 Jan 2023, 08:48 PM IST