Site icon HashtagU Telugu

Chandrababu: ‘జంగారెడ్డిగూడెం’ ఘటనకు జగన్ బాధ్యత వహించాలి!

Babu

Babu

పశ్చిమగోదావరిలోని జంగారెడ్డిగూడెంలో క‌ల్తీసారా తాగి చనిపోయిన బాధిత కుంటుంబాల‌ను మాజీ సీఎం చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జిల్లా నుంచి పెద్ద‌సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చారు. రాష్ట్రంలోని పేద మహిళల మంగళసూత్రాలను తెంచ‌డానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు లభించిన ఒక్క అవకాశాన్ని దుర్వినియోగం చేశార‌ని ఆరోపించారు. జగన్ రెడ్డి తక్కువ ధర కలిగిన చీప్ లిక్కర్ బ్రాండ్‌లను తీసుకొచ్చిన తర్వాతనే చాలా మంది పేదలు అక్రమ మద్యానికి బలి అవుతున్నారని చంద్ర‌బాబు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ ప్రాంతమంతా కల్తీ మద్యం ఏరులైపారడం ప్రారంభించిన తర్వాతే తమ కుటుంబ పెద్దలు ఎలా ప్రాణాపాయస్థితికి గురయ్యారో బాధిత కుటుంబాలు చంద్ర‌బాబునాయుడుకు వివరించారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన 26 మంది మరణాలకు జగన్ మోహన్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. బాధిత కుటుంబాల‌కు కోటి రూపాయ‌ల‌ ఎక్స్ గ్రేషియా ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. బాధితుల మరణాలపై కూడా జగన్ రెడ్డి తనదైన శైలిలో అబద్ధాలు చెప్పడం ప్రారంభించారని బాబు తీవ్రంగా విమర్శించారు. సిగ్గులేని రీతిలో వైసీపీ ఈ మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరిస్తోందన్నారు. మనిషి ప్రాణాల పట్ల సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి గౌరవం లేదని బ‌య‌ట‌ప‌డింద‌న్నారు.

వైసీపీ పాలనలో మహిళల జీవితాలతో ఆటలాడుకుంటే రాష్ట్రంలోని మహిళలంతా తీవ్ర స్థాయిలో తిరుగుబాటు తప్పదని టీడీపీ అధినేత హెచ్చరించారు. అక్రమ రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి మహిళా రైతులు 810 రోజుల పాటు ధైర్యంగా పోరాడారని… వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి తన సొంత తండ్రి హంతకులపై ధైర్యంగా పోరాడుతున్నారని గుర్తుచేశారు. అక్రమ మద్యం బాధితుల కుటుంబాలు కూడా క్రూరమైన పాలనకు వ్యతిరేకంగా గొప్ప పోరాటంలో పాల్గొంటాయన్నారు.
జంగారెడ్డిగూడెంలో బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు తాను వస్తే స్థానిక వైసీపీ నేతలు అర్ధరాత్రి బాధిత కుటుంబాలను పరామర్శించి బెదిరిస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు.