Arogyasree Services: ఏపీలో నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ సేవలు..కారణం ఇదే !

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. ఫీజు చెల్లింపులో జాప్యం, రోగులకు అందించే వైద్యం తగ్గించడం, ప్యాకేజీ ధరలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ

Arogyasree Services: ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. ఫీజు చెల్లింపులో జాప్యం, రోగులకు అందించే వైద్యం తగ్గించడం, ప్యాకేజీ ధరలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కింద కొత్త కేసులను చూడబోమని అసోసియేషన్‌ తెలిపింది. తమ న్యాయపరమైన డిమాండ్లను అంగీకరించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం చూపకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ ఏడాది జూన్, నవంబర్ నెలల్లో సర్వీసులను నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రకటించింది. ఆ తర్వాత చర్చల ద్వారా ఈ సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు ప్రైవేటు ఆసుపత్రులు రోగులకు యథావిధిగా సేవలు అందించాయి. గత నెలలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేకపోవడంతో ఈ నెల 29 నుంచి వైద్యసేవలు నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 22న ప్రభుత్వానికి లేఖ అందజేశారు.

ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. నవంబర్‌లో ప్రభుత్వంతో చర్చల సందర్భంగా డిసెంబర్‌ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. 2013 నుంచి ట్రీట్ మెంట్ ప్యాకేజ్ ధరలు పెంచడం లేదని.. పెంచాలని అసోసియేషన్ తరపున ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదన్నారు. అంతేకాదు కుటుంబ వార్షిక చికిత్స పరిమితిని ప్రస్తుత రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. పెంపు నిర్ణయంతో ప్రయివేటు ఆసుపత్రులపై ఆర్థిక భారం పెరిగిందని అంటున్నారు.

గత నెలలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నిలిపివేస్తూ నెట్‌వర్క్ ఆస్పత్రులు నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వంతో చర్చలు జరిపి నెట్‌వర్క్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 15లోగా ప్యాకేజీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని.. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు.

Also Read: Ram Lalla : అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించే బాలరాముడిపై కీలక ప్రకటన