Lokesh Movie tweets: లోకేష్ కు సినిమా క‌ష్టాలు.!

త్రిబుల్ ఆర్ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ట్వీట్ చేశాడు. సినిమా అద్భుతంగా ఉంద‌ని ఇచ్చిన రివ్యూల‌ను చూసి భావోద్వేగాల‌కు గుర‌య్యాన‌ని, కుటుంబ స‌మేతంగా సినిమా చూడాల‌ని ఉంద‌ని ట్వీట్ చేశాడు.

  • Written By:
  • Publish Date - March 25, 2022 / 01:43 PM IST

త్రిబుల్ ఆర్ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ట్వీట్ చేశాడు. సినిమా అద్భుతంగా ఉంద‌ని ఇచ్చిన రివ్యూల‌ను చూసి భావోద్వేగాల‌కు గుర‌య్యాన‌ని, కుటుంబ స‌మేతంగా సినిమా చూడాల‌ని ఉంద‌ని ట్వీట్ చేశాడు. ఇలాంటి అద్భుత‌మైన సినిమాను విడుద‌ల చేసిన తారక్, రామ్ చ‌ర‌ణ్, రాజ‌మౌళితో పాటు యూనిట్ మొత్తానికి అభినంద‌న‌లు తెలిపాడు. ఈ ట్వీట్ ను, బీమ్లా నాయ‌క్ విడుద‌ల సంద‌ర్భంగా చేసిన ట్వీట్ తో పోల్చిచూస్తున్నారు. బీమ్లా విడుద‌ల సంద‌ర్భంగా లోకేష్ చేసిన ట్వీట్ ను జూనియ‌ర్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ప‌వ‌న్ హీరోగా న‌టించిన బీమ్లా సంద‌ర్భంగా లోకేష్ చేసిన ట్వీట్ ఇలా ఉంది.

“బీమ్లా నాయ‌క్ సినిమా అద్భుతంగా ఉంద‌ని వ‌స్తోన్న స్పంద‌న‌ను విన్నాను. సినిమా చూడాల‌ని అదుర్దాగా ఉంది. సినిమా ఇండ‌స్ట్రీ నాశ‌నం అయ్యేలా సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాలు ఉన్నాయి. ఒక ప‌రిశ్ర‌మ త‌రువాత మ‌రోదాన్ని నాశ‌నం చేస్తోన్న జ‌గ‌న్ ఏపీని అడుక్కునేలా చేస్తున్నాడు. అలాంటి నిర్ణ‌యాల‌ను అధిగ‌మించి. బీమ్లానాయ‌క్ సినిమా రికార్డ్ లు బ‌ద్ధ‌లు కొట్టాల‌ని అభినందిస్తున్నా.“ అంటూ ఆనాడు లోకేష్ ట్వీట్ చేశాడు.
సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ట్వీట్లు చేసే అలవాటు లోకేష్ కు త‌క్కువ‌. కానీ, బీమ్లా నాయ‌క్ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ హిట్ చేయ‌డానికి మ‌ద్ధ‌తు ప‌లికాడు. జూనియ‌ర్ సినిమాలు విడుద‌లైప్పుడు అలా చేయ‌ని లోకేష్ ఇప్పుడు ఇలా చేయ‌డం ఏమిట‌ని జూనియ‌ర్ అభిమానులు సోషల్ మీడియా వేదిక‌గా ఆనాడు ప్ర‌శ్న‌ల‌ను సంధించారు. అలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాకు అభినంద‌న‌లు తెలుపుతూ ట్వీట్ చేశాడు.

కానీ, ఆ రోజు బీమ్లా నాయ‌క్ విడుద‌ల సంద‌ర్భంగా హిట్ కావాల‌ని ఆకాంక్షిస్తూ చేసిన ట్వీట్, ఇప్పుడు త్రిబుల్ రివ్యూల‌పై భావోద్వేగానికి గుర‌వుతున్నానంటూ చేసిన ట్వీట్ కు చాలా వ్య‌త్యాసం ఉంది. దీంతో జూనియ‌ర్ అభిమానులు లోకేష్ మీద సోష‌ల్ మీడియా వేదిక‌గా సెటైర్లు వేయ‌డం మొద‌లు పెట్టారు. త్రిబుల్ ఆర్ సినిమా హిట్ తో ఉర్రూత‌లూగుతోన్న అభిమానులు లోకేష్ ను ఆడుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీలోని యువ‌త ఎక్కువ‌గా జూనియ‌ర్ నాయ‌క‌త్వాన్ని కోరుకుంటున్నారు. ఆ విష‌యాన్ని సాక్షాత్తు చంద్ర‌బాబు ఎదుట చాలాసార్లు వ్య‌క్త‌ప‌రిచారు. కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా జూనియర్ కోసం అభిమానులు బాబును నిల‌దీశారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ లో జ‌రిగిన ప‌లు స‌మావేశాల్లోనూ జూనియ‌ర్ ఎన్టీఆర్ నాయ‌క‌త్వం కావాల‌ని డిమాండ్ చేశారు. కానీ, చంద్ర‌బాబు ఆచితూచి అడుగు వేస్తున్నాడు.

కుమారుడు లోకేష్ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం జూనియ‌ర్ ను దూరంగా పెడుతున్నార‌న్న అప‌వాదు మోస్తున్నాడు. అందుకు త‌గిన విధంగా టీడీపీలోని కొంద‌రు ఎన్టీఆర్ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్లాప్ టాక్ వ‌చ్చేలా పోస్ట్‌లు పెట్టిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. పైగా ప‌వ‌న్ హీరోగా న‌టించిన సినిమాల‌ను హిట్ చేయ‌డానికి టీడీపీ ఆఫీస్ కేంద్రంగా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ని జూనియ‌ర్ అభిమానుల భావ‌న‌.
ప్ర‌స్తుతం ఉన్న టీడీపీ రెండు గ్రూప్ లుగా ఉంద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు ప్ర‌చారం చేస్తున్నాయి. నంద‌మూరి గ్రూప్‌, నారా గ్రూప్ గా చీలిపోయిందని జ‌గ‌న్ చాలా కాలంగా దుమ్మెత్తిపోస్తున్నాడు. పైగా వైసీపీకి అండ‌గా ఎన్టీఆర్ ఉంటున్నాడ‌ని లోకేష్ టీంలోని కొంద‌రు దుష్ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రికొంద‌రు వైసీపీలో చేర‌బోతున్నాడ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎన్టీఆర్ పై చెర‌గ‌ని రాజ‌కీయ మ‌చ్చ వేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలాంటి గ్యాప్ ను గ‌మ‌నించిన వైసీపీ , ప్ర‌స్తుతం ఉన్న టీడీపీ చంద్ర‌బాబుద‌ని ప‌దేప‌దే చెబుతోంది. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ ఇప్పుడు లేద‌ని అవ‌కాశం ఉన్న‌ప్పుడ‌ల్లా దుమ్మెత్తి పోస్తోంది. దానికి త‌గిన విధంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సినిమాల‌ను ప్రోత్స‌హిస్తూ, జూనియ‌ర్ సినిమాల‌పై వ్య‌తిరేక ప్ర‌చారం చేయ‌డానికి లోకేష్ టీంలోని కొంద‌రు దుస్సాహ‌సం చేసిన సంద‌ర్భాలు అనేకం.
మొత్తం మీద జూనియ‌ర్ ఎన్టీఆర్, లోకేష్ మ‌ధ్య ఉన్న గ్యాప్ ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. భీమ్లానాయ‌క్ , త్రిబుల్ ఆర్ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా లోకేష్ చేసిన ట్వీట్ల‌లోని ఈక‌ల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు పీకుతున్నారు. నెటిజ‌న్లు మాత్రం జూనియ‌ర్ ఎన్టీఆర్ కు జై కొడుతున్నారు.