Site icon HashtagU Telugu

AIతో ఉద్యోగాలు పోయినట్లేనా..? చంద్రబాబు క్లారిటీ

Cbn Ai

Cbn Ai

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) గుంటూరు జిల్లాలో జరిగిన పోలీస్ ఏఐ హ్యాకథాన్ కార్యక్రమంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధ (AI) సాంకేతికతను పోలీస్ శాఖలో వినియోగించడం, నేరాల నివారణకు టెక్నాలజీని వినియోగించే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాల వ్యవస్థను బలోపేతం చేస్తూ, సంఘవిద్రోహశక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. క్వాంటం వ్యాలీ ద్వారా ఏఐకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొంటూ, “ఏఐతో ఉద్యోగాలు పోతాయి అనేది పూర్తిగా అపోహ. దీన్ని సద్వినియోగం చేసుకుంటే తెలుగువాళ్లు ప్రపంచాన్ని తలదించేలా చేయగలరు” అని స్పష్టం చేశారు.

Vijaya Rama Raju : ఏపీ విద్యాశాఖ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం
అంతకుముందు ఆయన గుంటూరులో జిందాల్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో ల్యాండయ్యారు. ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెక్నాలజీ లేకపోయినా నేరాలను అదుపులోకి తెచ్చానని గుర్తు చేస్తూ, ఇప్పుడైతే టెక్నాలజీ ఉందని… ఎవరైనా తప్పు చేస్తే ఏమి చేయాలో చేసి చూపిస్తానని హెచ్చరించారు. గంజాయి పండింపులను సహించేది లేదని స్పష్టంగా చెప్పారు. తెనాలిలో నేరస్థులను పరామర్శించిన జగన్‌పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘‘రౌడీషీటర్లతో కలిసి రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చిందంటే అది రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తుందో అర్థం చేసుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల వ్యవస్థ పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అభివృద్ధికి ముందస్తు నిబంధన శాంతియుత సమాజమే అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగించి నేరాలను అణచివేయాల్సిన బాధ్యత పోలీసులదేనని చెప్పారు. రేపటి నుండి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే తరహాలో కూటమి నాయకత్వం ప్రజలతో నేరుగా మమేకమై, అభివృద్ధి లక్ష్యాలను వివరించే ప్రయత్నం చేయనుంది.