Arcelor Mittal & Nippon Steel: అనకాపల్లికి మహర్దశ.. ఆర్సెలార్‌ మిత్తల్‌ రూ.1,61,198 కోట్ల పెట్టుబడి

ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిత్తల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్స్‌తో కలిసి ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్స్ ప్లాంటుకు (ఐఎస్‌పీ) బుధవారం మంత్రిమండలి ఆమోదం అందించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Published By: HashtagU Telugu Desk
Arcelor Mittal & Nippon Steel In Andhra Pradesh

Arcelor Mittal & Nippon Steel In Andhra Pradesh

Arcelor Mittal & Nippon Steel: ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిత్తల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్స్‌తో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్స్ ప్లాంటు (ఐఎస్‌పీ)కి బుధవారం జరిగే మంత్రిమండలి సమావేశంలో ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంటు నిర్మాణం, దానికి అనుబంధంగా కో-టెర్మినస్ క్యాప్టివ్ పోర్టు అభివృద్ధి విషయంలో మిత్తల్ సంస్థ ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు సమర్పించింది. రెండు దశల్లో రూ. 1,61,198 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు, ఈ ప్రాజెక్టు ద్వారా 63 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు వివరించింది.

మొదటి దశలో రూ.70,000 కోట్ల పెట్టుబడి:

మొదటి దశ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి సంస్థ రూ.70,000 కోట్ల పెట్టుబడిని నాలుగేళ్లలో ఖర్చు చేయనున్నట్లు తన ప్రతిపాదనలో పేర్కొంది. 7.3 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ దశలో 20,000 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపింది. మొదటి దశ పనులను 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రతిపాదించిన ప్రీ-ఫీజిబులిటీ రిపోర్టు ఆధారంగా, నక్కపల్లి మండలంలో ఏపీఐఐసీకి చెందిన 2,164.31 ఎకరాల భూమి ప్రభుత్వం గుర్తించింది. ఇందులో బుచ్చయ్యపేటలో 102.18 ఎకరాలు, చందనాడలో 840.2 ఎకరాలు, డీఎల్‌ పురంలో 674.39 ఎకరాలు, రాజయ్యపేటలో 36.62 ఎకరాలు, వేంపాడులో 510.92 ఎకరాలు భూములు అందుబాటులో ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ తన నివేదికలో పేర్కొన్నారు.

రెండో దశలో రూ.80,000 కోట్ల పెట్టుబడి:

రెండో దశలో రూ.80,000 కోట్లతో ఉక్కు కర్మాగారం నిర్మాణం చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ దశలో ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 24 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వరకూ పెరిగిపోతుందని తెలిపింది. 2033 నాటికి ఈ పనులు పూర్తి చేయాలని, మరో 35,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని సంస్థ పేర్కొంది.

దేశీయ ఉక్కు ఉత్పత్తిలో 20 శాతం వాటాను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు సంస్థ ప్రతిపాదనలో పేర్కొంది. 2035 నాటికి 40 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపింది. 9.6 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంటును ఎస్సార్‌ స్టీల్స్‌ నుండి కొనుగోలు చేసినట్లు, మరో 15 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుని కొత్త పరిశ్రమ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది.

వ్యూహాత్మక పెట్టుబడుల భాగంగా, తూర్పు తీరంలో కో-టెర్మినస్‌ పోర్టు ఆధారిత క్లస్టర్‌తో ప్లాంటు ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించినట్లు సంస్థ వెల్లడించింది. నక్కపల్లి వద్ద అవసరమైన వనరులు అందుబాటులో ఉండటం ఈ ప్రాజెక్టుకు మేలు చేస్తుందని పేర్కొంది.

పోర్టు అభివృద్ధికి రూ.11,198 కోట్ల పెట్టుబడి:

మిత్తల్‌ సంస్థ రెండు దశల్లో ఉక్కు కర్మాగారానికి అనుసంధానంగా కో-టెర్మినస్‌ క్యాప్టివ్‌ పోర్టు అభివృద్ధికి మొత్తం రూ.11,198 కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపింది. మొదటి దశలో పోర్టు నిర్మాణానికి రూ.5,816 కోట్లు ఖర్చు చేయాలని, దీని ద్వారా 3,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని సంస్థ పేర్కొంది. ఈ దశలో 5 బెర్తులను అభివృద్ధి చేయాలని, వాటి పొడవు 1.5 కి.మీ. ఉండేలా వాస్తవంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ఈ పోర్టు ద్వారా ఏటా 20.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఎగుమతులు, దిగుమతులు నిర్వహించాలని, పోర్టు నిర్మాణానికి 150 ఎకరాలను కేటాయించాలని సంస్థ ప్రభుత్వానికి అందించిన ప్రతిపాదనలో పేర్కొంది.

రెండో దశలో పోర్టు విస్తరణ కోసం మరో రూ.5,382 కోట్లు ఖర్చు చేయాలని, ఇందులో మరో 12 బెర్తులను నిర్మించాలని పేర్కొంది. ఈ పనుల కోసం 170 ఎకరాలను కేటాయించాలని సంస్థ కోరింది. ఈ విస్తరణతో ఏటా అదనంగా 28.99 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తుల రవాణా సామర్థ్యం ఏర్పడుతుందని, ఇందులో భాగంగా 5,000 మందికి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించింది.

 

  Last Updated: 05 Nov 2024, 12:31 PM IST