APSTRC Strike : స‌మ్మెకు ఆర్టీసీ, స‌చివాల‌య ఉద్యోగుల జ‌ల‌క్ ?

ఏపీ ప్ర‌భుత్వాన్ని న‌డ‌వ‌కుండా చేయాల‌ని ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాలు వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళుతున్నాయి. రాజ‌కీయ పార్టీల మ‌ద్ధ‌తు వ‌ద్దంటూనే ప‌రోక్షంగా వాళ్ల నీడ‌న న‌డుస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
APSRTC

APSRTC

ఏపీ ప్ర‌భుత్వాన్ని న‌డ‌వ‌కుండా చేయాల‌ని ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాలు వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళుతున్నాయి. రాజ‌కీయ పార్టీల మ‌ద్ధ‌తు వ‌ద్దంటూనే ప‌రోక్షంగా వాళ్ల నీడ‌న న‌డుస్తున్నారు. కార్మిక సంఘాల‌ను క‌లుపుకుని వెళ్లాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌ధానంగా ఆర్టీసీ కార్మికుల‌ను క‌లుపుకుని వెళితే, స‌మ్మె స‌క్సెస్ అవుతుంద‌ని వాళ్ల భావ‌న‌. కానీ, అటు వైపు నుంచి పాజిటివ్ సంకేతాలు క‌నిపించ‌డంలేదు. పైగా ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల నేత‌ల మ‌ధ్య సమ‌న్వ‌యం లేక‌పోవ‌డంతో తాజా పీఆర్సీ జీవోల అమ‌లు జ‌రుగుతోంది. ఈ నెల జీతాల‌ను ట్రెజ‌రీ బ‌దులుగా ఆర్థిక శాఖ ప్ర‌త్యామ్న‌య మార్గాల ద్వారా కొత్త జీవోల ప్ర‌కారం వేయాల‌ని ప‌నులు ప్రారంభించింది.ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల‌కు కాంట్రాక్టు, గ్రామ స‌చివాల‌య త‌దిత‌ర ఉద్యోగులు క‌లిసి వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డంలేదు. ఆర్టీసీ యూనియ‌న్లు కూడా ఉద్యోగ సంఘాల‌తో క‌లిసి న‌డిచేందుకు సిద్ధంగా లేవని తెలుస్తోంది. సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేశాడు. ఫ‌లితంగా వాళ్ల జీతాలు గ‌తం కంటే భారీగా పెరిగాయి. ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు మాదిరిగా ప్ర‌తినెలా జీతాలు వేస్తున్నారు. రెండేళ్లుగా క‌రోనా స‌మ‌యంలో బ‌స్సులు రోడ్ల‌పై తిర‌గ‌క‌పోయిన‌ప్ప‌టికీ జీతాలు పొందారు. పైగా ఆర్టీసీ భారీ న‌ష్టాల్లో ఉంది. ప్రైవేటు దిశ‌గా అడుగులు వేస్తున్న స‌మ‌యంలో జ‌గ‌న్ ఆర్టీసీ ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వంలో విలీనం చేశాడు. ప్ర‌స్తుతం వాళ్ల‌కు ఎలాంటి ఇబ్బందులు పెద్ద‌గా లేవు. కానీ, ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాలకు మ‌ద్ధ‌తు ఇస్తే ఆర్టీసీ భారీ న‌ష్టాన్ని చ‌విచూసే ఛాన్స్ ఉంది. ఆ త‌రువాత ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాలు కాపాడ‌లేవ‌ని కార్మిక నేత‌ల భావ‌న‌.

ఇక గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో కొత్త ఏడాదిన్న‌ర క్రితం నియామ‌కం అయిన ఉద్యోగుల‌ను త్వ‌ర‌లోనే ప‌ర్మినెంట్ చేస్తామ‌ని ప్రభుత్వం చెబుతోంది. అందుకు సంబంధించిన విధి విధానాల‌ను కూడా రూపొందిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో ప‌ర్మినెంట్ ఉద్యోగుల‌ను న‌మ్ముకుని స‌మ్మెకు వెళితే మ‌రో రూపంలో న‌ష్టం వ‌స్తుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. మ‌రో నాలుగు నెల‌లు ఓపిక‌ప‌డితే, ప‌ర్మినెంట్ అవుతామ‌ని వాళ్లు ఆశ‌పడుతున్నారు. ఆలోగా స‌మ్మెలో పాల్గొని కేసులు పెట్టించుకుంటే ప్ర‌తిబంధ‌కం అవుతుంద‌ని ఆలోచిస్తున్నారు. పైగా ప‌ర్మినెంట్ ఉద్యోగుల జీతాలు భారీగా ఉన్నాయి. వాళ్ల జీతాల కార‌ణంగా రాష్టం బ‌డ్జెట్ 80శాతం పైగా ప్ర‌ణాళికేత‌రం కింద వెళ్లిపోతోంది.
ఫ‌లితంగా ఎలాంటి అభివృద్ధి సాధ్యం కావ‌డంలేద‌ని యువ ఉద్యోగుల భావ‌న‌. అందుకే, స‌మ్మెకు క‌లిసి వెళ్ల‌డానికి సంకోచిస్తున్నార‌ని తెలుస్తోంది.ప్ర‌భుత్వ అధికారిక లెక్క‌ల ప్ర‌కారం సుమారు 12వేల కోట్ల రూపాయ‌ల భారం కొత్త పీఆర్సీ రూపంలో ప‌డుతోంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత ఉద్యోగుల‌కు పెంచిన జీతాలు, కొత్త నియామ‌కాల కార‌ణంగా 13వేల కోట్ల రూపాయ‌ల భారం ఉంది. మొత్తంగా 25వేల కోట్ల రూపాయ‌ల భారం ప్ర‌భుత్వంపై ప‌డుతుంది. రాత‌పూర్వ‌కంగా అంద‌రికీ ఆ భారం గురించి ప్ర‌భుత్వం తెలియ‌చేస్తోంది. కానీ, జీతాలు త‌గ్గిపోతున్నాయంటూ అసంబ‌ద్ధంగా ఉద్యోగులు వాదిస్తున్నారు. వాళ్ల వాల‌కాన్ని సామాన్యులు సైతం సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్య‌తిరేకిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ చ‌ర్చ‌ల‌కు ఉద్యోగ సంఘం నేత‌ల‌ను ప్ర‌భుత్వం ఆహ్వానించింది. అయిన‌ప్ప‌టికీ స‌మ్మెకు వెళ్ల‌డానికి నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఉద్యోగ సంఘాల మ‌ధ్య గ్యాప్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌చివాల‌య వ‌ర్గాల టాక్‌. అంతేకాదు, మిగిలిన ఉద్యోగులు క‌లిసి వ‌చ్చే ప‌రిస్థితి కూడా లేద‌ని స‌మాచారం. ఆ మేర‌కు నిఘా వ‌ర్గాల స‌మాచారం అందుకున్న ప్ర‌భుత్వం ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల‌తో తేల్చుకోవ‌డానికి సిద్ధం అవుతుంద‌ని తెలుస్తోంది.

  Last Updated: 24 Jan 2022, 02:43 PM IST