Apsrtc Hikes Tickets: మూడేళ్లలో మూడుసార్లు ‘బాదుడే.. బాదుడు’

ఏపీలో బాదుడే బాదుడు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆర్టీసీ ఛార్జీల రూపంలో మూడేళ్లలో మూడుసార్లు బాదేసింది ప్రభుత్వం.

  • Written By:
  • Updated On - July 2, 2022 / 02:57 PM IST

ఏపీలో బాదుడే బాదుడు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆర్టీసీ ఛార్జీల రూపంలో మూడేళ్లలో మూడుసార్లు బాదేసింది ప్రభుత్వం. దీనివల్ల ప్రయాణికులపై ఎంత భారం పడుతుందో తెలుసా? అక్షరాలా రూ.2,000 కోట్లు. గతంలో ఏ ప్రభుత్వం పెంచని రీతిలో ఇప్పుడు ఏకంగా నెలల వ్యవధిలో రేట్లు పెంచేశారు. పల్లెవెలుగులో 61.90 శాతం ఛార్జీలు పెరిగాయి. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో 56.94 శాతం ఛార్జీలు పెంచేశారు. దూర ప్రాంతాలకు వెళ్లడానికి పొరపాటున మీరు సూపర్ లగ్జరీ బస్సు ఎక్కితే.. పాత టిక్కెట్ కు అదనంగా 39.65 శాతం ఎక్కువ మొత్తంతో టిక్కెట్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే ఏసీ ఇంద్రాలో ప్రయాణించాలనుకోండి.. పాత టిక్కెట్ ధరపై అదనంగా 34.24 శాతం మొత్తాన్ని అదనంగా చెల్లించాలి.

వైసీపీ సర్కారు పవర్ లోకి వచ్చిన ఐదు నెలలకే అంటే 2019 డిసెంబర్ లో రూ.700 కోట్ల మేర ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్ 14న డీజిల్ సెస్ పేరుతో రూ.720 కోట్ల మేర మళ్లీ బాదింది. ఇప్పుడు జూలై 1 నుంచి మరోసారి డీజిల్ సెస్ పేరుతో ఛార్జీలు పెంచింది. తరువాత ఈ జూలై 1 నుంచి మరో రూ.500 కోట్ల మేర ఛార్జీలను పెంచడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ఆర్టీసీ నడిపే సర్వీసులను గమనిస్తే.. 49 శాతం బస్సులు పల్లెవెలుగు బస్సులే. వీటిలో ప్రయాణించేవారిలో చాలామంది రెక్కాడితే కాని డొక్కాడని వారే. ఈ ఏడాది ఏప్రిల్ లో ఛార్జీలు పెంచిన తరువాత మళ్లీ మూడు నెలల్లోనే మరోసారి ఛార్జీలు పెంచారు. ఇలా చేయడం ఆర్టీసీ చరిత్రలోనే తొలిసారి. దీంతో ప్రైవేటు బస్సులకు, ఆర్టీసి బస్సులకు తేడా ఏమిటని ప్రయాణికులు వాపోతున్నారు.