APSRTC : ఏపీ ఆర్టీసీకి ఒక్క రోజే రికార్డు స్థాయిలో ఆదాయం..

ఈ సంక్రాంతి సీజన్ లో కేవలం ప్రత్యేక బస్సుల ద్వారానే రూ.21.11 కోట్లు వచ్చినట్టు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.

Published By: HashtagU Telugu Desk
APSRTC has a record income in one day.

APSRTC has a record income in one day.

APSRTC : సంక్రాంతి పండగ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ నడిపిన బస్సుల వల్ల రోజుకు రూ. 20 కోట్లు రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. ఈనెల 20న ఒక్కరోజే రూ.23. 71 కోట్లు ఆర్జించడం ఏపీ చరిత్రలో ప్రథమమని ఆర్టీసీ ఎండీ,డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. మూడు రోజుల పాటు రోజుకు రూ.20 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఈ సంక్రాంతి సీజన్ లో కేవలం ప్రత్యేక బస్సుల ద్వారానే రూ.21.11 కోట్లు వచ్చినట్టు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.

సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రైవేట్‌ కళాశాలలు, పాఠశాలల బస్సులను కూడా వివిధ ప్రాంతాల్లో నడిపినట్లు ఆయన తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్ల అంకిత భావం, కృషి ఫలితంగానే ఆర్టీసీ ఈ ఘనత సాధించిందని పేర్కొన్నారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులందరికీ ఆర్టీసీ ఎండీ ప్రత్యేక దన్యావాదాలు తెలిపారు. పండగ సీజన్​లో మొత్తం 7200 బస్సులు నడపాలని ముందుగా నిర్ణయించిన ఆర్టీసీ, ప్రయాణికుల రద్దీ వల్ల అంతకన్నా ఎక్కువగా 9097 ప్రత్యేక బస్సులను నడిపినట్లు వెల్లడించారు. సాధారణ ఛార్జీలతోనే ఈ నెల 8 నుంచి 20 వరకు 11 రోజుల పాటు 9 వేల 97 ప్రత్యేక బస్సులు నడిపినట్లు ఆయన తెలిపారు.

కాగా, సంక్రాంతి పండుగ పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో ఉండే కోలాహలం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి సంబరాల కోసం ఎక్కడెక్కడో ఉన్న తెలుగువారు స్వస్థలాలకు చేరుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. దాంతో పండుగకు ముందు, ఆ తర్వాత బస్సులు, రైళ్లు కిటకిటలాడుతుంటాయి. భారీ డిమాండ్ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు ప్రయాణికుల కోసం సంక్రాంతి సీజన్ లో పెద్ద ఎత్తున అదనపు బస్సులు ఏర్పాటు చేశాయి. దీంతో ఏపీ ఆర్టీసీకి ఒక్క రోజే రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.

Read Also: AI Data Center: హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్.. 3600 మందికి ఉపాధి!

 

  Last Updated: 22 Jan 2025, 12:04 PM IST