APSRTC : జూలై 1 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ పే స్కేల్‌

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు జూలై 1 నుంచి ప్రభుత్వ పే స్కేల్‌ ప్రకారం జీతాలు అందుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు క్యాడర్‌ నిర్ధారణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పూర్తిచేసింది.

  • Written By:
  • Publish Date - June 24, 2022 / 08:30 AM IST

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు జూలై 1 నుంచి ప్రభుత్వ పే స్కేల్‌ ప్రకారం జీతాలు అందుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు క్యాడర్‌ నిర్ధారణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పూర్తిచేసింది. ఈమేరకు నూతన పే స్కేల్‌ను ప్రకటించిన సర్కారు.. జూలై 1 నుంచి కొత్త జీతాలు చెల్లిస్తామని వెల్లడించింది. దీంతో 52 వేల మంది ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ 2020 జనవరి 1నే సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి అప్పటి నుంచే ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది. ఇప్పటివరకు కార్పొరేషన్‌ పే స్కేల్‌ ప్రకారం పేమెంట్స్ చేసింది. నిర్ధారించిన క్యాడర్ కు అనుగుణంగా ఉద్యోగుల జీతాలు, భత్యాలను నిర్ణయించారు. పే స్లిప్‌ల తయారీ, ఇతర లాంఛనాలను పూర్తి చేశారు. తాజా పీఆర్సీ మేరకు ఏడాది కాలానికి ఫిట్‌మెంట్‌ను నిర్ణయించి అమలు చేయనున్నారు. వీటివల్ల ఆర్టీసీ ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం చేకూరుతుంది. డ్రైవర్లు, కండక్టర్లు, సాధారణ, కిందిస్థాయి సిబ్బందికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఏడీసీలుగా పదోన్నతి పొందిన  డ్రైవర్లు, కండక్టర్లకు కలిగే అదనపు ప్రయోజనాలపై తొలుత కొంత సందిగ్ధత నెలకొంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్థిక శాఖను సంప్రదించి తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు. దాంతో వారికీ అదనపు ఆర్థిక ప్రయోజనం కలగనుంది. విజయవాడలో పనిచేసే ఉద్యోగులందరికీ అదనపు హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. ఇప్పటివరకు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చిన దాదాపు 200 మంది ఉద్యోగులకే అదనపు హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో విజయవాడలో పనిచేసే అందరికీ చెల్లిస్తారు. దీనివల్ల దాదాపు 500మందికి మరింత ప్రయోజనం కలగనుంది.