Site icon HashtagU Telugu

GST : జీఎస్టీ వసూళ్లలో ఏపీ దూకుడు

GST Reforms

GST Reforms

వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. 2025 ఆగస్టు నెలలో రూ.1.86 లక్షల కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. ఇది గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 6.5 శాతం వృద్ధి. అయితే జూలై 2025లో వచ్చిన రూ.1.96 లక్షల కోట్లతో పోలిస్తే ఆగస్టులో స్వల్పంగా తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ 2025లో జీఎస్టీ చరిత్రలోనే అత్యధికంగా రూ.2.37 లక్షల కోట్ల వసూళ్లు వచ్చిన సంగతి తెలిసిందే.

Bathukamma Celebrations : ఈనెల 21 నుంచి బతుకమ్మ వేడుకలు – జూపల్లి

ఆంధ్రప్రదేశ్‌ ఆగస్టు నెలలో జీఎస్టీ వసూళ్లలో విశేషమైన వృద్ధి సాధించింది. గత సంవత్సరం 2024 ఆగస్టులో రూ.3,298 కోట్లు వసూలు కాగా, ఈసారి 2025 ఆగస్టులో అది రూ.3,989 కోట్లకు చేరి 21 శాతం వృద్ధి నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 12 శాతం పెరుగుదల కనిపించింది. 2024 ఆగస్టులో రూ.4,569 కోట్ల వసూళ్లు కాగా, ఈసారి రూ.5,103 కోట్లకు చేరాయి. ఈ వృద్ధి రెండు రాష్ట్రాల్లో వాణిజ్య, వ్యాపార రంగాల్లో పుంజుకుంటున్న ఆర్థిక కార్యకలాపాలకు నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

జీఎస్టీ రేట్లలో మార్పులు వస్తాయన్న అంచనాలు మార్కెట్‌లో కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. దీపావళి నాటికి 12, 28 శాతం శ్లాబులను రద్దు చేసి, కేవలం 5, 18 శాతం మాత్రమే ఉంచేలా జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. సెప్టెంబర్ 3–4 తేదీల్లో జరగబోయే మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేట్లు తగ్గుతాయనే ఆశతో వినియోగదారులు కొనుగోళ్లు వాయిదా వేస్తుండటమే ఆగస్టులో వసూళ్లు తగ్గడానికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version