Site icon HashtagU Telugu

Approver Dastagiri: వడ్డీ చెల్లించనందుకు బాలుడిపై దస్తగిరి దాడి

Approver Dastagiri

New Web Story Copy 2023 06 20t151140.389

Approver Dastagiri: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు షేక్‌ దస్తగిరిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కడప జిల్లా పులివెందుల పట్టణంలోని జయమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మైనర్ బాలుడిపై దస్తగిరి దాడికి పాల్పడ్డాడంటూ బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దస్తగిరిపై కేసు నమోదు చేశారు. మరోవైపు బాలుడిని పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఆరు నెలల క్రితం దస్తగిరి వద్ద రూ.40 వేలు అప్పు తీసుకున్నట్లు కుళ్లాయమ్మ తెలిపింది. అయితే చెల్లించాల్సిన వడ్డీ వారం వారం చెల్లిస్తూనే ఉన్నట్టు ఆమె తెలిపింది. అయితే ఆర్ధిక సమస్యల కారణంగా గత 10 రోజులుగా వడ్డీ చెల్లించకపోవడంతో దస్తరగిరి తమ కుమారుడిని తీసుకెళ్లి అతని ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపించింది బాలుడి తల్లి. అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని దస్తగిరి తమను బెదిరించినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. కాగా మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో దస్తగిరిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. అయితే ఆరోపణలను దస్తగిరి ఖండించాడు.

ఇదిలా ఉండగా 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురైన వివేకానందరెడ్డికి దస్తగిరి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారడంతో సిబిఐ అతనిని అరెస్ట్ చేసింది.

Read More: Poornananda Swamy: బాలికపై రెండుళ్లుగా అత్యాచారం… బాబా వేషంలో కామాంధుడు