ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆమె చంద్రబాబు నాయకత్వం, దార్శనికతపై ప్రశంసలు కురిపించారు. సమ్మిళిత అభివృద్ధి, ఆవిష్కరణల ఆధారిత వృద్ధి పట్ల సీఎంకు ఉన్న అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆమె పేర్కొన్నారు.
ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు ప్రీతారెడ్డి తెలిపారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం, యువతకు నైపుణ్యాభివృద్ధి, నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలపై తాము చర్చించామని వివరించారు. చంద్రబాబు ప్రజాసేవ నిబద్ధత ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని కొనియాడారు.
అభివృద్ధి ఫలాలు ప్రతి వర్గానికి అందాలనే చంద్రబాబు విశ్వాసం నేటి సమాజంలో చాలా కీలకమని ప్రీతారెడ్డి అభిప్రాయపడ్డారు. సమ్మిళిత, స్థిరమైన వృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఒక నమూనాగా ఎదిగేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఒక పరివర్తనాత్మకమైన నూతన అధ్యాయం వైపు నడిపిస్తున్న చంద్రబాబుకు మరింత శక్తి, విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రీతారెడ్డి తన ప్రకటనలో తెలిపారు.
