AP Woman : ఉపాధి అవకాశాల కోసం అరబ్ దేశాలకు ఎంతోమంది తెలుగు రాష్ట్రాల ప్రజలు నిత్యం వెళ్తుంటారు. అక్కడి యజమానుల సైకోయిజం వల్ల చాలామంది తెలుగు వాళ్లు చిత్రవధను అనుభవిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమెల్లికి చెందిన కుమారి అనే మహిళ ఇప్పుడు కువైట్‌లో నరకయాతన అనుభవిస్తోంది. యజమాని తనను ఇబ్బంది పెడుతున్నాడని, ఎలాగైనా అతడి చెర నుంచి తనను కాపాడి ఏపీకి తీసుకెళ్లాలని కోరుతూ ఆమె రహస్యంగా ఒక సెల్ఫీ వీడియోను తీసి బంధువులకు పంపించింది. కువైట్‌లో తాను పనిచేస్తున్న ఇంటి యజమాని.. చంపేసేలా ఉన్నాడంటూ కుమారి కన్నీటి పర్యంతమైంది.
Also Read :Harsh Goenka : సెలబ్రిటీల ఓటింగ్‌పై హర్ష్ గోయెంకా ఫైర్.. డైలమాలో ఉన్నారంటూ ఎద్దేవా
గత కొంత కాలంగా తనకు సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి తనను ఏపీలోని తన పిల్లలతో కలపాలని వేడుకుంది. కాకినాడ జిల్లా యల్లమిల్లికి చెందిన కుమారికి(AP Woman) 19 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. భర్త వెంకటేశ్ ఐదేళ్ల కిందట చనిపోయారు. ఏడు నెలల క్రితమే పాలకొల్లుకు చెందిన ఎం.సుధాకర్ అనే ఏజెంట్ సాయంతో ఉపాధి కోసం కువైట్‌కు చేరుకుంది. కువైట్‌లో ఒక ఇంట్లో పనిమనిషిగా చేరింది.
Also Read :Anmol Bishnoi Custody : అమెరికా ‘ఇమిగ్రేషన్’ కస్టడీకి అన్మోల్ బిష్ణోయి.. అయోవా జైలుకు తరలింపు
తూర్పు గోదావరి జిల్లా రఘునాథపురానికి చెందిన కొత్తపల్లి ప్రియాంక, ఇసుకపూడికి చెందిన సరెళ్ల వీరేంద్రకుమార్, అనపర్తికి చెందిన నమిడి ప్రమీల కూడా ఇదే విధంగా అరబ్ దేశాల్లో ఇబ్బంది పడ్డారు. ఒమన్ దేశంలో ప్రియాంక నరకయాతన అనుభవించారు. సౌదీ అరేబియాలో వీరేంద్ర చాలా ఇబ్బందిపడ్డారు. కువైట్‌కు వెళ్లిన ప్రమీల కూడా చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. అయితే మంత్రి నారా లోకేశ్ చొరవతో వాళ్లంతా ఏపీకి సురక్షితంగా తిరిగొచ్చారు. ఎల్లమెల్లికి చెందిన కుమారిని కూడా నారా లోకేశ్ ఆదుకుంటారనే ఆశాభావాన్ని బాధిత మహిళ కుటుంబం వ్యక్తం చేస్తోంది.