New Salary : ఈ నెల నుంచి కొత్త వేత‌నాలు అందుకోనున్న‌ ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నేటి నుంచి కొత్త పే స్కేల్‌ ప్రకారం వేతనాలు అందనున్నాయి.

  • Written By:
  • Publish Date - August 1, 2022 / 10:37 AM IST

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నేటి నుంచి కొత్త పే స్కేల్‌ ప్రకారం వేతనాలు అందనున్నాయి. నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్‌మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగులందరికీ ప్రభుత్వం జూలై 1 నుంచి ప్రొబేషన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వీరందరికీ ఈ నెల నుంచి కొత్త వేత‌నాలు అందుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఒక్కొక్కరికి రూ.15 వేలు గౌరవ వేతనం అందజేస్తున్నారు. వారి స్థానంలో పే స్కేల్‌తోపాటు వేతనాలు చెల్లించాలంటే ఆయా ఉద్యోగుల వివరాలను మరోసారి అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అందుకే సచివాలయ శాఖ కమిషనర్ కార్యాలయంలో అదనపు కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

అంతేకాదు ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు కొత్త పే స్కేల్ అమల్లోకి వచ్చే పరిస్థితి గతంలో లేదని చెబుతున్నారు. డీడీఓల బదిలీల కారణంగా బిల్లుల సమర్పణలో జాప్యం జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. కొన్ని చోట్ల డీడీఓలు వివిధ కారణాలతో బిల్లుల సమర్పణలో జాప్యం చేసినా 30వ తేదీ వరకు బిల్లులు వచ్చేలా చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వేతనాల విషయంలో అనేక ప్రచారాలు జరిగాయి. ఈ ఉద్యోగాలు తాత్కాలికమేనని, జీతాలు పెరగవని చర్చ జరిగింది. ఉద్యోగులందరికీ పే స్కేల్‌ను అమలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఇవ్వలేమని ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా.. కొత్త వేతనాల ప్రకారం చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారన్నారు. ప్రొబేషన్ తర్వాత తొలిసారిగా పే స్కేల్ ప్రకారం వేతనాలు అందుకోనున్న ఉద్యోగులను ఆయన అభినందించారు.