AP Ration Issue : రేష‌న్ ప‌రేషాన్ వ‌ద్దు..ఇక అంద‌రికీ బియ్యం!

రేష‌న్ ప‌రేషాన్ కు ఏపీ ప్ర‌భుత్వం తెర‌దించింది. ఇప్ప‌టి వ‌ర‌కు రేష‌న్ డీల‌ర్ షాపుల‌ ర‌ద్దు, కార్డుల తొలగింపు ఉంటుంద‌ని సర్వ‌త్రా ఆందోళ‌న ఉండేది.

  • Written By:
  • Publish Date - July 26, 2022 / 03:00 PM IST

రేష‌న్ ప‌రేషాన్ కు ఏపీ ప్ర‌భుత్వం తెర‌దించింది. ఇప్ప‌టి వ‌ర‌కు రేష‌న్ డీల‌ర్ షాపుల‌ ర‌ద్దు, కార్డుల తొలగింపు ఉంటుంద‌ని సర్వ‌త్రా ఆందోళ‌న ఉండేది. కేంద్రం నుంచి వ‌చ్చిన అనుమ‌తి, రాష్ట్ర ప్ర‌భుత్వం చిత్తుశుద్ది కార‌ణంగా య‌థాత‌దంగా బియ్యం పంపిణీ ఉంటుంద‌ని ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ మంత్రి నాగేశ్వ‌ర‌రావు వెల్ల‌డించారు. ఏ ఒక్క కార్డును తొల‌గించ‌కుండా బియ్యం స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఏపీలో 89 లక్షల బియ్యం కార్డులకు కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని మంజూరు చేసింది. కార్డుదారులకు రాష్ట్ర ప్ర‌భుత్వం పంపిణీ చేస్తుంది. రేషన్ దుకాణాలు యథావిధిగా కొన‌సాగించ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధం అయింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పిఎంజికెవై) కింద రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రత కార్డులు (ఎన్‌ఎఫ్‌ఎస్‌సి) 2.68 కోట్ల మందికి ఉన్నాయి. వాళ్ల‌కు మాత్రమే కేంద్రం ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు రేషన్ బియ్యం అందుతోంది. మిగిలిన 1.55 కోట్ల మంది బీపీఎల్‌ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వమే రేషన్‌ బియ్యాన్ని అందజేస్తోంది. వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించిన ఏడు జిల్లాల్లోని 1.67 కోట్ల మందిలో 89.2 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, అట్టడుగు సామాజిక వర్గాలకు చెందిన వారని మంత్రి నాగేశ్వ‌ర‌రావు వెల్ల‌డించారు.

రాష్ట్రంలో అంత్యోదయ కార్డులున్న 24.60 లక్షల మంది ఆగస్టు 1 నుంచి కొత్తగా రేషన్ బియ్యానికి అర్హులు. ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం వరకు అందరికీ బియ్యం పంపిణీ చేయబడుతుంది. అందుకు సంబంధించి వాలంటీర్లు అందరికీ కూపన్లు ఇస్తారు. రేషన్ కార్డుల రద్దు లేదని నాగేశ్వరావు చెప్పారు. “బియ్యం కార్డులు తగ్గిస్తామనీ, రేషన్ షాపులు మూసేస్తామనీ ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వీటిలో వాస్తవం లేదు. ఒక్క కార్డు కూడా తొలగించబడదు మరియు ఒక్క రేషన్ దుకాణం కూడా మూసివేయబడదు.` అని మంత్రి ప్ర‌క‌టించారు.

గత ఐదేళ్లలో సివిల్ సప్లయి కోసం 12 వేల కోట్లు ఖర్చు చేస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో పౌర సరఫరాలపై రూ.16,000 కోట్లు. ఖ‌ర్చు చేసింది. ఈ మూడేళ్లలో పేద ప్రజలకు 7,051 కొత్త రేషన్ కార్డులను జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.