ఇక సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ బుకింగ్..టిక్కెట్ల విక్ర‌యానికి ఏపీ ప్ర‌భుత్వం సిద్ధం

ఏపీలో సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారం వెనుక ఏం జ‌రుగుతుంది? బ‌స్ టిక్కెట్ల‌ను ఆన్ లైన్లో అందించ‌లేని స‌ర్కార్ ఇప్పుడు సినిమా టిక్కెట్ల‌కు ఆన్ లైన్ ప‌ద్ధ‌తిని ఎలా నిర్వ‌హిస్తుంద‌ని ప్ర‌శ్న‌. ఏపీఎస్ ఆర్టీసీ బ‌స్సు ఆన్ లైన్ బుకింగ్ ఇటీవ‌ల రెడ్ బ‌స్సు పోర్ట‌ల్ కు ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - September 21, 2021 / 03:35 PM IST

ఏపీలో సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారం వెనుక ఏం జ‌రుగుతుంది? బ‌స్ టిక్కెట్ల‌ను ఆన్ లైన్లో అందించ‌లేని స‌ర్కార్ ఇప్పుడు సినిమా టిక్కెట్ల‌కు ఆన్ లైన్ ప‌ద్ధ‌తిని ఎలా నిర్వ‌హిస్తుంద‌ని ప్ర‌శ్న‌. ఏపీఎస్ ఆర్టీసీ బ‌స్సు ఆన్ లైన్ బుకింగ్ ఇటీవ‌ల రెడ్ బ‌స్సు పోర్ట‌ల్ కు ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంది. క‌మిష‌న్ రూపంలో ఒక్కో టిక్కెట్ కు 15 రూపాయ‌ల వ‌ర‌కు ప్రైవేటు పోర్ట‌ల్ కు ల‌బ్ది చేకూరుతుంది. ఆ భారం ప్ర‌జ‌ల మీద వేయ‌డానికి ఏపీ స‌ర్కార్ సిద్ధం అయింది. కొన్ని కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణం ఈ నిర్ణ‌యం వెనుక దాగి ఉంద‌ని విప‌క్ష‌లు ఆరోపిస్తున్నాయి.
ఆర్టీసీ ఆన్ లైన్ బుకింగ్ ను థ‌ర్డ్ పార్టీకి ఇచ్చిన ఏపీ స‌ర్కార్ ఒక విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటూ ఇంకో వైపు సినిమా టిక్కెట్ల‌ను ఆన్ లైన్లో విక్ర‌యించ‌డానికి రెడీ అయింది. త్వ‌ర‌లోనే రైల్వే బుకింగ్ త‌ర‌హాలో పోర్ట‌ల్ ను డిజైన్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంది. అందుకు సంబంధించిన హామీని స‌మాచార‌శాఖ మంత్రి పేర్ని నాని త‌న‌ను క‌లిసిన సినిమా డెలిగేష‌న్ కు ఇచ్చారు. డెలిగేష‌న్లో సీ క‌ల్యాణ్‌, దిల్ రాజు, శేష‌గిరి రావు ఉన్నారు. గ‌తంలోనే ప‌లు సంద‌ర్భాల్లో ఆన్ లైన్ టిక్కెట్ విధానంను ప్ర‌భుత్వాలు ప‌రిశీలించిన విష‌యాన్ని నాని గుర్తు చేశారు.
రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ద‌య‌చేసి సినిమా ప‌రిశ్ర‌మ‌ను ఆదుకోవాల‌ని ల‌వ్ స్టోరీ వేదిక పై నుంచి మెగాస్టార్ చిరంజీవి అభ్య‌ర్థించారు. టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకోవాల‌ని సినీ వ‌ర్గాలు ప్ర‌తిపాద‌న‌ల‌ను ఉంచాయి. పెరిగిన రేట్ల‌కు అనుగుణంగా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించాల‌ని కోరుతున్నారు. అందుకు ప్రాథ‌మికంగా మంత్రి నాని నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది. ఇక నుంచి ఏపీలో కొత్త సినిమాల‌కు బెనిఫిట్ షోలు, టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునే వెసుల‌బాటు క‌లిగే అవ‌కాశం ఉంది.
డెలిగేష‌న్ ప్ర‌తిపాదించిన అంశాల‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దృష్టికి మంత్రి పేర్ని నాని తీసుకెళ్లారు. సీఎం నుంచి వ‌చ్చే ఆదేశాల కోసం సినీ వ‌ర్గాలు వేచిచూస్తున్నాయి. ఇంకో వైపు విప‌క్షాలు సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ బుకింగ్ ప్ర‌భుత్వం చేయ‌డాన్ని త‌ప్పుబ‌డుతున్నాయి. ప్ర‌భుత్వాలు చేయాల్సిన ప‌నులు చేయ‌కుండా బిజినెస్ చేయ‌డాన్ని నిల‌దీస్తున్నాయి. ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి ఇదో ఎత్తుగ‌డ‌గా భావిస్తున్నాయి. సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ బుకింగ్ ను కూడా ఏదో ఒక ప్రైవేటు పోర్ట‌ల్ కు అప్ప‌చెప్ప‌డం ద్వారా కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణానికి ప్ర‌భుత్వం తెర‌దీస్తుంద‌ని టీడీపీ ఆరోపిస్తోంది. మొత్తం మీద సినిమా ధ‌ర‌ల వాయింపుడుతో పాటు ఆర్టీసీ టిక్కెట్ల బుకింగ్ త‌ర‌హాలో సినిమా టిక్కెట్ల బుకింగ్స్ ను ప్రైవేటుకు అప్ప‌గించ‌డం ద్వారా ఏపీ ప్ర‌భుత్వం ఆరోప‌ణ‌ల‌కు అవ‌కాశం ఇస్తోంది.

Follow us