AP Temples : జ‌గ‌న్ దేవాల‌యాలు! ఏడాదిలోగా నిర్మాణం!

రాష్ట్ర వ్యాప్తంగా దేవాల‌యాల‌ను నిర్మించ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం సిద్ధం అయింది.

  • Written By:
  • Updated On - December 2, 2022 / 04:09 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా దేవాల‌యాల‌ను నిర్మించ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం సిద్ధం అయింది. వ‌చ్చే ఏడాది ఆఖ‌రినాటికి 1400 దేవాల‌యాను నిర్మించాల‌ని కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను ర‌చించింది. హిందూ వ్య‌తిరేకిగా అప‌వాదును ఎదుర్కొంటోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ఆ ముద్ర నుంచి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నం ప్రారంభించారు. మూడేళ్లుగా హిందూ దేవాల‌యాల‌కు ర‌క్ష‌ణ లేకుండాపోయింద‌ని, మ‌తమార్పిడులు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయ‌న్న హిందూ సంస్థ‌లు ప‌లుమార్లు ఆందోళ‌నకు దిగారు.నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డం ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ను ఆ సంస్థ‌ల ప్ర‌తినిధులు త‌ప్పుబ‌ట్టారు. పీఠాధిప‌తులు, మ‌ఠాధిప‌తులు విజ‌య‌వాడ కేంద్రంగా స‌మావేశ‌మై గ‌త ఏడాది ప్ర‌భుత్వ తీరుపై తిరుగుబాటుకు దిగారు. ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌కు, అప‌వాదుల‌కు ఫుల్ స్టాఫ్ పెడుతూ దేవాల‌యాల నిర్మాణానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ సిద్ధం కావ‌డం గ‌మ‌నార్హం.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం నిధుల నుంచి దేవాల‌యాల నిర్మాణాల‌ను చేప‌ట్ట‌బోతున్నారు. గ్రామాలలో కొత్త దేవాలయాల నిర్మాణానికి ఆర్థిక సహాయం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. హిందూ మతానికి చెందిన‌ ఎన్జీవో లు ఈ దేవాల‌యాల నిర్మాణాల‌కు చేతులు క‌ల‌పాల‌ని ప్రభుత్వం ప్రతిపాదించింది. RSSకి అనుబంధంగా ఉన్న‌ సేవా ఫౌండేషన్ (SSF) ద్వారా దేవాల‌యాల‌ను నిర్మించ‌డానికి ప్రాథ‌మికంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ముందుకొస్తోంది. ఆ మేర‌కు ఉప ముఖ్యమంత్రి (ఎండోమెంట్స్) కొట్టు సత్యనారాయణ ప్ర‌క‌టించారు.

ప్ర‌భుత్వం సొంత నిధుల‌తో 1,060 దేవాలయాల నిర్మాణాన్ని చేపడుతుంద‌ని స‌త్య‌నారాయ‌ణ వెల్ల‌డించారు.
హిందూ మతంకు చెందిన‌ NGO సమరసత సేవా ఫౌండేషన్ ఈ దేవాల‌యాల‌ను నిర్మాణాల‌ను చేపట్టడానికి ముందుకు వ‌చ్చింద‌ని తెలిపారు. ఆ సంస్థ దాదాపు 330 దేవాలయాల నిర్మాణం చేప‌డుతుంద‌ని అన్నారు. ఒక్కో ఆలయ నిర్మాణానికి దాదాపు రూ.10 లక్షలు ఖ‌ర్చు చేసేలా ప్లాన్ చేశారు. ఆలయ నిర్మాణానికి దాదాపు 8 లక్షలు, విగ్ర‌హాల తయారీకి 2 లక్షలు వెచ్చించనున్నారు. ఆల‌యాల నిర్మాణాల‌కు ప్రైవేటు కాంట్రాక్ట‌ర్ల సహాయ స‌హ‌కారాలు తీసుకోవడంపై స్థానికులు, భక్తులు నిర్ణ‌యిస్తార‌ని వివ‌రించారు. దేవాదాయ‌శాఖ ఈవోలు పనులను వ్యక్తిగతంగా పర్యవేక్షించేందుకు నియమించేలా ప్లాన్ చేశారు.

ఆల‌యాల్లో శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి విగ్ర‌హాల ఖ‌ర్చును పూర్తిగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం భరిస్తుంది. ఇత‌ర దేవాలయాల్లోని విగ్రహాలకు 25 శాతం సబ్సిడీపై ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆలయ నిర్మాణ పనులను స్థానిక కమిటీలకు అప్పగించాల‌ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించారు. ప్రభుత్వం మంజూరు చేసిన గ్రాంట్ కంటే ఎక్కువ నిధులను స‌మీక‌రించుకోవ‌డానికి అనుగుణంగా ఆలయ డిజైన్‌కు కట్టుబడి ఉండాలని మంత్రి సత్యనారాయణ అన్నారు. గ్రామస్తుల కమిటీలకు అర్చకుడిని నియమించుకునే స్వేచ్ఛ ను ఇచ్చారు. స్థానికుల నుండి వచ్చిన డిమాండ్ల ఆధారంగా ఆల‌యాల‌ను నిర్మించ‌డానికి ప్ర‌భుత్వం ముందుకొస్తోంది. బడుగు బలహీన వర్గాల ప్రజలు, దళితులు నివసించే కాలనీల్లో దేవాయాల‌ను నిర్మించ‌డానికి ప్రాధాన్యం ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని స‌త్య‌నారాయ‌ణ వెల్ల‌డించారు.

చ‌ర్చిల్లోని ఫాద‌ర్లు, మ‌సీదుల్లోని ఇమాంల‌కు ప్ర‌తి నెలా రూ. 5వేల చొప్పున జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ గౌర‌వ‌వేత‌నంగా ఇస్తోంది. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో చ‌ర్చిల‌ను నిర్మించ‌డానికి సుమారు రూ. 172 కోట్ల‌ను ప్ర‌భుత్వం గ‌త వారం విడుద‌ల చేసింది. దీంతో హిందూ సంస్థ‌ల నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ మీద వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన ఏపీ ప్ర‌భుత్వం దేవాల‌యాల నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. గ‌తంలో ఏ ప్ర‌భుత్వం దేవాల‌యాలు, చ‌ర్చిలు, మ‌సీదుల కోసం నిధుల‌ను కేటాయించ‌లేదు. కానీ, ఇప్పుడున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మ‌త ప్రాతిప‌దిక‌న నిధుల‌ను కేటాయిస్తోంది. ఈ ఒర‌వడి ఎటు వైపు దారితీస్తుందో చూడాలి.