Varla Ramaiah : ద‌స్త‌గిరి, సీబీఐ అధికారుల‌కు ప్రాణ‌హాని : టీడీపీ నేత వ‌ర్ల

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య వెనుక వైసీపీ అగ్ర‌నేత‌లు ఉన్నార‌ని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబ‌ర్ వ‌ర్ల రామ‌య్య ఆరోపించారు

  • Written By:
  • Updated On - May 31, 2022 / 04:17 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య వెనుక వైసీపీ అగ్ర‌నేత‌లు ఉన్నార‌ని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబ‌ర్ వ‌ర్ల రామ‌య్య ఆరోపించారు. కేసులో అప్రూవ‌ర్ గా మారిన ద‌స్త‌గిరితో పాటు సీబీఐ అధికారుల‌కు కూడా ప్రాణ‌హాని ఉంద‌ని డీజీపీకి ఆయ‌న లేఖ రాయ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. హ‌తుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మామ కావడం కార‌ణంగా సాక్ష్యాల‌ను తారుమారు చేయ‌డానికి అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. సీబీఐ అధికారులకు, దస్తగిరికి స్థానిక పులివెందుల నేతలు నుంచి ప్రాణహాని ఉంద‌ని అనుమానించారు.

పోలీసుల అండదండలతోనే వివేక హ‌త్య జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు. పైగా స్థానిక పోలీసులు దస్తగిరి, సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బృందం దర్యాప్తు చేస్తోంది. హత్య కేసులో షేక్ దస్తగిరి అప్రూవర్‌గా మారారు. అప్పటి నుంచి తనకు ప్రాణహాని ఉందని చెబుతున్నారు. అధికార వైఎస్ఆర్ సీపీ నేతల ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు ఆయనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు అధికారిపై కూడా స్థానిక పోలీసులు తప్పుడు కేసులు పెట్టార‌ని వ‌ర్ల లేఖ‌లో పొందుప‌రిచారు. పేలుడు బాంబులు విసురుతామ‌ని, తీవ్ర పరిణామాలు ఉంటాయని సిబిఐ అధికారి డ్రైవర్‌ను బెదిరించిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఈ ఘటనలన్నీ వైఎస్‌ఆర్‌ సీపీ నేతల కనుసన్నన‌లోనే పోలీసులు చేస్తున్నార‌ని ప్రజలు విశ్వసించేలా చేశారని ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను అడ్డుకోవడంలో రాష్ట్ర రాజకీయ అగ్రనేతల పాత్రపై అనుమానాలు ఉన్నాయ‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

“సంచలనం సృష్టించిన ఈ హత్యకేసులో అప్రూవర్ అయిన దస్తగిరికి సరైన భద్రత, రక్షణ కల్పించడం కీలకమైంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారుల జీవితాలకు తగిన భద్రత కల్పించడం కూడా ముఖ్యం. దస్తగిరికి గానీ, సీబీఐ దర్యాప్తు అధికారులకు గానీ హాని జరిగితే వైఎస్ఆర్ సీపీ నేతృత్వంలోని ప్రభుత్వంతోపాటు రాష్ట్ర పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని రామయ్య హెచ్చరించారు. వైఎస్ఆర్ సీపీ నాయకుల ఆజ్ఞల మేరకు కాకుండా రాజ్యాంగ కర్తవ్యం మేరకు పోలీసులు నడుచుకోవాలని వ‌ర్ల‌ విజ్ఞప్తి చేశారు.“