ఒకవైపు జగన్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని చెప్పుకుంటూ వారి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. అయితే రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ‘క్రైమ్ ఇన్ ఇండియా 2021 నివేదిక’లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వివరాలను వెల్లడించింది. దేశంలో 10,881 మంది రైతులు, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలలో, 1,065 (9.78%) ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఆంధ్రప్రదేశ్‌లో సగటున ఒక్కరోజులో ముగ్గురు రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో ఎక్కువ మందికి సొంత భూములుండటం గమనార్హం.
ఇలాంటి ఆత్మహత్యలు ఏపీ కంటే మహారాష్ట్ర, కర్ణాటకల్లో మాత్రమే ఎక్కువ. మొత్తం నేరాల రేటులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 10వ స్థానంలో ఉంది. మహిళలపై నేరాల విషయంలోనూ రాష్ట్రం 10వ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం దిశా చట్టం ఉన్నప్పటికీ 2020తో పోల్చినప్పుడు ఇటువంటి కేసులు 2021లో పెరిగాయి. రాష్ట్రంలో చిన్నారులపై నేరాలు, హత్యల కేసులు కూడా స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో నేరాలకు పాల్పడే యువకుల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన రిపోర్ట్స్ ఆధారంగా ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.