ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక అంశం గెలుపు ఓటములను నిర్ణయిస్తోంది. ఆ అంశం మిగిలిన వాటిని కాదని ఓటర్లపై బాగా ప్రభావం చూపుతుంది. ప్రత్యేక రాష్ట్ర నినాదంతో కేసీఆర్ 2004 ఎన్నికల నుంచి రాజకీయాన్ని ప్రారంభించాడు. ఆ నినాదమే శ్రీరామరక్షగా ఇప్పటికే టీఆర్ఎస్ వాడుకుంటోంది. 2004 ఎన్నికల్లో చంద్రబాబు కార్పొరేట్ మనిషి, రైతు వ్యతిరేక అనే నినాదం కాంగ్రెస్ పార్టీకి గెలుపు అస్త్రంగా పనిచేసింది. ఆరోగ్యశ్రీ పథకం 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి సీఎం కావడానికి బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కింది. జగన్ అవినీతి కేసులను బ్రహ్మాస్త్రంగా 2014 ఎన్నికల్లో ప్రయోగించి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఇక 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా నినాదం, ఒక్క ఛాన్స్ విజ్ఞప్తి జగన్ ను సీఎం చేసింది.ఇక 2024 ఎన్నికల్లో ఏ అంశం ఏపీ ఎన్నికల్లో బ్రహ్మాస్త్రం కాబోతుంది? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికల స్లోగన్ గా ఫిక్స్ చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. అందుకు తగిన విధంగా రాజకీయ వ్యూహాన్ని రచిస్తోంది. కులం, ప్రాంతం, మతం అనే అంశాలు సున్నితమైనవి. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉన్నప్పటికీ ఎన్నికల నాటికి ఆ మూడు అంశాలు ఏ విధంగా రైజ్ అవుతాయో ఇప్పుడే అంచనా వేయలేం. కానీ, ప్రాంతీయ వాదం రాజకీయ పార్టీలకు జీవం. ఆ విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నిరూపించింది. అదే ప్రాంతీయ వాదాన్ని ఇప్పుడు వైసీపీ నమ్ముకున్నట్టు తెలుస్తోంది. కులం, మతం ఈక్వేషన్ వైసీపీకి అనుకూలంగా ఉందని ఆ పార్టీ వర్గాల భావన. క్రిస్టియన్ గా జగన్ ను ఆ మతానికి చెందిన ఓటర్లు నమ్ముతున్నారు. ఏపీలో దాదాపు 80శాతం ఎస్సీలు క్రిస్టియన్ మతంలోకి మారారని ఒక అంచనా.
మూడు రాజధానుల రూపంలో ప్రాంతీయవాదాన్ని లేపడం ద్వారా మళ్లీ అధికారంలోకి రావచ్చని వైసీపీ వ్యూహంగా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే, కర్నూలు రాజధాని కావాలని ఆ ప్రాంతం ఓటర్లలో బలమైన కోరిక ఉంది. శ్రీబాగ్ ఒప్పందం కూడా కర్నూలు రాజధాని అంశాన్ని ప్రస్తావించింది. లేదంటే కనీసం హైకోర్టును ఏర్పాటు చేయాలని చాలా కాలంగా అక్కడ డిమాండ్ ఉంది. ఆ ప్రాంత నాయకులు ఇప్పటికీ హైకోర్టు కోసం ఉద్యమాలు చేస్తున్నారు. అందుకే, హైకోర్టు బెంచ్ అనే విషయాన్ని చంద్రబాబు 2019 ఎన్నికల్లో ప్రస్తావించకుండా ఉండలేకపోయాడు. ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల్లో రాజధాని కావాలని పెద్దగా కోరికలేదు. అయినప్పటికీ ఎన్నికల నాటికి సున్నితమైన రాజధాని అంశాన్ని అక్కడఫోకస్ చేయడానికి అవకాశం ఉందని వైసీపీ భావిస్తుందట. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఓటర్ల మనస్తత్వం భిన్నంగా ఉంటుంది. అక్కడ ప్రాంతీయ సెంటిమెంట్ లు పెద్దగా పనిచేయవు. కానీ, మతం చాపకిందనీరులా అక్కడ పనిచేస్తోంది.గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కులం ప్రాతిపదికన ఎక్కువగా ఓటింగ్ జరుగుతుంది. రాజధాని అమరావతిలోనే ఉండాలని అక్కడి ఓటర్లు బలంగా భావించరు. అందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు నిదర్శనం. ఇక గోదావరి జిల్లాల్లో పక్కాగా కులం ఆధారంగా ఓటింగ్ జరుగుతుందని గత ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటే అర్థం అవుతోంది. రాజధాని వాదం కంటే కాపు, కాపేతర కులాల ప్రాతిపదికన ఎక్కువగా ఓటింగ్ జరుగుతుంది. అందుకే, అక్కడ జనసేన కు 2019 ఎన్నికల్లో ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. పైగా రాయలసీమ జిల్లాలు అమరావతి రాజధానిపై వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ విషయం చంద్రబాబు అమరావతి కోసం జోలె పట్టిన సందర్భంగా వచ్చిన వ్యతిరేకత స్పష్టం చేస్తోంది.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ఓటర్లను బాగా నమ్ముకున్న జగన్ మూడు రాజధానుల అంశాన్ని ఫోకస్ చేయాలనే వ్యూహాన్ని రచిస్తున్నాడని తెలుస్తోంది. విశాఖ నుంచి పరిపాలన సాగించడం ద్వారా ఉత్తరాంధ్ర ఓటర్ల మనసు దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. రాయలసీమ ఓటర్లు ఈసారి మూడు రాజధానుల నినాదానికి అనుకూలంగా ఉంటారని అంచనా. ఇక ఉభయగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో అమరావతి రాజధాని కంటే కులం, మతం పైచేయిగా నిలిచే అవకాశం ఉంది. ఇలాంటి ఈక్వేషన్స్ నడుమ మూడు రాజధానుల అంశాన్ని 2024 ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాలని జగన్ స్కెచ్ వేశాడని వినికిడి. చంద్రబాబు మాత్రం అమరావతి రాజధాని నినాదాన్ని బలంగా వినిపిస్తున్నాడు. ఆ నినాదాన్ని వినిపిస్తూ వెళ్లిన చంద్రబాబుకు విశాఖ, కర్నూలు జిల్లాల్లోని జనం నుంచి వచ్చిన వ్యతిరేకతను గుర్తుండే ఉంటుంది. ఇటీవల న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర కూడా కేవలం కోస్తాంధ్ర వెంబడి మాత్రమే చేశారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు వెళితే పరిస్థితి ఏమిటో అమరావతి సాధన సమితికి తెలుసు. సో..ఇలాంటి ఈక్వేషన్ల నడుమ అమరావతి రాజధాని చంద్రబాబును ముంచుతుందా? 2024 ఎన్నికల్లో తేల్చుతుందా? అనే ప్రశ్నలు టీడీపీలో చర్చకు వస్తున్నాయి. మూడు రాజధానుల అంశం మళ్లీ గెలుపుకు అవకాశంగా మారుతుందని పీకే సర్వేల ద్వారా జగన్ నమ్ముతున్నాడని వైసీపీ వర్గాల వినికిడి. మొత్తం మీద 2024 ఎన్నికల్లో అమరావతి, మూడు రాజధానుల అంశం ఎజెండా కాబోతుందన్నమాట.