AP Skill Development: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్.. 26 మందికి ఈడీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వయ హయాంలో జరిగిన అక్రమాలపై ఈడీ ఫోకస్ చేసింది.

  • Written By:
  • Publish Date - December 4, 2022 / 04:13 PM IST

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వయ హయాంలో జరిగిన అక్రమాలపై ఈడీ ఫోకస్ చేసింది. గత రెండ్రోజులుగా ఎన్నారై మెడికల్ కాలేజీ వ్యవహారంపై దృష్టి పెట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో జరిగిన అక్రమాలపై విచారణకు హాజరు కావాలంటూ పలువురికి నోటీసులు జారీ చేసింది. ఏపీ  ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ఉన్న స‌మ‌యంలో స్కిల్ డ‌వ‌ల‌ప్మెంట్ కార్పోరేష‌న్ లో భారీగా కుంభ‌కోణం జ‌రిగినట్టు ఆరోపణలున్నాయి. అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి జ‌ర్మ‌నీకి చెందిన సీమెన్స్ సంస్థ‌కు వృత్తి నైపుణ్యంపై శిక్ష‌ణ ఇచ్చే విష‌య‌మై ఒక ఒప్పందం కుదిరింది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో సీమెన్స్ సంస్థ  ఈ 3 వేల 350 కోట్ల ప్రాజెక్టు ఒప్పందం చేసుకుంది. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 370 కోట్లుగా ఉంది.

ఈ ప్రభుత్వ వాటాలోని 370 కోట్లలో సుమారు 241 కోట్లు దారి మళ్ళించారని స్కిల్ డెవలప్ మెంట్ లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ లో తేలింది. నకిలీ బిల్లులు, ఇన్‌వాయిస్‌ల ద్వారా జిఎస్టీకి గండి కొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గతంలోనే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లు సహా పలువురిపై కేసులు నమోదు అయ్యాయి. ఆ నివేదిక ఆధారంగానే ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ వారిపై విచారణ జరిపే బాధ్యతను సీఐడీకి అప్పగించింది. ఆ చెల్లింపుల్లో అవకతవకలు నేపథ్యంలోనే సీఐడీ అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ ఫౌండర్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాద్ లోని లక్ష్మీనారాయణ ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సీఐడీ పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అక్కడికి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక్రిష్ణ కూడా రావడం ఈ కేసులో మరింత ఆసక్తికర పరిణామంగా మారింది.

అసలు ఈ అవినీతిలో చాలా అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఒప్పందం లో తొలుత తేదీ కూడా వేయకుండా చేసుకోవడం అనుమానాలకు తావిచ్చింది. సిమన్స్ సంస్థ ఎటువంటి పెట్టుబడి పెట్టకముందే చాలా వేగంగా నిధులు చెల్లించినట్టు ఆరోపణలున్నాయి. ఏపీస్టేట్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయంటూ ప్రస్తుత ఛైర్మన్ అజయ్‌ రెడ్డి ఏపీ సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో సిఐడి కేసులు నమోదు చేసింది. నోటీసులు అందుకున్న వారు సోమవారం విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది.