Site icon HashtagU Telugu

AP Skill Case Bogus : ‘ఏపీ స్కిల్’ కేసుపై సీమెన్స్ మాజీ ఎండీ కీలక వ్యాఖ్యలు.. ఆరోపణలన్నీ అబద్ధాలేనని స్పష్టీకరణ

Ap Skill Case Bogus

Ap Skill Case Bogus

AP Skill Case Bogus : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్ కేసుకు సంబంధించి సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏపీ స్కిల్ కేసు బోగస్. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటుచేసిన శిక్షణ కేంద్రాలను చూడకుండానే అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఒక్క కేంద్రాన్ని కూడా సందర్శించలేదు. ఒక్క తనిఖీ సైతం జరగలేదు. కేసు మాత్రం పెట్టారు. ఇలా ఎందుకు జరిగిందన్నది పెద్ద మిస్టరీ’’ అని కామెంట్స్ చేశారు. ‘‘సీమెన్స్ కంపెనీ, ఏపీఎస్‍ఎస్‍డీసీ (APSSDC)  మధ్య ఒప్పందం కుదిరింది. APSSDC ప్రభుత్వ సంస్థ కాదా? ఎండీగా నేను, మా కంపెనీ సీఎఫ్ఓ సంతకం చేశాం. గతంలో ఏపీ స్కిల్ స్కీమ్ ను మెచ్చుకున్న ఏపీఎస్‍ఎస్‍డీసీనే ఈ ప్రాజెక్టు బోగస్ అని ఆరోపించింది. ఈ తప్పుడు ఆరోపణల గురించి వింటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. మార్కెటింగ్ లో భాగంగానే ప్రభుత్వం, సీమెన్స్ మధ్య 90:10 ఒప్పందం జరిగింది’’ అని  సుమన్ బోస్ పేర్కొన్నారు. తమ కంపెనీకి చెందిన ఒక సాప్ట్ వేర్‍పై యువతకు అవగాహన కల్పిస్తే దానికి డిమాండ్ పెరుగుతుందని భావించినట్లు సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్  వివరించారు.

Also read : Kollywood : అనిరుధ్ తో కీర్తి సురేష్ పెళ్లి..క్లారిటీ ఇచ్చిన కీర్తి తండ్రి

డిస్కౌంట్స్ లో అవినీతి సాధ్యమని ఎలా చెబుతారు?

‘‘తప్పుడు ఆరోపణలు చేయడం సులువు. రెండున్నర ఏళ్లుగా ఒక్క సాక్ష్యం కూడా చూపించ లేకపోయారు.. నిజం ఎప్పటికి నిజమే’’ అని వ్యాఖ్యానించారు.  ‘‘2021 వరకు స్కిల్ డెవలప్‍మెంట్ ద్వారా 2.32 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2021లో ఈ ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించేశాం. ప్రాజెక్టు విజయవంతమైందని ఏపీఎస్‍ఎస్‍డీసీ ఎండీ కూడా మెచ్చుకున్నారు. 2018లోనే ఈ ప్రాజెక్టు నుంచి నేను బయటకు వెళ్లిపోయాను. 2021 తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీఎస్‍ఎస్‍డీసీలో ఏం జరిగిందో నాకు తెలియదు’’ అని సుమన్ బోస్ (AP Skill Case Bogus) మీడియాకు తెలిపారు. ‘‘స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో ఏమాత్రం అవినీతి జరగలేదు. అన్నీ అధ్యయనం చేశాకే ఈ ప్రాజెక్టు ప్రారంభించాం. ప్రాజెక్టులో అధిక భాగం సీమెన్స్ నుంచి డిస్కౌంట్స్ రూపంలో అందింది. డిస్కౌంట్స్ లో అవినీతి సాధ్యమని ఎలా చెబుతారు? సీమెన్స్ తో ఒప్పందం జరగలేదనడం పూర్తి అబద్దం’’ అని ఆయన వివరించారు.