AP-Reorganisation : బిగ్ బ్ర‌ద‌ర్ కు దాసోహం! జ‌గ‌న్ `సుప్రీం` త‌ప్పిదం!

ఏపీ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తం కావాల్సిన స‌మ‌యం ఆస‌న్నం అయింది. లేదంటే, ల‌క్ష‌లాది కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాని కి వ‌దిలేసే అవ‌కాశం ఉంది

  • Written By:
  • Updated On - December 8, 2022 / 04:36 PM IST

ఏపీ ప్ర‌జ‌లు(ap public) అప్ర‌మ‌త్తం కావాల్సిన స‌మ‌యం ఆస‌న్నం అయింది. లేదంటే, ల‌క్ష‌లాది కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాని(telangana state)కి వ‌దిలేసే అవ‌కాశం ఉంది. ఆ విష‌యాన్ని సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్(undavalli ) గుర్తు చేశారు. ఏపీ సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన తొలి రోజుల్లోనే హైద‌రాబాద్ లోని ఏపీ స‌చివాల‌యాన్ని తెలంగాణ‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ధారాద‌త్తం చేశారు. మిగిలిన వాటిని కూడా ఇచ్చేయ‌డానికి ఇప్పుడు సిద్ధం అయ్యార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. పైగా 2024 నాటికి ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ మీద ఎలాంటి హ‌క్కు చ‌ట్ట ప్ర‌కారం లేకుండా పోయే ప్ర‌మాదం ముంచుకొస్తోంది.

విభ‌జ‌న చ‌ట్టంలోని షెడ్యూల్ 9, 10 కింద సుమారు 6ల‌క్ష‌ల కోట్ల విలువైన ఏపీ ఆస్తులు తెలంగాణ‌లో ఉన్నాయి. వాటిని విభ‌జించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఆనాడు ఏ మాత్రం చ‌ర్చ జ‌ర‌గ‌కుండా రాష్ట్రాన్ని యూపీఏ ప్ర‌భుత్వం విభ‌జించింది. ఫ‌లితంగా అంచ‌నా వేయ‌లేని ఏపీ ప్ర‌జ‌ల శ్ర‌మ‌, ప్ర‌జా ఆస్తులు తెలంగాణ‌లోని వివిధ ప్రాంతాల్లోనే ఉండిపోయాయి. వాటి గురించి క్లారిటీ ఇవ్వ‌కుండా త‌యారు చేసిన‌ ఏపీ విభ‌జ‌న చ‌ట్టం సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. దానిపై స‌మ‌ర్థ‌వంత‌మైన వాద‌న వినిపించాల్సిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సర్కార్ ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అందుకే, బాధ‌ప‌డుతూ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మీడియా ముందుకు వ‌చ్చారు. ప్ర‌భుత్వాన్ని అప్ర‌మ‌త్తం చేసే ప్ర‌య‌త్నం చేశారు. దాన్ని కూడా రాజ‌కీయ కోణం నుంచి తిప్పుతూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు, ఆస్తుల‌ను కేసీఆర్ స‌ర్కార్ కు ధారాద‌త్తం చేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధం అయ్యార‌ని విప‌క్షాల ఆరోపణ‌.

`2012, జనవరి 30న ఏం జరిగిందో తన వద్ద పూర్తి సమాచారం ఉంది. రాజ్యాంగంలోని 100వ ఆర్టికల్ ను పక్కకునెట్టి రాష్ట్ర విభజన చేశారు. ఏకపక్షంగా జరిగిన రాష్ట్ర విభజన పై సుప్రీం కోర్టులో మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ కేసులో కేంద్రం ఇప్పటి వరకు కౌంటర్ వేయలేదు. కేసు విచారించాలా లేదా అనే అంశం మీద ముందుగా ప్రభుత్వం కౌంటర్ వేయాలని ధర్మాసనం సూచించింది.` అంటూ ఉండ‌వ‌ల్లి (undavalli)వివరించారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం వదిలేయమంటూ అఫిడవిట్ వేయటం తెలంగాణ‌కు ఏపీ ఆస్తుల‌ను ధార‌ద‌త్తం చేయ‌డ‌మేనంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విభ‌జ‌న‌ హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు. అయిన‌ప్ప‌టికీ కేసును లైట్ గా తీసుకున్న ఏపీ ప్ర‌భుత్వంపై ఉండ‌వ‌ల్లి తిరగ‌బ‌డ్డారు.

ఫిబ్రవరి 22న రాష్ట్ర విభజన పైన సుప్రీంకోర్టులో తుది విచారణ జరగనుంది. ఏపీకి జరిగిన అన్యాయం వివరిస్తూ కోర్టులో అఫిడవిట్ వేయాలి. ఏపీ విభజన బిల్లు ఆమోదించే సమయంలో లోక్ సభలో ప్రత్యక్ష ప్రసారం ఆపేసి, రాజ్యసభలో ఓటింగ్ లేకుండానే బిల్లు ఆమోదించారు. అలాంటి ప‌రిస్థితిని వివ‌రిస్తూ ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం సుప్రీం కోర్డులో పోరాడాల్సిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ దాన్ని కూడా రాజ‌కీయం చేస్తోంది. సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాజ‌కీయ కోణం నుంచి చూస్తున్నారు. ఏపీ మళ్లీ ఉమ్మడిగా ఉండాలన్నదే తమ పార్టీ విధానం అని, రెండు రాష్ట్రాలు కలిసిపోతే మొదట స్వాగతించేది వైసీపీనంటూ అసాధ్య‌మైన అంశాన్ని లేవ‌నెత్తారు.

పనిగట్టుకుని జగన్ వైపు వేలెత్తి చూపించేలా ఉండవల్లి వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని రాజ‌కీయ ర‌చ్చ‌లోకి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను లాగడంపై స‌ర్వ‌త్రా నెల‌కొన్న విమ‌ర్శ‌లు. సుప్రీంలో ఉన్న కేసును బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ బాధ్య‌త వ‌హించాల‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి చెప్ప‌డం స‌గ‌టు ఏపీ పౌరుడికి ఆగ్ర‌హం క‌లిగించేలా ఉందని స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. విభజన అంశాలను ఇక వదిలేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయ‌డంపై సూటిగా స‌మాధానం ఇవ్వ‌కుండా రెండు రాష్ట్రాల‌ను క‌లిపితే బాగుంటుంద‌ని స‌జ్జ‌ల‌ చెప్ప‌డం విడ్డూరం. ఏపీకి అన్యాయం జరుగుతోందని తెలిసి కూడా జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ప్ర‌శ్నిస్తున్నారు. సుప్రీం కోర్టులోని విభ‌జ‌న హామీల‌పై పోరాడ‌కుండా ఆ విషయాన్నే విస్మరిస్తూ, విభజన గురించి వదిలేస్తూ అఫిడ‌విట్ వేయ‌డం జ‌గ‌న్మోహన్ రెడ్డి స‌ర్కార్ పై అనుమానాల‌ను రేకెత్తిస్తోంది.