Ganta : జగన్ పుణ్యమా అని రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందిః గంటా

  • Written By:
  • Publish Date - February 15, 2024 / 11:05 AM IST

 

 

ap capital issue : వైసీపీ(ysrcp) కీలక నేత వైవీ సుబ్బారెడ్డి ఏపీకి రాజధాని(capital) ఏర్పాటయ్యేంత వరకు హైదరాబాద్(hyderabad) ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యాలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ(tdp) నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) ఎక్స్ వేదికగా స్పందిస్తూ వైవీ సుబ్బారెడ్డి, సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే కొత్త పల్లవి.. ఇది మీ స్టాండ్ నా? లేక మీ పార్టీ స్టాండ్ నా సుబ్బారెడ్డి గారు? అని ఆయన ప్రశ్నించారు. మూర్ఖుడు రాజు కంటే బలవంతుడని… ఇక రాజే మూర్ఖుడు అయితే ఆ రాజ్యం ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ లా తయారవుతుందని అన్నారు.

ఆంధ్ర రాష్ట్రం ముక్కలై, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి దాదాపు తొమ్మిదేళ్లు గడుస్తోందని.. జగనన్న పుణ్యమా అంటూ ఇంతవరకు రాజధాని లేని రాష్ట్రంగానే ఏపీ మిగిలిపోయిందని గంటా మండిపడ్డారు. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రగామి ప్రాంతమని, దీనికి ఒక్క రాజధాని సరిపోదని మూడు రాజధానులు ఉండాలని తొలుత చెప్పారని… ఆ తరువాత మూడు కాదు… విశాఖ ఒక్కటే రాజధాని అంటూ మరో కొత్త పాట పాడారని విమర్శించారు. చివరకు అది కూడా చేయలేక రుషికొండపై ఓ బిల్డింగ్ కట్టి… ‘అదిగో అల్లదిగో జగనన్న వాసమూ’ అంటూ మరో కొత్త పాట పాడారని ఎద్దేవా చేశారు. దాని కోసం వందల కోట్లు ఖర్చుపెట్టేశారని… చివరకు ఆ ఇంట్లో దిగే సాహసం కూడా చేయలేకపోయారని అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ మరొక కొత్త డీజే సాంగ్ ప్లే చేస్తున్నారని దుయ్యబట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

80 శాతం పూర్తయిన అమరావతి కట్టడాలపై శ్రద్ధ వహించి ఉంటే.. ఇప్పటికే అమరావతి సస్యశ్యామలంగా వర్ధిల్లి ఉండేదని గంటా అన్నారు. ఎన్నికల ముందు అమరావతిని స్వాగతించిన వ్యక్తి… అధికారంలోకి రాగానే మాట మార్చి, మడం తిప్పి, మోసం చేశారని విమర్శించారు. విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అడిగితే దిక్కులు చూసే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాలలో చదువుతున్న మన పిల్లలను ‘మీ రాజధాని ఏది?’ అంటూ తోటి విద్యార్థులు ఆటపట్టిస్తున్నారని వారు వాపోతున్నారని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే ప్రజలు మిమ్మల్ని ఛీ కొడతారు జగనన్న అని అన్నారు.

రేపు వైసీపీలో అందరూ హైదరాబాద్(hyderabad) రాజధాని అనే కోరస్ పాడటం మొదలుపెడితే ఏమవుతుంది? అంటే ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్లు మళ్ళీ పురిగొల్పాలని మీ ప్రయత్నమా? ఈ ఐదేళ్ళ మీ తుగ్లక్ వైఫల్యాలపై నుంచి ప్రజల దృష్టి దీనిపైకి మళ్ళించవచ్చని భావించి ఈ ‘వ్యూహం’ ‘సిద్ధం’ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కానీ రాష్ట్ర ప్రజలు మీ గిమ్మిక్కులు నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు అని చెప్పారు. మీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ప్రతి పౌరుడు కంకణం కట్టుకున్నాడని అన్నారు.

read also : Kansas City Shooting: అమెరికాలో కాల్పుల ఘ‌ట‌న‌.. ఒక‌రు మృతి, 21 మందికి గాయాలు..!