AP Registrations : ఏపీలో రిజిస్ట్రేషన్‌ సేవలు ఇక సులభతరం.. ఇ-స్టాంపింగ్‌ సేవలు ప్రారంభం

రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇ-స్టాంపింగ్‌ సేవలను సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. దీనివల్ల రిజిస్ట్రేషన్‌ సేవలు మరింత సులభతరం అవ్వనున్నాయి.

  • Written By:
  • Publish Date - April 21, 2023 / 06:45 PM IST

ఏపీలో ఆదాయం తెచ్చే శాఖలపై మరింత ఫోక్స్ పెట్టారు సీఎం జగన్. ఆ శాఖల్లో అవినీతికి తావు లేకుండా, ప్రజలకు సేవలు అందుబాటులో ఉండాని భావించారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ & స్టాంపులు(Stamps) శాఖ ఆదాయం వృద్ది చెందినట్టుగా అధికారులు జగన్(YS Jagan) కు తెలిపారు. గత ఐదేళ్లుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం 2018-19లో రూ. 4725 కోట్లు కాగా, 2022-23 నాటికి రూ. 8071కోట్లకు చేరింది.

దీంతో రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇ-స్టాంపింగ్‌ సేవలను సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. దీనివల్ల రిజిస్ట్రేషన్‌ సేవలు మరింత సులభతరం అవ్వనున్నాయి. ప్రజలే నేరుగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు ఈ ఇ-స్టాంపింగ్‌ విధానంతో చెల్లించవచ్చు. ప్రజలే స్వయంగా దస్తావేజులు తయారు చేసుకుని సులభతరంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

ఇ–స్టాంపింగ్‌ విధానం సురక్షితమైనది, భద్రతగలది మరియు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేనిది. www.shcilestamp.com వెబ్‌సైట్‌లో మరియు ఇ–స్టాంపింగ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఇ–స్టాంపులు ఆన్‌లైన్‌లో దృవీకరించుకోవచ్చు. నగదు,చెక్కు,ఆన్‌లైన్‌ (నెఫ్ట్, ఆర్టీజీఎస్, పీఓఎస్,యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఎస్‌బీఐ,ఆప్కాబ్, యూనియన్‌ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్‌లు, సీఎస్‌సీ కేంద్రాలు, స్టాంప్‌ అమ్మకందార్లు, స్టాక్‌హోల్డింగ్‌ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400కు పైగా కేంద్రాల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. మరొక 1000కి పైగా కేంద్రాల వద్ద త్వరలో ఈసేవలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పుడు ఏపీలో క్రయవిక్రయాలు నిర్వహించే పౌరులందరూ 1400కు పైగా ఎంపిక చేసిన కేంద్రాల వద్ద ఇ–స్టాంపింగ్‌ ద్వారా స్టాంప్‌ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ ఛార్జీలను చెల్లించవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్లు, టౌన్ ప్లానింగ్‌ విభాగాలు, మండల కార్యాలయాలు, గ్రామవార్డు సచివాలయాలు సహా ఇతర చోట్ల ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని, సేవలు అందించడంలో అత్యంత పారదర్శకత ఉండాలని, ఎవరికి ఫిర్యాదు చేయాలన్న దానిపై ఏసీబీ నంబర్లను కూడా ఆయా కార్యాలయాల్లో ప్రముఖంగా కనిపించేలా ఉంచాలని అధికారులకు తెలిపారు. వచ్చే సమీక్షా సమావేశం నాటికి మంచి మార్పులు కనిపించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

 

Also Read :   Aadhaar Update: ఆధార్ అప్డేట్ చేస్తున్నారా.. అయితే ఈ కొత్త విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి?