Site icon HashtagU Telugu

AP Ration Cards: సామాన్యులకు ప్రభుత్వం తీపి కబురు.. ఇకపై అవన్నీ సబ్సిడీ లోనే..

Ap Ration Cards

Ap Ration Cards

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఉన్నవారికి మంచి వార్త ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వంటనూనెలను తక్కువ ధరలతో అందించాలన్న నిర్ణయం తీసుకుంది. పామాయిల్ లీటరు 110 రూపాయలకు, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు 124 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వంటనూనెల దిగుమతిదారులతో సమావేశం నిర్వహించారు. వారు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తగినంత స్టాక్ అందుబాటులో ఉంచాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా సబ్సిడీపై అందిస్తున్న వంటనూనెకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుందని చెప్పారు మంత్రి మనోహర్. అందువల్ల, దిగుమతిదారుల నుంచి సరఫరా సమస్యలు లేకుండా సప్లై పెంచేందుకు ఈ సమావేశం నిర్వహించామన్నారు. కేంద్రం దిగుమతి సుంకం పెంచడంతో వంటనూనెల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, అందుకే వారికి సబ్సిడీపై వంటనూనెలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి దిగుమతి దారులను సప్లై పెంచాలని, సరైన సమయంలో సరఫరా అందించాలని ఆదేశాలు జారీ చేసారు.

మరొక వైపు, మంత్రి మనోహర్ రాయితీపై అందించే కందిపప్పు సరఫరాలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ఆరా తీసి, సరఫరాదారులను ప్రశ్నించారు. నాణ్యమైన కందిపప్పు అందించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం నష్టాలను భరిస్తూ తక్కువ ధరకు కందిపప్పు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే ముందుగా తెలియజేయాలని ఆయన సూచించారు.

కందిపప్పు సరఫరా దారులు ప్రజలకు సహకరించాలని మంత్రి మనోహర్ కోరారు. టెండర్‌లో పేర్కొన్న విధంగానే కందిపప్పును పూర్తిస్థాయిలో సరఫరా చేయాలని ఆయన ఆదేశించారు. నాణ్యమైన కందిపప్పు అందించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు కందిపప్పును కొనుగోలు చేసి, సబ్సిడీ ధరలపై పేద ప్రజలకు సరఫరా చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్నది. ఈ నెలలో రైతు బజార్లలో తక్కువ ధరలకు వంటనూనెలు, ఉల్లిపాయలు, టొమాటోలు అందించిన విషయం తెలిసిందే. ప్రజలకు వంట నూనెల్ని సబ్సిడీపై అందుబాటులో ఉంచుతామన్నారు.